కడప: సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్‌కేఫ్‌లపై పోలీస్ నిఘాను పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషీ తెలిపారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌నెట్ వినియోగదారుల గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన రియలన్స్ సంస్థ రూపొందించిన ‘క్లింక్ సైబర్ కేఫ్ మేనేజర్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌కేఫ్ నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు కడపలోని హరిత హోటల్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ … ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ ఖాతాల నుంచి సొమ్ము స్వాహా చేయటం, ఖాతానెంబర్లను ట్రేస్ చేసి ఏటీఎంల నుంచి డబ్బులు అక్రమంగా డ్రా చేయటం వంటి నేరాలు అధికమయ్యాయన్నారు. అలాగే, ఇంటర్‌నెట్ సెంటర్ల ద్వారా అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని మహిళల సెల్‌ఫోన్లకు పంపిస్తూ వేధించటం వంటి నేరాలు సాధారణమయ్యాయన్నారు. వీటన్నింటి కంటే దేశద్రోహానికి పాల్పడే తీవ్రవాదుల కార్యకలాపాలకు కూడా సైబర్ సెంటర్లు కేంద్రాలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తోందన్నారు.
నిర్వాహకులు సందర్శకుల గురించి ఎలాంటి వివరాలు సేకరించకపోవటం వల్ల నేరస్తులు యథేచ్ఛగా ఇంటర్‌నెట్‌ను ఆసరాగా చేసుకుని సైబర్‌కేఫ్‌ల ద్వారా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సైబర్‌కేఫ్‌ల నిర్వాహకులు తమ కేంద్రాలకు వచ్చే వారిని గుర్తించేందుకు వీలుగా కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ముంబైకి చెందిన‘ ఐడియాక్ట్స్ ఇన్నోవేషన్ సంస్థ’తో పోలీసుశాఖ అనుసంధానంగా ఇందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను కడప నగరంలోని సైబర్‌కేఫ్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామన్నారు. ఇంటర్‌నెట్ కోసం వచ్చే వినియోగదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుందన్నారు.
ఇంటర్‌నెట్ వినియోగించేందుకు సైబర్‌కేఫ్‌లకు వెళ్లే వినియోగదారులు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు ఆధారాలను తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎస్పీ సూచించారు. గుర్తింపు ఆధారాలు లేని వినియోగదారులను నెట్ వినియోగానికి అనుమతించకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా కడపలోని అన్ని కేంద్రాల్లో ఈ పద్ధతి అమలులోకి వచ్చే విధంగా చూస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో జిల్లాలోని అన్ని సైబర్‌కేఫ్‌లలో ఈ విధానం అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంటర్‌నెట్ కేంద్రాలకు వెళ్లే వినియోగదారులు కలిగి ఉండాల్సిన ఆధారాలు:
- ఫొటో గుర్తింపు కార్డు
- ఉద్యోగులైతే వారి జాబ్ ఐడెంటిటీ లేదా పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి
- మొబైల్‌నెంబర్‌తో పాటు, అడ్రస్‌ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫొటో
- మహిళలకు ఫొటో, మొబైల్ నెంబర్ల నుంచి మినహాయింపు ఉంటుంది. ఫొటో ఐడెంటిటీప్రూఫ్ తప్పక కలిగి ఉండాలి.
- విద్యార్థులు కళాశాలకు చెందిన ఐడీ ప్రూఫ్ కలిగి ఉండాలి.
Its a good step taken by Kadapa Police that to get awareness of internet threats going on now a days. Every one should use a unique software to overcome the internet problems.