కడప : మోముపై చెరగని చిరునవ్వు… తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు… నడకలో ఠీవి… నమ్ముకున్న వారిని ఆదరించే గుణం… మాట తప్పని, మడమ తిప్పని నైజం… అన్నదాతల కోసం ఎంతైనా చేయాలన్న తపన.. ఈ లక్షణాలన్నీ ఎవరివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటు సొంత పార్టీ నేతలతో, అటు విపక్షాలతోనూ ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు నడిచారు.
2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృత్యువాతపడ్డ వైఎస్‌ఆర్ 61వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లను పూర్తి చేయగా మరో వైపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన వైఎస్.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో మెడిసిన్ చదువుతూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీచేసి చైర్మన్‌గా గెలుపొందారు.
రాజకీయ ప్రస్థానం:
తిన్నింటి వాసాలను లెక్కపెట్టే నేటి సమాజంలో విశ్వసనీయతే ముఖ్యమని, మాట ఇస్తే ఎంత కష్టమైనా నెరవేర్చాలని భావించే రాజకీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతుల రెండో సంతానం. గుల్బర్గాలో మెడిసిన్ పూర్తి చేసిన అనంతరం జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా ఒక ఏడాది సేవలందించారు. అటు తర్వాత పులివెందులలో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరున 30 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు.
అనతి కాలంలోనే పేదల డాక్టరుగా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొం దారు. 1977లో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారిగా పులివెం దుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20,496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి నుంచి 2009 వరకు ప్రతిసారీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా ఘనతకెక్కారు.
కరవుబారిన పడిన రాష్ట్ర ప్రజలను పరామర్శించేందుకు పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచారు. దీంతో ముఖ్యమంత్రి పదవి వైఎస్‌ను వరించింది. 2004 మే 14న డాక్టర్ వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ వ్యవసాయ బకాయిలు 1200 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ రెండవ సంతకాన్ని చేశారు. అటు తర్వాత తన పాలనలో ఇచ్చిన వాగ్దానాలతో పాటు అదనంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి అనేక పథకాలను రూపొందించారు.
‘కాకిలా కలకాలం బతకడం కంటే… హంసలా ఆరు నెలలు జీవించినా చాలు’ అని తరచూ అంటుండే ఆయన తన పాలనా కాలంలో పేదలకు స్వర్ణయుగం చూపించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, పావలావడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, పేద విద్యార్థులకు ఫీజుల రియింబర్స్‌మెంట్ , జలయజ్ఙం, 108, 104 వైద్య సేవలు, కిలో రెండు రూపాయల బియ్యం, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు…ఒకటేమిటి అన్ని వర్గాల వారికి అనువైన పథకాలను రూపొందించారు. వాటి అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శస్తూ ప్రాంతాలకు అతీతంగా అమలు పరిచారు.
2009 ఎన్నికలలో విశ్వసనీయత పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయన 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను గెలిపించారు. 2009 మే 20న మరోమారు ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. మాట ఇస్తే తప్పడన్న భావన ప్రజలు, అనుచరులలో పూర్తిగా నెలకొంది. ప్రభుత్వ పథకాల తీరు తెన్నులను పరిశీలించేందుకు రచ్చబండ కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళుతూ పంచభూతాల్లో ఆ మహానేత ఐక్యమయ్యారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాదిమంది అశువులు బాశారు.
కడపపై చెరగని ముద్ర:
కడప జిల్లా నిర్లక్ష్యపు నీడలో మగ్గుతుండేది. ఆరేళ్ల కిందట ఆ బంధనాలు తెంచుకుని అభివృద్ధి వైపు పరుగులు తీసింది. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ‘కన్న తల్లి – సొంత ఊరు’ అన్న రీతిలో రాజకీయ జీవితంలో వెన్నంటి నిలచిన కడప జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా పయనింపజేశారు. మున్సిపాలిటిగా ఉన్న కడపను నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేశారు. రాయచోటి, బద్వేల్, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా రూపొందించారు.
జిల్లా కేంద్రంలో రూ.130 కోట్లతో రిమ్స్ వైద్యశాలను, 750 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, రూ.22 కోట్లతో దంత వైద్య కళాశాల, ట్రిపుల్ ఐటీ, 21వ శతాబ్దం గురుకులం, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశు వైద్య విద్య కళాశాల, యోగివేమన యూనివర్శిటీ లాంటి విద్యా సంస్థలను నెలకొల్పారు. యురేనియం కర్మాగారం, ఐజీ కార్ల్ పశు పరిశోధన కేంద్రం, దాల్మియా సిమెంటు కర్మాగారం, బ్రహ్మణీ స్టీల్స్, గోవిందరాజ స్పిన్నింగ్ మిల్స్, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల ఫాలిమర్స్ లాంటి పరిశ్రమలను నెలకొల్పి పారిశ్రామిక ప్రగతిని సాధించారు.
జిల్లాలో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు డాక్టర్ వైఎస్ హయాంలో కదలిక వచ్చి పరుగులు పెట్టాయి. ఎన్నికల సమయంలోనే శంకుస్థాపనలు చేసే తెలుగుదేశం పార్టీ నేతలకు కనువిప్పు కలిగించారు. 11వేల కోట్ల రూపాయలు జలయజ్ఙంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. ఎన్టీఆర్ హయాంలో రూపొందించిన ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేశారు. గాలేరు-నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్ హయాలో రూపొందించారు. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయసాగర్, బుగ్గవంక సుందరీకరణ, సీబీఆర్ ప్రాజెక్టు, పీబీసీ, వెలిగల్లు ప్రాజెక్టు పనులు చకచక సాగాయి.
ఫ్యాక్షన్ కనుమరుగు
వైఎస్‌పై ఫ్యాక్షనిస్టుగా ముద్ర వేసి ప్రజా జీవితంపై బురదజల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన సంభవించినా అందుకు వైఎస్సే కారకడంటూ నిందలు వేయసాగారు. వైఎస్‌పై ఫ్యాక్షనిస్టునిగా ముద్ర వేసి తాను మనుగడ సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఎస్పీ ఉమేష్ చంద్రను పావుగా వాడుకుని అనేక ఇబ్బందులకు గురి చేసింది. 1990 దశకం నుంచి ఫ్యాక్షన్‌ను రూపుమాపేందుకు వైఎస్ విశేషంగా కృషి చేశారు.
పులివెందులలో అంబకపల్లెలో అప్పట్లో విపరీతమైన ఫ్యాక్షన్‌ఉండేది. ఫ్యాక్షనిస్టులు మురళీకృష్ణారెడ్డి, బాలిరెడ్డిలను రాజీ చేశారు. తన తండ్రి వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారిని సైతం చట్ట రిత్యా ఎదుర్కొవడం తప్ప ప్రత్యక్ష దాడికి పూనుకోలేదు. అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ మరుగున పడేందుకు అభివృద్ధిపై విశేషంగా దృష్టి సారించారు.
భూ దాత
పరిమితికి మించిన భూములున్నాయన్న విషయం తెలుసుకున్న వైఎస్ స్వయంగా ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. తన భూములలో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న వారికి పట్టాలు ఇప్పంచారు. పెనగలూరు మండలం కొండూరు ఎస్టేట్‌లోని 1100 ఎకరాల భూములను వ్యవసాయ కూలీలకు పంపిణీ చేశారు. అలాగే ఇడుపులపాయలోని 310 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీన పరిచారు.
కర్షక సామ్రాట్
వైఎస్‌కు వ్యవసాయమంటే ఎనలేని మక్కువ. వ్యవసాయంతో పాటు అనుబంధ ఉత్పత్తులపై కూడా దృష్టి సారిస్తే రైతు మనుగడ సాధ్యమని తరచూ చెప్పే వారు వై ఎస్. దీన్ని తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరణలో చూపెట్టారు. వైఎస్ ఎస్టేట్‌గా గుర్తింపు పొందిన ఇడుపులపాయతో వైఎస్‌ది విడదీయరాని అనుబంధం. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో 60 సార్లు పర్యటించిన ఆయన ప్రతి సందర్భంలోనూ ఇడుపులపాయలోనే విశ్రాంతి తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం రూపొందించిన ట్రిపుల్ ఐటీని ఇడుపులపాయలోని తన సొంత భూముల్లోనే నెలకొల్పారు. వై ఎస్ మృతితో జిల్లాలో అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఙం పనులు పెండింగ్‌లో పడిపోయాయి.
ఆశలు జగన్‌పైనే
ఇప్పుడు జిల్లా ప్రజల ఆశలన్నీ యువనేత, కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనే ఉన్నాయి. తండ్రి చేపట్టిన పథకాలు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్న జగన్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ చేపట్టిన పథకాలన్నీ పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. తన తండ్రి చేపట్టిన వివిధ పథకాలకు నిధులను మంజూరు చేసేందుకు తన పోరాటాన్ని ప్రారంభించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగానే పావలా వడ్డీ రుణాలు, రేషన్ కార్డులు, ఫీజుల రియంబర్స్‌మెంటు తదితర పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధిని భవిష్యత్ తరాలు కూడా గుర్తించుకుంటాయనడంలో సందేహం లేదు.
I LIKE U