Tourist Attractions

పోతన మనుమలు స్తుతించిన ఒంటిమిట్ట వరకవి సార్వభౌముడు

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు.  వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది.  వీరు జంటకవులు.  విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు.  దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు.  ఆ గ్రంథం అముద్రితం.  వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను.  ఆ పద్యమిది.

చ||   నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్‌

బరువడి మత్పితామహుని బమ్మెరపోతన భాస్కరాహ్వయున్‌

వరకవి సార్వభౌముని నవారితభక్తి నుతింతు నెప్పుడున్‌

గురుకరుణాఢ్యు లంధ్రకవి కుంజరులం దగ భూతి శోభిలన్‌.

వారీ పద్యంలో నన్నయను తిక్కనను శంభుదాసుని పోతనను భాస్కరుని స్తుతించినట్లు మాత్రమే ఊహించే అవకాశముంది.  తరువాతి ‘వరకవి సార్వభౌముని’ భాస్కరునికి ఉపపదంగా భావిస్తారు.  తమ పితామహుడో, ప్రపితామహుడో అయిన పోతనకు అదనపు సంబోధన లేదు.  భాస్కరాహ్వయుని అన్న తరువాత మరీ పొడిగిస్తూ ఆయనని ‘వరకవి సార్వభౌముడు’ అంటూ ప్రశంసించి ఉంటారా? అనలేదనియే నేను భావిస్తున్నాను.  అందుక్కారణం, సాహిత్య చరిత్రలో ‘వరకవి’ యొకడున్నాడు.  ఆయన అసలు పేరు నల్లకాల్వ అయ్యప్ప.  ఈయన ఒంటిమిట్ట రఘునాథస్వామిని అర్చించినాడు.  ఆ స్వామివరంతో ‘వరకవి’ అయినాడు.  ఆయనను గురించియే ఈ ప్రశంస.

ఈ ‘వరకవి’ నల్లకాల్వ అయ్యప్పకు, పోతన మనుమలో, ముమ్మనుమలో అయిన కేసన మల్లనలు సమకాలికులు.  ‘వరకవి’ ప్రతిభను గుర్తించారు.  ఆయన పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి ఉన్నారు.  కావుననే వారు తమ ‘సుకవి స్తుతి’లో ‘వరకవి సార్వభౌముని’ అని ప్రశంసించారు.

‘వరకవి’ అంతటివాడా అని ప్రశ్నించవచ్చు.  ‘వరకవి’ని గూర్చి మరికొంత తెలుసుకుందాం.  ఈయన గొబ్బూరి ఓబరాజుగారి దగ్గర కృతులు చెప్పాడు (వివరాలు తెలియవు).  పల్లకి మొదలైన సత్కారాలు పొందాడు.  విజయనగర రాజులలోని రెండవ వెంకటపతి రాయల పట్టపురాణి సోదరుడు జగ్గరాజు.  ఆ జగ్గరాజు కుమారుడే ఈ వోబరాజు.

Read :  Aastan-e-Muradia - Kadapa

రెండవ వెంకటపతి రాయల సభలోను ‘వరకవి’కి ప్రవేశముంది.  అక్కడ దుష్కవుల గర్వాన్ని అణచాడు.  తన సంగీత సాహిత్యాలతో రాజును మెప్పించాడు.  ‘భీమవరం’ అగ్రహారంగా పొందాడు.  ఈ భీమవరం నెల్లూరు జిల్లాలోనిది.  వరకవిపూడి యని నెల్లూరు జిల్లాలో ఒక గ్రామం ఉంది.  వరకవి ఇంటిపేరు వారు ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో ఉన్నారు.

రెండవ వెంకటపతి రాయల పరిపాలనా కాలం 1586 నుంచి 1614 వరకు.  రామరాజు మరణానంతరం 1585లో చంద్రగిరిలో పట్టాభిషిక్తుడైనట్లు తెలుస్తున్నది.  గొబ్బూరి వోబరాజు సర్వసైన్యాధ్యక్షుడే గాక సమస్త రాజ కార్యాలు నిర్వహించేవాడు.  వెంకటపతిరాయలు 1592లో పెనుగొండ నుండి తన రాజధానిని చంద్రగిరికి మార్చాడు.  ‘విజయనగర చరిత్ర’లో రాజధానిని నెల్లూరుకు మార్చినట్లును ఉన్నది.

‘వరకవి’ నల్లకాల్వ అయ్యప్ప మొదట వోబరాజును ప్రసన్నం చేసుకొని తన సంగీత సాహిత్యాలతో వెంకటపతి రాయల కొలువు కూటంలో స్థానం సంపాదించుకొన్నాడు.  భువన విజయ కవులకు తక్కువేం కాకుండా రాజ సత్కారాలు అనుభవించాడు.

అంతటివాడు కనుకనే కేసన, మల్లనలు తమ స్తుతిలో ‘వరకవి సార్వభౌముని’ అని అన్నారు.  వీరు సమకాలికులు మాత్రమే కాదు, బాగా పరిచయమున్న వారు అని చెప్పడానికి అవకాశం లేకపోలేదు.

ఈ కేసన మల్లనలు తాము రచించిన దాక్షాయణీ పరిణయాన్ని గురజాల మల్లన సోమయాజికి అంకితమిచ్చారు.  గురిజాల గుంటూరు జిల్లాలోను, వరంగల్లు జిల్లాలోను మాత్రమేకాక, కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలంలో ఉంది.  కాబట్టి ఒంటిమిట్టలో నివసించిన కేసన మల్లనలు సింహాద్రిపురం మండలంలోని గురజాలకు చెందిన మల్లన సోమయాజికే అంకితమిచ్చి ఉంటారు.  ఈ గురజాలకు సమీపంలోనే పులివెందుల మండలంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన మోపూరు క్షేత్రముంది.  కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఈ మోపూరు భైరవస్వామి క్షేత్రంలో కొంతకాలం విడిది చేసినట్లు చరిత్ర చెబుతున్నది.

‘వరకవి’ని గురించిన ఈ సమాచారం మీకెక్కడిదనవచ్చు.  మెకంజీ కైఫీయత్తులు యం. 344 భాగం 19వ పుటలో చూడండి.  ఆయన వంశపరంపరలోని వాడు భీమవరం అగ్రహారికుడు వ్రాయించి యిచ్చిన సమాచారంలో ఈ వైనం ఉన్నది.  ఆ వివరాల్లోకి వెళ్లితే నల్లకాల్వ వరకవి వంశం తక్కువయిందేమీ కాదు.

Read :  ఆరోగ్య కేంద్రాలకు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభోత్సవం

‘వరకవి’ అయ్యప్ప కుమారుడు ‘సీతాపతి’ శత్రుసంహార శతకం చెప్పాడు.  ఆయన కుమారుడు ‘కొండప్ప’ గోలకొండ రాజును మెప్పించి జయస్తంభం వేయించాడు.  ఆయన కుమారుడు ‘వెంకటరామప్ప’ ఛందశ్శాస్త్రం చెప్పాడు (పేరు వ్రాయలేదు).  ఆయన కుమారుడు ‘లింగప్ప’ కువలయానందాన్ని అనువదించాడు.  ఆయన కుమారుడు ‘సీతారామప్ప’ పార్వతీ పరిణయం చెప్పాడు.  ఆయన కుమారుడు ‘వెంకటరామన్న’ వ్రాయించి యిచ్చిన ఈ పై సమాచారం కైఫీయత్తులో నమోదై వున్నది.  ఈ పత్రిక వ్రాసినది శ్రీముఖనామ సంవత్సరం చిత్రి మాసం 6వ తేదీ.  అంటే క్రీ.శ. 1813లో నన్నమాట.

ఈ ‘వెంకటరామన్న’ నుండి ఏడు తరాల పూర్వపువాడు ‘వరకవి’.  పదునైదవ శతాబ్దానికి చెందిన పోతనకు ముమ్మనుమలు కేసన, మల్లనలు.  తరానికి 30-35 సంవత్సరాల ప్రకారం లెక్కగట్టి అటూ ఇటూ చూస్తే ‘వరకవి’ పోతన మనుమలకు సమకాలికుడవుతున్నాడు.  ఈ సోదర కవులకంటే ‘వరకవి’ వయస్సులోనూ, కవిత్వ పాండిత్యాల్లోనూ పెద్దవాడు కావటం వల్ల బాగా పరిచయం ఉన్నవాడు కావటంవల్ల ఆ కవిద్వయం ఆయనను ‘వరకవి సార్వభౌముడ’ని కీర్తించారు.

సంగ్రహ వివరణం :

1.    కేసన మల్లనలు దాక్షాయణీ పరిణయాన్ని రచించిన సోదర కవులు.

2.    వీరు బమ్మెర పోతనామాత్యునికి మనుమలు.

3.    దాక్షాయణీ పరిణయం కవిప్రశంసలో వరకవి సార్వభౌముని స్తుతించినారు.  ఇది భాస్కరునికి బిరుద వాచకం కాదు.  కవిసార్వభౌముని స్తుతించి ఉంటే ‘వర’ చేర్చనవసరం లేదు.

4.   వరకవి పేర నల్లకాల్వ అయ్యప్ప జీవిత విశేషాలు మెకంజీ కైఫీయత్తులలో లభిస్తున్నవి.  నల్లకాల్వ ఇప్పటి ప్రకాశం జిల్లాలో ఒక గ్రామం.

5.    ఒంటిమిట్ట రఘునాథుని సేవించి నల్లకాల్వ అయ్యప్ప వరకవి అయినాడు.  ఈతని తరువాతి వంశీయులు నాలుగైదు తరముల దాకా కవి పండితులు.  శత్రుసంహార వేంకటాచల విహార అన్న నిందాస్తుతి శతకాన్ని చెప్పిన సీతాపతి  వరకవి కుమారుడే.

Read :  దేవునికడపలో వైభవంగా ధ్వజారోహణం

6.         వరకవి గొబ్బూరి ఓబరాజును ఆ తర్వాత రెండవ వెంకటపతి రాయలను దర్శించి ఆందోళికాది (పల్లకి) సత్కారాలతో పాటు భీమవరాన్ని అగ్రహారంగా పొందాడు.

7.   పోతన కాలాన్ని పరిగణించి వారి మనుమలు కేసన మల్లనల కాలాన్ని లెక్కబెడితే రెండవ వెంకటపతి రాయలకు సమకాలికుడే అవుతున్నాడు.

8.     నే నీవిధంగా ఆలోచించడానికి ఆధారం ఆంధ్రమహా భాగవతానికి వావిళ్లవారి ప్రతి (1926)లోని శేషాద్రిరమణ కవుల ఆంధ్రభాగవత విమర్శము – పుట 59, తేది 16.10.1922.

మెకంజీ కైఫీయత్తులు యం.ఓ.ఎల్‌. యం. 344 పేజీ 19, 20 (నకలు)

నల్లకాల్వ వరకవి వేంకటరామన్న భీమవరం అగ్రహారికుడు వ్రాయించి యిచ్చిన కైఫియ్యతు శ్రీముఖనామ సంవత్సర చిత్రి నెల 6 తేది వెంకటగిరి శీమలో చేరిన భీమవరం అగ్రహారికులైన నల్లగాల్వ వరకవి వెంకటరామన్న వ్రాశియిచ్చిన వైనం –  ‘మీ గ్రామాన్కు వుండే దానపత్రం తెమ్మని చెప్పితిరి గనుక ఆ గ్రామానకు వుండే దానపత్రం బహదరు అవాంతరంలో పోయినది. పూర్వం మా కూటస్తుడైన నల్లగాల్వల వరకవి అయ్యప్ప వంటిమిట్ట రఘునాథస్వామివారి దగ్గిర వరం సంపాదించుకొని గొబ్బూరి జగ్గరాజు వోబరాజుగారి మీద కృతులు చెప్పి పాలకి మొదలైన బహుమతులు తీసుకొని వెంకట్రాయలవారి కచ్చేరిలో విద్యాప్రకటం చేశి దుష్టకవుల గర్వభంగం మొనరించి సంగీతసాహిత్యములచేత మెప్పించి యీ అగ్రహారం దానపత్రంతో కూడా వారిచేత సంపాదించుకొని అనుభవిస్తూవచ్చెను. వారి కొమారుడు శత్రుసంహార శతకం చెప్పించి శేషాచల స్వామిచేతను వరం తీసుకున్న శీతాపతి ఆయన కొమారుడు గోలకొండ రాజును మెప్పించి గోలకొండలో జయస్తంభం వేశిన కొండప్ప ఆయన కొమారుడు ఛందశ్శాస్త్రం చేశిన వెంకట రామప్ప ఆయన కొమారుడు కువలయానందం తెనుగించిన లింగప్ప ఆయన కొమారుడు పార్వతి పరిణయం చెప్పిన శీతారామప్ప ఆయన కొమారుడు వెంకట్రామన్నా – సదురున వ్రాశి పురుషులు పారంపర్యంగా అనుభవిస్తూ వున్నాము. ‘

విద్వాన్ కట్టా నరసింహులు

1-1231, సి.పి. బ్రౌన్‌ రోడ్డు,

కడప – 516 004.

సెల్‌ : 9441337542

Check Also

kadapa stands top

Kadapa stands top in country

Kadapa: Kadapa district has achieved a rare distinction by standing top in the country in …

Kadapa Goa

Kadapa to Tirupati Train Timings

Kadapa to Tirupati train timings and details of trains. Distance between Kadapa and Tirupati. Timetable …

One comment

  1. సుబ్బన్న

    నరసింహులు గారి వ్యాసం బాగుంది. మరిన్ని వ్యాసాలు ప్రచురించండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *