Tourist Attractions

సింహాద్రిపురం హీరో పద్మనాభం

అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు …

ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. కొద్దిసేపటికి ఇంట్లో నుండి హాలులోకి వచ్చి ఆత్మీయంగా పలకరించారు 76 సంవత్సరాల పద్మనాభంగారు.

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన బసవరాజు పద్మనాభం తన జ్ఞాపకాల దొంతరలను మా ముందు ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…

Padmanabham
Padmanabham

మా ఊరు సింహాద్రిపురం. కడప జిల్లాలోని పులివెందుల తాలూకాలో వున్న మా ఊరిలో 15వేల పైచిలుకు జనాభా ఉంటుందేమో! ఈ మధ్యే మా ఊరిని మండలంగా కూడా చేశారు. మానాన్నగారిది యర్రగుజిపాడు. మా అమ్మగారిది వీరన్నగట్టుపల్లె. వారి వివాహమైన తరువాత మా నాన్నగారికి సింహాద్రిపురం కరణంగా పని (ఉద్యోగం) రావడంతో వారు అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. ఆక్కడే నేను పుట్టాను. మా ఊరి వాతావరణం, పరిసరాల విషయానికొస్తే అక్కడ అన్నీ కొండలు. కొండల కింద బావులుండేవి. ఒకసారి నేను మిత్రబృందంతో కలిసి ఈత కొట్టేందుకు ఊరికి సమీపంలో ఉన్న బావికి వెళ్ళాము. అప్పటికి నాకు ఈతరాదు. మునగబెండ్లు కట్టుకుని బావిలోకి దూకాను. అంతే ఒక్కసారిగా మునగబెండ్లు నా నడుము నుండి తెగిపోయాయి. అప్పటికి బావిలో ఎవరూ లేరు. నేను అరవడంతో నా వెంట వచ్చిన స్నేహితుడు ప్రభాకరరెడ్డి రక్షించాడు.

మా ఊర్లో చెన్నకేశవులు నాయుడు అనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన దగ్గర హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌(హెచ్‌ఎంవి) గ్రామ్‌ఫోన్‌ ఉండేది. మూడేళ్ళ వయసులో అనుకుంటా! నేను ఆ గ్రామ్‌ఫోన్‌ దగ్గరకు పోయి పాటలు విని పాడడానికి ప్రయత్నించేవాడిని. ఒకసారి మా ఊరికి మూలా నారాయణస్వామి వారి సినిమా టెంటు వచ్చింది. అందులో ‘ద్రౌపది వ్రస్తాపహరణం’, ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘భక్త ప్రహ్లాద’ వంటి సినిమాలను ప్రదర్శించారు. ఈ సినిమాలన్నింటినీ చూసిన నేను అందులోని పద్యాలు, పాటలు, కామెడీ సీన్లను అనుకరించి ఆనందించేవాడిని.

బోర్డు స్కూల్లో ఒకటో తరగతి చదివేటప్పుడు మా ఊర్లో చింతామణి నాటకం వేశారు. మా మాస్టారు బాబూసాహెబ్‌ నాకు ఇందులో బాలకృష్ణుడి వేషం ఇచ్చారు. ఆ నాటకం కోసం కృష్ణుడి వేషం వేసుకున్న నేను, నా పాత్ర ఎంతసేపటికీ రాకపోవడంతో మా అమ్మ ఒళ్ళోనే పడుకుని నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు నా పాత్ర వంతు వచ్చింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న నేను ఎంతమంది పిలిచినా లేవకపోవడంతో మా మాస్టారు వచ్చి చెవి మెలేశారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టేజి ఎక్కి బట్టీపట్టిన పద్యాలను అప్పచెప్పాను.

Read :  Telugu Ganga Project in Kadapa District

simhadripuram Town
simhadripuram Town

మా ఊర్లో మాకు అల్లరిబ్యాచ్‌ అనే పేరు కూడా ఉండేది. ఇదే విషయాన్ని మా మాస్టార్లు సైతం ఇంటికి వచ్చి మా నాన్నతో చెప్పేవాళ్ళు. ఎవరైనా కాల్చి పడేసిన బీడీ ముక్కలను తాగడం చిన్నప్పుడు మాకు సరదా. అలా ఒకసారి బీడి ముక్కలను ఏరుకుని నేను, నా సోదరుడు ఊరు బయటకు వెళ్ళి కాలుస్తుండగా చూసిన నాన్నగారు మమ్మల్నిద్దరిని బెత్తంతో చితకబాదారు. ఒకసారి పండుగరోజు ఒళ్ళంతా రంగు పూసుకుని రాక్షసుడి వేషం వేసుకుని ఊరంతా తిరిగాను. ఈ విషయం తెలిసిన అమ్మ నాకోసం వచ్చింది. ఆమెను ఆనందింపచేయాలని వేషంతో అలాగే పరుగెత్తాను. దగ్గరకు రాగానే అమ్మ చీపురుతో వడ్డించింది. అప్పుడప్పుడు ఇరుగుపొరుగు ఇళ్ళ నుండి మజ్జిగ తీసుకురమ్మని అమ్మ గిన్నె ఇచ్చి పంపేది. అలా వెళ్ళినప్పుడు పాటపాడితే గానీ మజ్జిగ పోయమనేవారు. దీంతో సినిమా పాట పాడి వాళ్ళను మెప్పించి మజ్జిగ తీసుకువచ్చేవాణ్ణి. అప్పటికే నా ఎలిమెంటరీ చదువు పూర్తవ్వడంతో నేను, మా చిన్నాన్న సుదర్శనరావు హైస్కూలు చదువు కోసం ప్రొద్దుటూరుకు వెళ్లాము.

ప్రొద్దుటూరు కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉన్న మా చినతాతగారి ఇంట్లో ఉంటూ పాండురంగాచారి గారి వద్ద ఆంగ్లం ట్యూషన్‌లో చేరాం. ప్రొద్దుటూరులో సినిమాహాళ్ళు ఉండేవి. పల్లెటూరి వాతావరణం నుండి అక్కడ అడుగుపెట్టిన మాకు సినిమాలు చూడాలన్న ఉబలాటం ఉండేది. అక్కడి సినిమా హాలు మేనేజర్‌ను పరిచయం చేసుకుని ట్యూషన్‌కు ఎగనామం పెట్టి సినిమాలు చూసేవాళ్ళం. ఇది 1942 నాటి మాట. అప్పటికి నా వయసు 12 సంవత్సరాలు. అలా ప్రొద్దుటూరులో భక్తపోతన, కృష్ణప్రే మ, ఝులా (హిందీ) మొదలైన సినిమాలు చూశాం.

ప్రొద్దుటూరులో సైకిల్‌ నేర్చుకున్న నాకు స్వంత సైకిల్‌ కొనాలన్న కోరిక కలిగింది. సైకిల్‌కలను సాకారం చేసుకోవాలని నేను, సుదర్శనరావు (మా చిన్నాన్న) యర్రగుంట్ల నుండి రైలెక్కి బెంగుళూరు చేరుకున్నాం. రెండు రోజులకే ఇక్కడుంటే డబ్బు సంపాదించలేము, సైకిల్‌ కొననూ లేము అని అర్థం కావడంతో తిరుగు ప్రయాణమయ్యేందుకు రైలె క్కాం. రైలులో చూసిన ఒక పత్రికా ప్రకటన నన్ను ఆకర్షించడంతో మద్రాసు వెళ్ళి డబ్బు సంపాదించుకుని వచ్చి, ఆ డబ్బుతో ప్రొద్దుటూరులో సైకిల్‌ కొని తిరగాలని నిర్ణయించుకున్నాను.

Read :  P Shanta Kumari - The Tollywood singing sensation

ఎర్రగుంట్ల స్టేషన్‌లో రైలు దిగి పక్కనే ఉన్న మరో రైలెక్కి టికెట్‌ లేకుండా మద్రాసు చేరుకున్నాం. రైలు దిగుతూనే గబగబా స్టేషన్‌ బయటకు వచ్చి ట్రాం ఎక్కి మౌంట్‌రోడ్డులోని వెల్లింగ్టన్‌ థియేటర్‌ (ఇప్పుడు లేదు) దగ్గర దిగి హాలు మేనేజర్‌ను పరిచయం చేసుకుని ఫ్రీగా ‘కృష్ణప్రేమ’ సినిమా సెకండ్‌ షో చూశాం. అప్పటికి మా దగ్గర ఆరు అణాలు మాత్రమున్నాయి. ఆ రాత్రి థియేటర్‌ సమీపంలో ఒక షాపు వరండాలో తల కింద సామానులు పెట్టుకుని పడుకున్న మమ్మల్ని తెల్లవారుజామున పోలీసులు వచ్చి నిద్ర లేపి ‘యారుడా నీంగా?’ (ఎవర్రా మీరు) అని అడిగారు. అంతే భయపడుతూ మేము కన్నాంబగారిని కలవడానికి వచ్చామని చెప్పాం. ‘ఇంగె పడుక్క కూడాదు, పోంగా’ (ఇక్కడ పడుకోకూడదు పోండి) అంటూ వెళ్ళిపోయారు. తరువాత జెమినీ స్టూడియోకు వెళ్లి అక్కడ కన్నాంబ గారి అడ్రసు తీసుకుని, టి.నగర్‌లోని మలాని వీధిలో ఉన్న వారి ఇంటి దగ్గరకు వెళ్లాం. అక్కడ వరండాలో కూర్చొని ఉండగా కన్నాంబ గారు వచ్చి మమ్ములను విచారించారు. మా మాటలను ఓపిగ్గా విన్న కన్నాంబగారు ‘భోంచేశారా బాబూ’ అని అడిగారు. ‘ఓ రోజైంది భోంచేసి’ అనగానే ఆకులు వేసి భోజనం పెట్టారు.

భోజనం అయిన తరువాత మా పాటలు విన్న కన్నాంబగారు కృష్ణారావు వీధిలో ఉన్న వారి సొంత నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరి ఆఫీసుకు రమ్మనడంతో అక్కడకు పోయాము. పాదుకా పట్టాభిషేకంలో నటించిన తారలంతా అక్కడ ఉన్నారు. కన్నాంబగారి మాట మేరకు వారందరి ముందు పాటలు పాడాము. మా పాటలను వారంతా మెచ్చుకున్నారు. ఆ తరువాత కన్నాంబగారు మమ్ములను రాజరాజేశ్వరి కంపెనీలో ఆర్టిస్టులుగా చేర్చుకున్నారు. తరువాత కొంతకాలానికి దాసరి కోటిరత్నమ్మగారు, రఘురామయ్య, కన్నాంబగారికి చెప్పి ఆర్కాట్‌ మొదలియార్‌ వీధిలోని తమ ఇంటికి నన్ను తీసుకువెళ్ళి కన్నకొడుకులా ఆదరించారు. అక్కడే నాకు లింగం సుబ్బారావు, గూడవల్లి రామబ్రహ్మం వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఆ రకంగా ‘మాయలోకం’ సినిమాలో నటిం చే అవకాశం లభించింది.

మొదటిసారిగా ‘మాయలోకం’ రషెస్‌లో తెరపై నన్ను నేను చూడగానే మా ఊరిలో చూసిన డేరా సినిమా గుర్తుకొచ్చింది. ఆ తరువాత సిఎస్‌ఆర్‌ వంటి గొప్ప నటులతో పరిచయాలు ఏర్పడటంతో వారితో కలిసి పలు నాటకాలలో నటించాను. నా రెండవ సినిమా ‘త్యాగయ్య’. ఈ సినిమాలో అష్టకష్టాలు పడి వేషం సంపాదించాను. తరువాత చాలా సినిమాలలో నటించాను. 1947లో ‘రాధిక’ సినిమాలో కృష్ణుడి వేషం వేశాను. మిడ్లాండ్‌లో ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఎల్‌వి ప్రసాద్‌ గారు నన్ను అభినందించారు.

Read :  Bollywood actor Akshay Kumar in Kadapa

1948లో కొంతకాలం గ్యాప్‌ రావడంతో మా ఊరు వెళ్ళాను. అప్పుడు అక్కడ టెంటు హాలులో నేను నటించిన సినిమాలు ఆడుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళతో పాటు సినిమా చూసిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. ఆ తరువాత జరిగిన కొన్ని ఘటనల కారణంగా సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నాను. అయితే సి.పుల్లయ్యగారి పిలుపుతో మళ్ళీ మద్రాసు రావాల్సి వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు ‘షావుకారు’ సినిమాలో వేషం కోసమని ఆర్కాటు మొదలియారు వీధిలో ఉన్న విజయా ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నాగిరెడ్డి, చక్రపాణి, రజనీకాంత్‌ మొదలైన వారు ఉన్నారు. నేను పాడిన పాటలు విన్న చక్రపాణి నన్ను నాగిరెడ్డి గారికి పరిచయం చేశారు. ‘మా ప్రాంతం వాడివా?’ అంటూ నాగిరెడ్డి ఆనందపడ్డారు. నాగిరెడ్డి ఊరు ఎద్దులయ్యగారిపల్లె. సింహాద్రిపురానికి కిలోమీటరు దూరంలో ఉంది.

నాగిరెడ్డిగారు నన్ను విజయా- వాహినీ సంస్థ ఆర్టిస్టుగా (జీతానికి) ఉండమన్నారు. తరువాత మూడు సంవత్సరాలు విజయా – వాహినీ సంస్థలో పర్మినెంట్‌ ఆర్టిస్టుగా పనిచేశాను. ఈ సమయంలో విజయా -వాహినీ స్టూడియో సమీపంలో కోడంబాక్కంలో నేను, కమెడియన్‌ బాలకృష్ణ ఒక రూము అద్దెకు తీసుకుని ఉండేవాళ్ళం. అప్పట్లో నాకు నెలకు 150 రూపాయల జీతం, సినిమాకు 500 రూపాయల బోనస్‌ ఇచ్చేవారు. తరువాత చాలారోజుల వరకు కోడంబాక్కంలోనే ఉన్నాను. ఆ రోజుల్లో కోడంబాక్కం స్టేషన్‌ నుండి ఎవిఎం స్టూడియోకు రావాలంటే గుర్రపుబండిలోనే రావాలి. అలా గుర్రపు బండిలో వెళుతూ హాయిగా నిద్రపోయేవాడిని.

1957 నా మకాంను టి.నగర్‌కు మార్చాను. అక్కడ అబ్దుల్‌ అజీజ్‌ వీధిలో నేను, కోదండపాణి కలిసి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో షూటింగ్‌ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు టి.నగర్‌ వీధుల్లో కలియ తిరిగేవాళ్లం.1958లో టి.నగర్‌లోని నాగార్జున నగర్‌లో స్థలం కొని స్వంత ఇల్లు కట్టుకున్నాను. అక్కడ నుండి పలు సినిమాల్లో వేషాలు వేసి ఆంధ్ర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇంతకాలం నా సినీరంగంలో నా ప్రస్థానాన్ని కొనసాగించాను. ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు 1958లో నేను నిర్మించుకున్నదే. ఇప్పటికీ అప్పుడప్పుడూ నా జన్మస్థలమైన సింహాద్రిపురానికి వెళ్ళి వస్తుంటాను.

I CAN ACT BY SEEING. I WANT TO ENTERTAIN MY FANS AS LONG AS…’

– తవ్వా  విజయభాస్కరరెడ్డి, ప్రవీణ్ కుమార్

 

Check Also

charles philip brown

CHARLES PHILIP BROWN – REVIEVER OF TELUGU

CHARLES PHILIP BROWN, popularly known as C.P.Brown was the first Ideologist to publish Telugu classics with …

Pulivendula

Pulivendula – Haunt of Tigers

Pulivendula (Telugu: పులివెందుల or పులివెందల), the headquarters of the taluk, is situated on the road …

2 comments

  1. రామ శర్మ

    పద్మనాభం గారితో మీ సంభాషణ బాగుంది.

  2. good discussion with padmanabham garu…

    Appreciate for your website…

    Keep go ahead to contiunuous improvment..

    – Siva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *