దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సకలదేవతలను ఆహ్వానించడం ధ్వజారోహణ ఉద్దేశం. అనంతరం శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆలస్యంగా ఊంజల్‌సేవ :
టీటీడీ అధికారుల నిర్వాకం వల్ల ఊంజల్‌సేవ ఆలస్యమైంది. టీటీడీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 నుంచి 6 వరకు ఊంజల్ సేవ నిర్వహించాలి. అయితే డిప్యూటీ ఈఓ సరస్వతమ్మ ఒక గంట ఆలస్యంగా రావడంతో అంత వరకు కార్యక్రమాన్ని చేపట్టలేదు. దీంతో ఊంజల్‌సేవ ఆరుగంటలకు ప్రారంభమై 7.15 వరకు జరిగింది.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు : సకల దేవతలకు ఆరాధ్యుడై న శ్రీనివాసుడు శనివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై ప్రజలకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, చెక్కభజన, పిల్లనగ్రోవి కళాకారుల బృందాలు ముందు వెళుతుండగా గ్రామోత్సవంలో శ్రీవారు భక్తులకు కనువిందు చేశారు. ప్రజలు స్వామివారిని దర్శించుకుని తరించారు. సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లె బిడికికి చెందిన రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో పిల్లనగ్రోవి కళాకారుల బృందం, పెండ్లిమర్రి మండలం చీమలపెంట గ్రామానికి చెందిన కొండయ్య ఆధ్వర్యంలో చెక్కభజన బృందం నిర్వహించిన ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరికథా కాలక్షేపం ఆకట్టుకుంది.
నేటి కార్యక్రమాలు : ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ప్రజలకు దర్శనమిస్తారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు స్నపన తిరుమంజనం సాయంత్రం 5 నుంచి 6 వరకు ఊంజల్ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీవారు పెద్ద శేషవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిస్తారు