కడప మే 11 : రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యతీర్థంగా వెలుగొందుతున్న పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి, వైద్యనాథేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదిన మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకంగా సుప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో పావన పినాకినీ నదీ తీరాన చాళుక్యుల కాలంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం,చోళుల కాలంలో కామాక్షి సమేత వైద్యనాథేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించడం జరిగింది. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వర స్వామి, విష్ణుస్వరూపుడైన చెన్నకేశవ స్వామి, నిలయమైన ఈ క్షేత్రం హరిహర అభేద్య క్షేత్రంగా విలసిల్లుతోంది. వైద్యనాథేస్వర, సంతాన మల్లేస్వర, సాక్షి మల్లేశ్వర, త్రికూటేశ్వర భీమలింగేశ్వర రూపాలలో వెలసిన ఇక్కడి శైవ ఆలయాలు భక్తులను పరవశింప చేస్తున్నాయి. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఈ క్షేత్ర మహిమను వ్యాస మహర్షి ప్రస్తావించారు.
ఇక్కడి ప్రాంతంలోని పాపాఘ్ని నది కుందూ వల్కల మాండవ్యనదులు పినాకినీ నదిలో సంగమం కావడంతో పంచనదీ సంగమ క్షేత్రంగా పెన్నానది, కాశి క్షేత్రంలో వలే ఉత్తర దక్షిణంగా అర్థచంద్రాకారంలో ప్రవహిస్తున్నందున పుష్పగిరిని దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. అక్షయ తదియగా పిలువబడే వైశాఖ శుద్ధ తదియనాడు ఈ క్షేత్రంలో స్నాన మాచరించి ఇక్కడి ఆలయాలను సందర్శిస్తే వంద సార్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని పెద్దల ఉవాచ.
అందుకే ఈ క్షేత్రంలో అక్షయ తదియనాడు వైభవోపేతంగా జరిగే తిరుణాలకు లక్షలాది భక్తులు, యాత్రికులు హాజరౌతారు.
విష్ణురుద్రపాదాలున్న ఈ క్షేత్రం పితృకార్యాలు చేసేవారికి పవిత్రస్థలంగా పేర్కొని కాశీ గయ ప్రయాగ క్షేత్రాల్లో అపరక్రియలు చేసిన ఫలితాన్ని ఇస్తోంది. శ్రీశైలం మహాక్షేత్రానికి గల అష్టద్వారాలలో నైరుతీ ద్వారంగా పుష్పగిరి ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రానికి ఈపేరు రావడానికి ఎన్నో ఇతిహాస కారణాలున్నాయి. సీతాన్వేషణకై శ్రీరాముడు లంకకు వెళ్తు మార్గమధ్యాన ఈ క్షేత్రాన్ని సందర్శించి వైద్యనాదేశ్వరస్వామికి పలురోజులు వివిధ పుష్పగుచ్చాలతో పూజించి వాటిని నదీలో వేయగా అవన్నీ పూలకొండవలే చేరడంతో ఈక్షేత్రానికి పుష్పగిరి అని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ప్రాచీన కాలం నుంచి అనేక వర్ణాలవారు అన్నదాన సత్రాలను నిర్వహిస్తూ క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులకు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కాకతీయుల ప్రభువుల కాలం నుంచి అన్నపాన వసతి సౌకర్యాలు కలుగచేస్తూ అన్నదాన ప్రభువైన భగవంతుని సేవించినట్లు చరిత్ర చెబుతోంది. హరిహరా దైతమైన పుష్పగిరిలో ప్రతి ఏటా క్షేత్రశుద్ధి నుంచి సప్తమి వరకు చెన్నకేశవస్వామి, వైద్యనాధేశ్వరునికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంకురార్పరణం, ధ్వజారోహణం, కల్యాణోత్సవం , శంకర జయంతి రోజు రథోత్సవం ,చక్రస్నానం, వసంతోత్సవాలతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అక్షయ తదియ పర్వదినాన ఈ నదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శించినవారికి పాపాలుతొలుగుతాయన్న భావనతో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు.
ఈ ఉత్సవాల్లో ప్రధానంగా 16న (అక్షయ తదియ) గరుడోత్సవం(తిరుణాల), 17న హరిహరుల కల్యాణోత్సవం, 18న రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్యవైశ్య సంఘం వారు ఇతర వర్ణాల వారు అన్నదాన కార్యక్రమాలు , మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు.
I came to know many things from this articles.