జగన్ రాజీనామా రాష్ట్రాన్నే కాకుండా పత్రికలనూ, ఇతర మీడియా ను సైతం కుదిపి వెసింది. ఎంతో రాజకీయ ప్రాధాన్యత గల ఈ పరిణామం పై మీడియా తన దృష్టిని సారించడం సహజమే. జగన్ రాజీనామా పై సాక్షి పత్రిక మినహా దాదాపు పత్రికలన్నీ సంపాదకీయాలను రాశాయి. వై.ఎస్.కుటుంబమన్నా, జగన్ అన్నా గిట్టని పత్రికలు తమ సహజమైన అక్కసును ఈ సందర్భంగా వెల్లగక్కగా కొన్ని పత్రికలు వాస్తవ పరిస్తితిని వెల్లడించేందుకు ప్రయత్నించాయి.
Andhrabhoomi daily
November 29th, 2010
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిష్క్రమణ రాష్ట్ర కాంగ్రెసుకు కుదుపు. దాని తీవ్రత ఎంతన్నది కొంతకాలం చూస్తేకానీ తెలియదు. ఇప్పటికిప్పుడే ఆయన ఈ పనిచేస్తాడని ఎవరూ ఊహించలేకపోయినా మొత్తానికి ఈ పరిణామంలో విస్తుపోవలసింది ఏమీలేదు. ముఖ్యంగా గడచిన కొన్ని వారాల ఘటనాక్రమాన్ని గమనిస్తే వై.ఎస్.కుమారుడు కాంగ్రెసులో కొనసాగగలగటం కుదిరేపనికాదని, అతడిని బయటికి పంపేరోజు ఎంతో దూరంలో లేదని మందబుద్ధులకు సైతం అర్థమైంది. అవమానకరంగా గెంటించుకోవడంకంటే తానే హుందాగా నిష్క్రమించడం మంచిదని జగన్ నిశ్చయించుకున్నట్టుంది. తిరుగుబాట్లు, అసమ్మతి రాజకీయాలు కాంగ్రెసుకు కొత్తకావు. రాష్ట్ర స్థాయిలో ఎవరు ఎవరితో తలపడ్డా, పార్టీలో అధిష్ఠానవర్గానికి అణగిఉన్నంతకాలమూ ఎవరి మనుగడకూ పెద్ద ఇబ్బంది ఉండదు. అసలైన అధిష్ఠానానే్న ధిక్కరించే దుస్సాహసానికి పాల్పడిన వారికి మాత్రం కాంగ్రెసులో పుట్టగతులుండవు. ఈ రాజకీయ సూక్ష్మం తెలిసినవాడు కాబట్టి వై.ఎస్.రాజశేఖరరెడ్డి దీర్ఘకాలం ఎంతమంది ముఖ్యమంత్రులతో హోరాహోరీగా పోరాడినా హైకమాండుకు కోపం రాకుండా జాగ్రత్తగా మెలిగేవాడు. ఆ లౌక్యం ఆయన కుమారుడిలో లేదు. పోయి పోయి ఢిల్లీ దర్బారునే ఢీకొన్నాడు. పార్టీనుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి చేజేతులా కొని తెచ్చుకున్నాడు.
ఇందులో ఎవరిది తప్పు అన్న మీమాంస దండుగ. ఎంచాలంటే తప్పులు రెండువైపులా ఉన్నాయి. 150 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపినా పార్టీ అధ్యక్షురాలి అభీష్టాన్ని మన్నించి తాను పోటీకి దూరంగా ఉండటమేకాక, నాయక స్థానానికి రోశయ్యపేరును తానే ప్రతిపాదించానని రాజీనామా లేఖలో జగన్ చెప్పింది యథార్థమే. కాని- పార్టీలో బలం ఎంత అన్నది కాంగ్రెసు సంస్కృతిలో ముఖ్యమంత్రి కావడానికి గీటురాయి కానేకాదు. ఆ 150 మందికీ టిక్కెట్లు ఇప్పించి, గెలిపించి, ఎన్నికల్లో పార్టీ దిగ్విజయానికి ముఖ్యకారకుడైన అతడి తండ్రికూడా ఎమ్మెల్యేల మద్దతు మూలంగాకాక, అధిష్ఠాన నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి కాగలిగిన సంగతి గుర్తుంచుకోవాలి. నిర్ణయాధికారం యావత్తూ ‘పైవాళ్ల’దే అయినప్పుడు ఢిల్లీ అభిమతమేమిటో తెలుసుకోకుండా, అసలైన వారిని ప్రస్ననం చేసుకుని కార్యం సాధించే ఒడుపులేకుండా తొందరపడి తండ్రి భౌతికకాయానికి అంత్యక్రియలుకూడా కాకుండానే తన మనుషులను ఉసికొలిపి తననే ముఖ్యమంత్రిని చేసి తీరాలంటూ అసహ్యమైన కాంపెయిను చేయించడం (లేక- అపోహలను రేకెత్తించే అలాంటి కాంపెయినును అనుమతించడం) జగన్ చేసిన మొదటి తప్పు. గాంధీభవన్‌లో వై.ఎస్. సంతాపసభలో జగన్ వర్గీయుల వీరంగం అతడికి రాజకీయంగా కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. రోశయ్య పేరు ప్రతిపాదించింది అతడే. గద్దెనెక్కిన మరునాటినుంచీ రోశయ్యతో సహాయ నిరాకరణచేసి, తన మనుషులచేత నానా విధాల సతాయించిందీ అతడే. పావురాలగుట్టవద్ద ‘ఓదార్పు’ ఆలోచనను తొలుదొలుత ప్రకటించిన తన తొలి సభలో కాంగ్రెసు పార్టీని, పార్టీ అధ్యక్షురాలిని కనీసం పేరైనా తలవవలసిన అవసరం లేదని అతడు భావించి ఉండవచ్చు. కాని వై.ఎస్. మరణించిన మరురోజునుంచీ అతడు, అతడి వర్గీయులు కనపరచిన అసహనాన్ని గమనించిన అధిష్ఠానం… కొత్తగా అతడు తలపెట్టిన ‘ఓదార్పు’కూడా ఘర్షణ వైఖరిలో భాగమేనని దాన్నిబట్టి అనుకోదా? మంచో చెడో కేంద్ర నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చి, వద్దు అని వారించినా వినకుండా ‘ఓదార్పు’ ఆపితే ప్రపంచమేదో మునిగిపోతుందన్నట్టు, తాను పట్టిన కఠోర వ్రతమేదో చెడిపోతుందన్నట్టు బిర్రబిగియటం రాజకీయ విజ్ఞత అవుతుందా? వై.ఎస్. పోయాక ఎన్నో నెలలతరవాత ఆయన కుమారుడు అన్న మాట ప్రకారం వచ్చి తమను పరామర్శించలేకపోతే బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోతాయా? తనకూ, తల్లికీ అడిగిన నెలరోజులకుగాని సోనియా గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న జగన్ ఎత్తిపొడుపు బాగానే ఉంది. కానీ అదే ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షురాలు తనతో అన్నదాన్ని రచ్చచేసి, ఆమె వద్దన్నా లెక్క చేయక తాను ఓదార్పుయాత్రను సాగించబోతున్నానని బహిరంగ ప్రకటన చేయడం పార్టీ నాయకత్వాన్ని రెచ్చకొట్టినట్టు కాదా? కేవలం బాధితులను పరామర్శించడం కోసమేనని చెప్పుకున్న ‘ఓదార్పుయాత్ర’ను బలప్రదర్శన వేదికగా మార్చడం… వై.ఎస్.విగ్రహావిష్కరణ సభల్లో అప్పటి ముఖ్యమంత్రిమీద, ప్రభుత్వంమీద, కాంగ్రెసు నాయకత్వం మీద పేరు పెట్టకుండానే పరోక్షపు దాడులుచేస్తే పార్టీ నాయకులకు ఒళ్ళు మండదా? తన పత్రిక, తన చానెల్ స్వతంత్ర మీడియా సంస్థలని జగన్ చెప్పడం వినడానికి ఇంపుగానే ఉంది. కాని- పుట్టినప్పటినుంచి నేటిదాకా నిజంగా స్వతంత్ర మీడియా సంస్థలుగా వాటిని నడవనిచ్చానని అతడు గుండెమీద చేయివేసి చెప్పుకోగలడా? ఆయన అహరహం తిట్టిపోయించే సోకాల్డ్ ‘ఎల్లో మీడియా’లోఉన్న సంపాదక స్వేచ్ఛకూ, అతడి మీడియాలోని సంపాదక స్వేచ్ఛకూ వౌలికంగా ఏమైనా తేడా ఉందా? అతడికి గిట్టనివారిని కరవడమూ, గిట్టినవారిని నిమరడమే అతడి మీడియా సంస్థల పాలసీ అని నలుగురూ అనుకోవడానికి అతడే ఆస్కారమిచ్చినప్పుడు, ఆ మీడియాలో అధిష్ఠానానికి వ్యతిరేకంగా వచ్చిన ఫలానా కథనాలకూ అతడే కారకుడని ఎవరైనా అనుమానించడంలో తప్పేముంది? తన మీడియా కథనాల్లో తన ప్రమేయం గురించి పార్టీలో పెద్ద దుమారం రేగిన సమయంలో, అధిష్ఠానవర్గంలో కీలక వ్యక్తులు హైదరాబాద్‌లో ఉండగా కలవకపోవడం, ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నమైనా చేయకపోవటం అగాథాన్ని మరింత పెంచదా? తన తండ్రికి ఇష్టుడు, మొన్నటిదాకా తమ వర్గంలో ఒకడుగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని గద్దెనెక్కాక మర్యాదపూర్వకంగా కనీసం కలిసి, అభినందించక పోవటంకూడా ముఖ్యమంత్రులతో, పార్టీ నాయకత్వంతో సహకరించడం కిందికే వస్తుందా?
ఇక కాంగ్రెసు అధినాయకత్వం వ్యవహరించిన తీరూ వంకపెట్టలేనంత దివ్యంగా ఏమీలేదు. మిగతా కాంగ్రెస్ రాష్ట్రాలకంటే అత్యధిక స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో సాధించిపెట్టి, కేంద్రంలో యు.పి.ఎ. అధికారానికి, గొప్ప దోహదం చేసింది వై.ఎస్.రాజశేఖరరెడ్డి. కనీసం ఆ కృతజ్ఞతా భావమైనా ఢిల్లీ పెద్దలకు ఉన్నట్టు కనపడదు. అంతా వారి ప్రయోజకత్వమే అయితే, ఇదే రకమైన ఘన విజయాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ వారు సాధించగలిగి ఉండాలి. భర్తను పోగొట్టుకుని పుట్టెడు కష్టంలో ఉన్న వై.ఎస్. సతికి, పార్టీ లెజిస్లేటర్లలో అత్యధిక సంఖ్యాకుల మద్దతు ఉన్న వై.ఎస్. కుమారుడికి కోరిన నెలరోజులకుగాని సోనియా ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం, అదే వారి బంధువుకైతే ప్రత్యేకంగా పిలిపించి మరీ దర్శనమివ్వటం వై.ఎస్. అభిమానులకు సహజంగానే హృదయశల్యం. ఆఫ్టరాల్ ఒక కుర్ర ఎం.పి. తలపెట్టిన యాత్రను అడ్డగించే డ్యూటీని స్వయానా సోనియాగాంధీయే పైన వేసుకుని వారినీ వీరినీ పిలిచి, ఆ యాత్రకు వెళ్లొద్దని చెప్పటం ఏమైనా బాగుందా? కొత్త ముఖ్యమంత్రి ఎన్నికల తతంగానికి జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జగన్ వర్గీయులనుంచి ఎటువంటి ప్రతిఘటన లేనప్పుడు, అధిష్థాన నిర్ణయానికి జగన్ బాహాటంగా ఎదురు తిరిగిన దాఖలా ఏదీ లేనప్పుడు… అతడు ప్రభుత్వాన్ని కూల్చేయదలచినట్టు ముందుగానే ఊహించుకుని, ఆ ఆపదనుంచి గట్టెక్కడం కోసం ‘ప్రజలు లేని ప్రజారాజ్యం’ ప్రాపకానికి వెంపర్లాడి, రాజకీయంగా దివాలా తీసిన చిరంజీవిని ఢిల్లీ పిలిచి మంతనాలాడటం… ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోయినా పిఆర్‌పిని కేబినెటులోకి తీసుకుని తీరాలని మెడలు వంచటం రాజకీయ పరిణతే అందామా? తీరా వాళ్లూ వెనక్కిపోయి కేబినెటులో చేరమన్నా చేరేదిలేదు పొమ్మని చెప్పాక కాంగ్రెసు పరువు ఏమైనట్టు? పార్టీ ఎమ్మెల్యేల్లోనూ, బయట జనంలోనూ అత్యధికులు ఇప్పటికీ వై.ఎస్. అభిమానులు అయినప్పుడు ఆ సెంటిమెంటును మన్నించి వై.ఎస్. స్మృతి పట్ల గౌరవభావం చూపితే కాంగ్రెసుకు మంచే తప్ప చెడు జరగదు. రాజశేఖరరెడ్డి కుమారుడికి వ్యతిరేకంగా రాజశేఖరరెడ్డి తమ్ముడిని ఢిల్లీ పిలిపించి దువ్వటం, రాజశేఖరరెడ్డి ఇల్లాలికి తీవ్ర మనస్తాపం కలిగించటం, రాజశేఖరరెడ్డి కుమారుడిని పగబట్టినట్టు వెంటపడటం వై.ఎస్.ను తమ పాలిటి దేవుడిగా ఇప్పటికీ తలిచే కోట్లాది ప్రజల మనసులు కష్టపెట్టదా? అది అవసరమా? దీర్ఘకాలంలో కాంగ్రెసు ప్రయోజనాలకు మంచిదేనా?
జగన్ నిష్క్రమణ -సందర్భం
andhra jyothy daily
30-11-10
చిరకాలంగా ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు, కడప లోక్‌సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. పార్లమెంటు సభ్యత్వానికీ రాజీనామా చేశారు. బహుశా ఈ పరిణామాలకు రంగం సిద్ధం చేసేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చి ఉండాలి. వై.ఎస్. మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న ‘ఇంటిపోరు’ను శాశ్వతంగా పరిష్కరించాలన్న సంకల్పంతోనే, అందుకు అనువైన నూతన నాయకత్వాన్ని, అవసరమైన ఆపద్ధర్మ చర్యలను కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్నదని అర్థమవుతోంది.
అధిష్ఠానం తన చేతనే ప్రతిపాదింపజేసి ముఖ్యమంత్రిని చేసిన రోశయ్య తరువాతైనా తనకు అవకాశం దొరుకుతుందేమోనని కించిత్ ఆశాభావం మిగుల్చుకున్న జగన్, కిరణ్‌కుమార్ ఎంపిక తరువాత ఒక నిశ్చయానికి వచ్చినట్టున్నారు. అమీతుమీ తేల్చుకోకపోతే, కాంగ్రెస్‌లో అనామకంగా అణగారిపోవడం తప్పదని గ్రహించిన ఆయన, కుటుంబాన్ని చీల్చుతున్నారని కుట్రలు పన్నుతున్నారని అధినాయకత్వం మీదనే ఆరోపణలు చేస్తూ రాజీనామా అస్త్రం సంధించారు.
ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తూ, తన చర్యలను సమర్థించుకుంటూ, తనపైన అధినాయకత్వంతో సహా కాంగ్రెస్ పెద్దలు అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ, సాక్షాత్తూ సోనియాగాంధీనే సంబోధిస్తూ రాసిన ఐదుపేజీల సుదీర్ఘమైన లేఖలో జగన్ తన రాజీనామా నిర్ణయం తెలియజేశారు. తన తండ్రి గెలిపించి ప్రతిష్ఠించిన ప్రభుత్వాన్ని కూలదోయబోనని చెబుతున్నారు కానీ, జగన్ భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిరపరచే ఉద్దేశంతోనే సాగబోతున్నదని సూచనలు కనిపిస్తున్నాయి.
జగన్‌తో పాటు, ఆయన తల్లి, వై.ఎస్.ఆర్. సతీమణి విజయలక్ష్మి కూడా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒంటరిని చేయాలని కుట్ర పన్నారని, తాను మాత్రం ఒంటరిగానే బయటకు వెడుతున్నానని జగన్ బహిరంగ లేఖలో నిష్ఠూరంగా అన్నారు. ఆయనకు అనుయాయులుగా ఉన్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోరని తెలుస్తున్నది.
2014 దాకా ప్రభుత్వానికి సహకరించాలని జగన్ వారికి హితవు చెప్పారట. ఓటింగ్ సందర్భం వస్తే మాత్రం అంతరాత్మప్రబోధం ప్రకారమే వ్యవహరిస్తారట. మరో వైపు – రానున్న కొద్దిరోజులలో జగన్ నాయకత్వంలో కొత్త పార్టీ అవతరణ జరగనున్నదని బలంగా వినిపిస్తున్నది. పార్టీ ఏర్పడితే కూడా జగన్ వర్గీయులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? కొనసాగి పంటిలోని రాయిలాగా ఇబ్బంది పెడతారా? బహుశా అదే వ్యూహమై ఉండవచ్చు.
జగన్ వెనుక ఎందరు శాసన సభ్యులున్నారో, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీకి ఎంత కొరత ఏర్పడుతుందో స్పష్టంగా లేదు. పిఆర్‌పి నుంచి మద్దతు హామీ అయితే లభించింది. వారు ప్రభుత్వంలో చేరబోమని అంటున్నారు. బహుశా, ‘పూర్తి’ అవగాహన కుదిరితే కానీ, వారి మద్దతు ‘లోపలినుంచి’ లభించదు. టిఆర్ఎస్ కూడా అవసరమయితే ఆదుకునే అవకాశమున్నది. అందుకూ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.
అదికాక, మజ్లిస్ ఎమ్మెల్యేలను కూడా లెక్కవేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ పూర్తిస్థాయిలో జరిగితే అసంతృప్తులు అటువైపు చేరే అవకాశమున్నది కాబట్టి, పాక్షిక విస్తరణ మాత్రమే జరిపి అధికులకు ఆశను మిగిల్చాలని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్టున్నది. మొత్తం మీద జగన్ నిర్ణయం రాష్ట్రప్రభుత్వానికి ఒక కుదుపు నయితే ఇస్తున్నది. ఇడుపులపాయలో వై.ఎస్. సమాధికి నివాళులర్పించిన తరువాత జగన్‌వర్గీయులు తీసుకోబోయే నిర్ణయం మీద పరిణామాలు ఆధారపడి ఉంటాయి.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి కీర్తిప్రతిష్ఠలకు వారసత్వం ఎవరిది అన్న తగవే ఈ పరిణామాలన్నిటికీ మూలకారణం. కుటుంబ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ వంటి జాతీయపార్టీలో ప్రాంతీయ సామంతుల ప్రాభవాలకు ప్రతిష్ఠకు ఒక పరిమితి ఉంటుందని జగన్మోహనరెడ్డి గ్రహించలేకపోయారు. కేంద్రస్థాయిలో ఆనువంశికత ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదని ఆయన భావించినట్టున్నారు. 2004లో కాంగ్రెస్ విజయంలో రాజశేఖరరెడ్డి నాయకత్వ ప్రతిభ ఉన్న మాట నిజమే కానీ, అందులో సోనియాగాంధీ జనాకర్షణ, కాంగ్రెస్ జాతీయస్థాయి ప్రతిష్ఠ, అన్నిటికి మించి తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలనపై ఏర్పడిన వ్యతిరేకత చేసిన దోహదం కూడా ఉన్నదని జగన్ మరచిపోయారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించినప్పటికీ, ముఖ్యమంత్రిత్వం దక్కడానికి అధిష్ఠానం ఆశీస్సులు అవసరమయ్యాయని జగన్‌కు తెలియకపోవచ్చు. అవగాహనా రాహిత్యం కొంత, అజ్ఞానం కొంత, దుందుడుకుతనం మరికొంత కలసి జగన్‌లో విపరీత స్పందనలకు కారణమయ్యాయి. లేకపోతే, ఎంపీగా ఏడాది అనుభవం కూడా లేకుండానే వైఎస్ పదవి తనకు సహజంగా సంక్రమించాలని ఆయన అత్యాశ పడేవారు కాదు. దాన్నొక హక్కుగా పరిగణించి, చిన్న పిల్లవాడిలాగా మారాం చేశారాయన. తరువాతి పరిణామాలు జగన్ చేతిలో లేకుండా పోయాయి.
ఇంతకీ ఈ కాంగ్రెస్ ఇంటిపోరుతో సామాన్యులకు సంబంధమేమిటి? ఏ సైద్ధాంతిక పోరాటం సోనియా, జగన్‌ల మధ్య జరుగుతున్నది? ప్రజలకు ఏ సంక్షేమం సాధిద్దామని జగన్ పోరాడుతున్నారు? కనీవినీ ఎరుగని అవినీతి ఆరోపణలు, భూముల పందేరాలు, వనరుల ప్రైవేటీకరణ జరిగిన పరిపాలనలో, ఆ అక్రమాల నుంచి పిండిన ధనరాశుల నుంచి ఒక కొత్త రాజకీయతరమే రాష్ట్రంలో అవతరించింది. ప్రజల ఉమ్మడి ఆస్తులు, ఖజానా ఎటుపోయినా కానీ, వ్యక్తిగత లబ్ధి చేకూరితే చాలుననే స్థితిలోకి ఓటరు పడిపోయాడు.
కొత్తగా వేదికమీదకు వచ్చిన దళారీవర్గమో, శీఘ్ర సంపన్నవర్గమో జనానికి భారంగా తయారయ్యారు. జగన్ రాజకీయాలలోకి వచ్చిన క్రమం కూడా భిన్నమైనదేమీకాదు. ఆయన ప్రతిపాదిస్తున్న అరచేతిలో వైకుంఠం ఏమిటి? తన తండ్రి ఆస్తి తనకు దక్కలేదన్న ఆగ్రహం తప్ప ఆయన ఆవేదనలో ప్రజాప్రయోజనం ఏమిటి? ఈ శుష్కమైన అధికార క్రీడలో ఏర్పడే అస్థిరతను, అశాంతిని మాత్రం ప్రజలు భరించవలసిందే.
తెలంగాణ రాష్ట్రసమితి నాయకుడు కె.చంద్రశేఖరరావు ఆమరణదీక్ష ప్రారం భించిన సరిగ్గా ఏడాది గడచిన నవంబర్ 30 నాడే జగన్ రాజీనామాతో రాష్ట్రంలో మరో సంక్షోభం ప్రారంభమయింది. ఇంకో నెలరోజుల్లో శ్రీకృష్ణకమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరుతుంది. నివేదికలోని అంశాలపై నిర్ణయాలు తీసుకున్నా, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగినా వివిధ ప్రాంతాలలో తీవ్రమైన ప్రతిస్పందనలు ఎదురుకావచ్చును. అందరినీ అనునయించి, ఏకాభిప్రాయం దిశగాకానీ, విస్తృతాభిప్రాయానికిగానీ సంసిద్ధం చేయడానికి సుస్థిరత, ప్రశాంతత అవసరం.
రాజకీయ నాయకత్వం తన పదవిని కాపాడుకోవడానికే సతమతమయితే, స్థితప్రజ్ఞతతో కూడిన వ్యవహారసరళి సాధ్యపడదు. పదవులే లక్ష్యంగా ముఠాలు నడిపేవారు అశాంతిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వాలపై ఒత్తిడులు తేవ చ్చు. దీర్ఘకాలికమయిన ప్రజాప్రయోజనాల రీత్యా- రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడ్డ ముఠాకుమ్ములాటల రాజకీయాలను సత్వరం ఉపశమింపజేయవలసి ఉన్నది. దుష్టశక్తులు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయవలసి ఉన్నది.
జగన్‌ప్రత్యక్ష యుద్ధం
Surya daily
అర్థబలం, అంగబలం తండ్రి సంపాదించి పెట్టిన అనుచరవర్గ బలం గణనీయంగా ఉన్న జగన్‌కాంగ్రెస్‌అధిష్ఠానవర్గంపై చేసిన ఈ అసాధారణ తిరుగుబాటు కొండను మరో కొండ ఢీకొన్న చందమా లేక బోడిగుండు ఢీకొన్న మాదిరిగా తెల్లారిపోయి ఆయనకే పరాజయ పరాభావాలను చవిచూపిస్తుందా అనేది భవిష్యత్తు తేల్చాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి తిరిగి అధికారం సాధించి, వరుసగా రెండోసారి విజయహారం దాని మెడలోవేయించిన వై.ఎస్. రాజ శేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసి, ఆయన కుమారుడిని లక్ష్యంచేసుకుని కక్ష సాధిస్తున్నారని పార్టీ అధిష్ఠానాన్ని రాష్ట్రప్రజల ముందు పలచనచేసే వ్యూహం జగన్‌తాజా కదలికలో స్పష్టంగా కనుపిస్తున్నది.
పొమ్మనలేక పొగబెట్టిన కాంగ్రెస్‌అధిష్ఠానం చర్య ఆశించిన ఫలితాన్నిస్తున్నది. కడప ఎం.పి. వై.ఎస్. జగన్‌తన లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చారు. అంతేకాదు, ఆయన తల్లి విజయలక్ష్మి కూడా తన శాసనసభ్యత్వానికి స్వస్తి చెప్పారు. జగన్‌రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌మీరాకుమార్‌ఆయనతో మాట్లాడి వెంటనే ఆమోదించారని వార్తలు చెబుతున్నాయి. ఈ హఠాత్పరిణామం రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులకు, మలుపులకు దారి తీస్తుందో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము గాని ఇంతవరకు కప్పి ఉన్న నివురు తొలగిపోయి కణకణ మండుతున్న నిప్పు ఇప్పుడు బయటపడిన సంగతిని కాదనలేము. ్ఞఅది నేడు అందరి కళ్ళ ముందు కనపడుతున్న కఠోర వాస్తవమే. నీటిలోని గేదె నెమ్మది నెమ్మదిగా బయట పడుతున్నది. కాంగ్రెస్‌అధిష్ఠానవర్గానికి, వైఎస్‌జగన్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పరిసమాప్తమై సమరం రాజుకోవడం ప్రారంభించింది.
తండ్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనతికాలానికే హఠాన్మరణం పాలైన మరునాటి నుంచి రాష్ట్రాధినేత పదవిపై కన్నువేసి జగన్‌ధిక్కార బాట పట్టారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ఏడాది రెండుమాసాల ఇరవై రెండు రోజు ల కాలం ఓదార్పు యాత్ర ముసుగులో సాగిన ధిక్కారం తన సామాజిక వర్గానికి, తన ప్రాంతానికే చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూచోబెట్టేసరికి ముసుగు తొలగించుకొని ఒక్కసారిగా పెల్లుబికింది.
అంతేకాదు, వినూత్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల అమలు పరంగా డాక్టర్‌వైఎస్ రాజశేఖరరెడ్డి సముపార్జించుకున్న ప్రజాభిమాన ధనాన్ని, ఆయన అనూహ్య అతి విషాదకర దుర్మరణం కారణంగా పెల్లుబికిన సానుభూతిని జగన్‌వ్యక్తిగత ఖాతా నుంచి పార్టీ అకౌంట్‌లోకి మళ్ళించుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్‌ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మంత్రి పదవిని ఇవ్వజూపడం, ఆయనతో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో సోనియా గాంధీ స్వయంగా మాట్లాడడం జగన్‌కు పుండు మీద కారం చల్లిన చందంగా అనిపించి పార్టీని వీడి తన తడాఖా చూపించడమే శరణ్యమని ఆయ న భావించారు. మొత్తానికి జరగవలసిందేదో జరిగిపోయింది.
రాజీకి సర్దుబాటుకు ఏమాత్రం ఆస్కారంలేని రీతిలో పరిణామాలు చకచకా సంభవించాయి. జగన్‌వర్గం గా పరిగణన పొందుతున్న యువతరం ఒక్కుమ్మడిగా రెచ్చిపోయి సోనియా గాంధీ దిష్టిబొమ్మ తగులవేత, పాద రక్షల తాడనం వంటి చర్యలకు దిగిన తర్వాత రాజీకి దారులు మూతపడినట్టే భావించాలి. అయితే ఇప్పుడేమి జరుగుతుందనేదే అతిపెద్ద ప్రశ్న.ఇంతకాలం లేస్తే మనిషిని కాను అన్నట్టు పార్టీలోనే ఉండి హుంకార, ఘీంకారాలు చేసిన జగన్‌ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా లేచి నిలబడ్డాడు. నిలబడినవాడు ఏమి చేస్తాడు? రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాడా? మరో ప్రాంతీయ పార్టీ పెట్టి తమిళనాడులో మాదిరి పరిస్థితికి తెరలేపుతాడా? కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీలోని తన బలాన్ని ప్రయోగించి కిరణ్‌కుమార్‌రెడ్డి గట్టిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులు కాకముందే ఆ సీటును కదిలించి వేయడానికి సాహసించగలుగుతాడా?
సోమవారం నాటి పరిణామాలను గమనిస్తే ఆయనకు అనుకూలురైన కొన్ని జిల్లాలలోని కాంగ్రెస్‌ఎంపిటిసి, డ్‌పిటిసిలు జిల్లా కాంగ్రెస్‌కార్యవర్గ సభ్యులు వంటి బలగం ఆగ్రహ జ్వాలలు మిన్నంటిన సంగతి స్పష్టపడుతుంది.అట్టడు గు పార్టీ నిర్మాణంలో, కార్యకర్తలలో తనకున్న బలాన్ని మాత్రమే జగన్‌ప్రదర్శించాడు.ఇందువల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిగే తక్షణ నష్టం శూన్యమే. ఒకవేళ జగన్‌వర్గం శాసనసభలో కూడా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే అది నిజంగానే నూతన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కాళ్ళ కింద నేలను గణనీయంగా కదిలించివేస్తుంది.
ఎందుకంటే శాసనసభలో బొటాబొటీ అంటే కేవలం తొమ్మిది, పదిమంది సభ్యుల సంఖ్యాధిక్యతతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది. అందుకోసమే ఒకవైపు ప్రజారాజ్యం పార్టీని ఊతకర్ర చేసుకునేందుకు అవసరమైన పూర్వరంగాన్ని అధిష్ఠానం ఇంతకు ముందే సిద్ధం చేసింది. అయితే ఆ పార్టీ శాసనసభ్యులు ఎంతమంది నాయకత్వం మాట వింటారన్నది అనుమానమే. మరోవంక ఎమ్‌ఐఎమ్‌సహకారమూ కాంగ్రెస్‌కు లభించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలపరుస్తాం అంటూ టిఆర్‌ఎస్‌అధినేత కెసిఆర్‌కూడా బయటపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే శాసనసభ్యుల బల ప్రదర్శనకు, ప్రయోగానికి జగన్ తొందరపడకపోవచ్చు. తనవర్గం శాసనసభ్యులను పార్టీలోపలే ఉండనిచ్చి మరికొన్నాళ్ళు కథ ఇలాగే నడిపించవచ్చు.
ఆరు మాసాలలో జరగబోయే పులివెందుల శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో జగన్‌పోటీ చేయడం ఖాయం. అలాగే కడప లోక్‌సభ స్థానం నుంచి తన తల్లినో వేరెవరైనా కుటుంబ సభ్యులనో, సన్నిహితులనో తన పార్టీ తరఫున నిలబెట్టవచ్చు. తక్షణమే జరగవలసినది జగన్ సొంతపార్టీ ప్రకటన. అర్థబలం, అంగబలం తండ్రి సంపాదించి పెట్టిన అనుచరవర్గ బలం గణనీయంగా ఉన్న జగన్‌కాంగ్రెస్‌అధిష్ఠానవర్గంపై చేసిన ఈ అసాధారణ తిరుగుబాటు కొండను మరో కొండ ఢీకొన్న చందమా లేక బోడిగుండు ఢీకొన్న మా దిరిగా తెల్లారిపోయి ఆయనకే పరాజయ పరాభావాలను చవి చూపిస్తుందా అనేది భవిష్యత్తు తేల్చాలి.రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి తిరిగి అధికారం సాధిం చి, వరుసగా రెండోసారి విజయహారం దాని మెడలోవేయించిన వై.ఎస్. రాజ శేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసి, ఆయన కుమారుడిని లక్ష్యంచేసుకుని కక్ష సాధిస్తున్నారని పార్టీ అధిష్ఠానాన్ని రాష్ట్రప్రజల ముం దు పలచనచేసే వ్యూహం జగన్‌తాజా కదలికలో స్పష్టంగా కనుపిస్తున్నది.
ముఠాకుమ్ములాటలు
prajasakti
సంపాదకీయం Mon, 29 Nov 2010, IST
వైఎస్‌తనయుడు జగన్, ఆయన తల్లి విజయమ్మ తాము ఎన్నికయిన చట్టసభలకు, పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు పరాకాష్టకు చేరాయి. రెండు ముఠాల అనుచరగణం బజారున పడి తిట్టుకోవడమే కాదు జగన్‌మద్దతుదారులు విధ్వంసకాండకూ దిగారు. కడపలో విధ్వంసం ఉధృతి సహజంగానే ఎక్కువ స్థాయిలో ఉంది. జిల్లా కాంగ్రెస్‌కార్యాలయం పేరును సోనియా భవన్ నుండి వైఎస్‌భవన్‌గా మార్చారు. పలు జిల్లాల్లో ఫ్లెక్సీలపై ఉన్న సోనియగాంధీ బొమ్మలను చెప్పులతో కొట్టారు. నిన్నటి దాకా కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పుకొన్న వారే తమ అధినాయకురాలి పట్ల ఇలా ప్రవర్తించడం బహుశా కాంగ్రెస్‌కే చెల్లుతుందేమో! జగన్‌కు మద్దతుగా ఎవరెవరు చట్టసభలకు రాజీనామా చేయనున్నారో స్పష్టం కానప్పటికీ వివిధ జిల్లాల్లో పార్టీ పదవులకు జగన్‌మద్దతుదారులు రాజీనామా చేశారు. తన బాబాయి వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇవ్వజూపి కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు కూడా కాంగ్రెస్‌అధిష్టానం ఒడిగట్టినందునే తాను, తన తల్లి రాజీనామా చేస్తున్నట్లు జగన్‌ప్రకటించారు. రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన ఇప్పుడు ఏం చెప్పినా ఒకరి సమాచారం మరొకరికి తెలుస్తూనే ఉందని, అందుకే గత కొంత కాలంగా పార్టీలో ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయని అర్థమవుతూనే ఉంది. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు వరుసగా ఇటీవల బయటపడుతూ వచ్చాయి.
కామన్‌వెల్త్, ఆదర్శప్లాట్లు, 2జి స్పెక్ట్రమ్‌కుంభకోణాల్లో నిందితులపై కేంద్రప్రభుత్వానికి ప్రాథమికంగానైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో డిఎంకె మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చినా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా కాంగ్రెస్‌దే ఇందులో ప్రధాన బాధ్యత, మిగతా కుంభకోణాల్లో కాంగ్రెస్‌నాయకులే నిందితులుగా జనం ముందు నిలబడ్డారు. ఈ కుంభకోణాలపై దాదాపు రెండు వారాలుగా పార్లమెంటు స్తంభించి పోయింది. నిష్కళంకుడని భావించే ప్రధాని మన్మోహన్‌సింగ్‌పరువు కూడా బజారుపాలయింది. రాష్ట్ర పరిస్థితి ఇంతకంటే దయనీయం. కుంభకోణాలతో పాటు ఇక్కడ పరిపాలనే స్తంభించిపోయింది. సిఎం పదవికి రోశయ్య రాజీనామా చేసే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 రంగాల్లోని ప్రజానీకం తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులనుంచి ఉద్యోగులుగా గుర్తింపే లేని ఆశావర్కర్ల వరకు తమ గోడును చెప్పుకుందామని అసెంబ్లీకి బయల్దేరితే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిపోయారు. రాజధానిలో తమ సమస్యలపై ఆందోళనకు దిగిన ఉద్యోగులను పట్టించుకునే వారే లేరు. కుమ్ములాటలు, వ్యూహ ప్రతివ్యూహాలతో కాంగ్రెస్‌ముఠాలు మునిగిపోయి ఉన్నాయి.
జనం సమస్యలు వినేందుకు ప్రభుత్వాధినేతలకు సమయమే లేకుండా పోయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆకస్మికంగా రోశయ్యను తొలగించి మరొకరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. కొత్త మంత్రివర్గం ఉనికిలోకి వచ్చిన తర్వాతనయినా గోడు వినే వారు దొరుకుతారని ఆశించిన వారికి ప్రస్తుత పరిణామాలు అశనిపాతంలా పరిణమించాయి. ఈ ముఠా కుమ్ములాటలో జనం పడి నలిగిపోయేట్లున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు సాగిస్తున్న ఉద్యమాలు ఉధృతమవుతున్న స్థితిలో ఈ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌మాటలు నమ్మి ప్రజలు దాన్ని రాష్ట్రంలో రెండవసారి గెలిపించారు. అదీ బొటాబొటి మెజారిటీతో. రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అది మరింత వేగంగా అమలుచేయడం మొదలెట్టింది. పెద్దఎత్తున అవినీతి అక్రమాలు సాగిపోయాయి. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విధానాల్లో ఏ మార్పూ రాలేదు. పైగా సంక్షేమ పథకాలకు స్వస్తిచెప్పే ప్రయత్నాలు బహిరంగంగానే మొదలెట్టింది. ఈ దశలో కిరణ్‌కుమార్‌రెడ్డిని అనూహ్యంగా కాంగ్రెస్‌అధినాయకత్వం సిఎం సీటుపై తెచ్చి కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రి మార్పుతోగానీ, జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామాలతోగానీ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు. ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి తాత్కాలికంగా మాత్రమే ఇవి పనికొస్తాయి. ప్రజల సమస్యలకు ఏ మాత్రం సంబంధం లేని ఈ తతంగాన్నంతటినీ ఎలక్ట్రానిక్‌మీడియా 24 గంటలపాటు ఊదరగొడ్తోంది.
చర్చోపచర్చలు నిర్వహిస్తోంది. అసలు విషయాలను తక్కువ చేసి చూపడంలో తన సహజ నైజాన్ని కార్పొరేట్‌మీడియా ప్రదర్శించింది. ఇలాంటి మార్పుల ద్వారా ముఠాకుమ్ములాటల ద్వారా జనం తమ సమస్యల నుంచి దృష్టిని మళ్లిస్తారని కాంగ్రెస్‌అధిష్టానం, పాలకవర్గాలు, కార్పొరేట్‌మీడియా భావిస్తున్నట్లుంది. రోజువారి ఉప్పు, పప్పు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాలు తీరే అవకాశం లేనప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లోనే ఉంటారు. ఒకరోజు వారి దృష్టి మళ్లించినా మరుసటి రోజు ఈ సమస్యలు వారి దృష్టికి కచ్చితంగా వస్తాయి. పోరాటాలు చేయకా మానరు. పాలకులు ఈ విషయం అర్థం చేసుకోవడం అవసరం. బీడీకార్మికులు, 104 సిబ్బంది, ఆశావర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామపంచాయతీ వర్కర్లు, వికలాంగులు, శ్రామిక మహిళలు ఇలా అనేక రంగాల్లోని ప్రజానీకం తమ సమస్యలు పరిష్కారం కావాలని ఎదురుచూస్తున్నారు. సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే కాంగ్రెస్‌అధిష్టానం అత్యంత బాధ్యతారాహిత్యంగా కుర్చీలాటకు, కుమ్ములాటకు తెరతీసింది. ఈ కుర్చీలాటను సాధ్యమైనంత వేగంగా కట్టిపెట్టి ప్రజాసమస్యలపై దృష్టిని మళ్లించాలి. ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలు ఎల్లవేళలా ఫలించవు. తమను పట్టించుకోని ముఠాలకు, పార్టీలకు ప్రజలు సమాధానం చెప్తారు.
కుబుసం విడిచిన దురాశ!
Eenadu 01-12-10
‘పార్టీలో వర్గాలంటూ ఏమీ లేవు, అంతా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా వర్గమే’- రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిత్వం చేపట్టాక వైఎస్ చేసిన వ్యాఖ్య అది. తనకు పార్టీయే పునాది అనీ, పార్టీ లేకుంటే తాను లేనన్నదీ వైఎస్ త్రికరణశుద్ధిగా చెప్పిన మాటే! దశాబ్దాల పర్యంతం కాంగ్రెస్ అధిష్ఠానానికి విధేయత చాటి ఎమ్మెల్యేగా, పీసీసీ పీఠాధిపతిగా, ఎంపీగా పలుమార్లు సేవలందించిన వైఎస్ పాతికేళ్ల నిరీక్షణ 2004లో ఫలించి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం దక్కింది. సోనియాయే చెప్పినట్లు- ఏ రాష్ట్రంలో పార్టీ గెలిచినా పీసీసీ పెద్దకే ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టే ఆనవాయితీని పక్కనపెట్టి కాంగ్రెస్ అధిష్ఠానం వైఎస్‌కే అవకాశం కల్పించింది. ఒక్క వైఎస్‌నే కాదు, మొత్తం ఆయన కుటుంబాన్నే పార్టీ ఎంతగా సమాదరించిందో- కుమారుడు జగన్ ఎంపీ, సోదరుడు వివేకా ఎమ్మెల్సీ, ఆత్మీయుడు కేవీపీ ఎంపీ, బావమరిది మేయర్… ఇలా ఈ జాబితా చూస్తేనే తెలుస్తుంది. వైఎస్ దుర్మరణం పాలయ్యాక ఈ పద్నాలుగు నెలల్లో- తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే దురహంకారపూరిత రాజకీయం గజ్జె కట్టింది. నీచ రాజకీయమంటూ అధిష్ఠానాన్ని దుమ్మెత్తిపోసి, పార్టీకీ పదవులకూ వైఎస్ జగన్ రాజీనామా చేసిన రోజునే- నెహ్రూ బొమ్మ నేలకూలింది, ఇందిర భవన్ పేరు మారింది, సోనియా దిష్టిబొమ్మ దగ్ధమైంది. ‘పథకం ప్రకారం చిన్నాన్నను ఢిల్లీకి రప్పించుకొని కుటుంబాన్ని చీల్చే నీచరాజకీయం చేస్తారా’ అంటూ జగన్ వెళ్లగక్కిన ఆక్రోశానికి- వైఎస్ వివేకా వివరణ గాలి తీసేసింది. పార్టీ ఏదో కుతంత్రం పన్నిందన్నది అవాస్తవమన్న వివేకా, మంత్రి పదవి ఆశించి తానే ఢిల్లీ వెళ్లానని తేల్చిచెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకొన్న నెలలోపే జగన్‌కు ఎంపీ టికెట్ రావడానికి కారణం వైఎస్‌పట్ల అధిష్ఠానానికి ఉన్న అభిమానం. తండ్రి వదిలివెళ్లిన ఆస్తిలా ఆయన పదవీ వారసత్వమూ తనకే దక్కాలన్న జగన్ దురాశలో- కళ్లకు కడుతోంది ఫ్యాక్ష’నిజ’ నైజం!
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ తన తండ్రి పెట్టిన భిక్షే అనుకొంటున్న జగన్- వైఎస్ దుర్మరణానంతరం ముఖ్యపీఠం తనకెందుకు దక్కలేదని ఆక్రోశిస్తున్నారు. 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికను వైఎస్ ఇష్టారాజ్యానికి అధిష్ఠానం వదిలేయడమే ఈ సమస్యకు మూల హేతువు. పార్టీని మళ్లీ గెలిపించే పూచీ తనదేనంటూ విధేయగణానికే వైఎస్ టికెట్లు ఇప్పించారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి 2009 అసెంబ్లీ ఎన్నికల రంగంలో పోటీపడిన చిరంజీవి- సర్కారు వ్యతిరేక ఓట్లలో 16.22శాతం చీల్చారు. మహాకూటమితో పోలిస్తే ఒక్కశాతం ఓట్ల తేడాతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా పార్టీ నావను ఒడ్డుకు చేర్చిన వైఎస్- ఘన విజయసారథిగా ప్రతిష్ఠ కొట్టేశారు. వైఎస్ విషాదాంతం దరిమిలా పట్టాభిషేకం తనకే జరగాలంటూ ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన జగన్- ఎందుకైనా మంచిదని తండ్రి అంత్యక్రియలు పూర్తికాకముందే ప్రరాపా మద్దతు కోరిన శవరాజకీయం, రాష్ట్ర ప్రజల్ని దిగ్భ్రాంతపరచింది. ఈ సంగతులన్నీ తెలిసిన అధిష్ఠానం అనుభవజ్ఞుడైన రోశయ్యకు పదవీ పగ్గాలు అప్పగిస్తే- హుటాహుటిన ఓదార్పు పేరిట జగన్నాటకానికి తెరలేచింది. పార్టీపరంగా ‘ఓదార్పు’ చేపడతామన్న అధిష్ఠానం సూచనల్ని బేఖాతరు చేసి, మందీమార్బల ప్రదర్శనలతో మండలాలు, గ్రామాల్ని హోరెత్తించిన యాత్రల్లో- ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచే వ్యూహమే పక్కాగా అమలైంది. కాంగ్రెస్ ప్రభుత్వసారథిగా వైఎస్ అమలుచేసిన పథకాల్ని ప్రస్తావించి ఆ కీర్తికి వారసత్వం తనదేనని చాటే తపన తప్ప- పార్టీనీ సోనియా నాయకత్వాన్నీ జగన్ స్మరించిందెక్కడ? రోశయ్య ఆపద్ధర్మం ముగిశాక తాను తప్ప అధిష్ఠానానికి దిక్కులేదన్న దుర్భ్రమతో, పాలకపక్షాన్ని చీల్చే కుహకానికీ జగన్ తెగించారన్న విశ్లేషణల నేపథ్యంలో- కాంగ్రెస్ యంత్రాంగం వ్యూహాత్మక మంత్రాంగం నెరపింది. కొత్త ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ను నిర్ధారించినప్పుడే జగన్ శిబిరం అసమ్మతి కుబుసం విడిచింది. ప్రస్తుత రాజీనామా- ప్రత్యక్షపోరుకు నాంది!
‘నా తండ్రి కీర్తిప్రతిష్ఠలమీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు?’- అని పార్టీ అధిష్ఠానాన్ని జగన్ నిలదీస్తున్నారు. పరదాలు కప్పితే కనుమరుగైపోయేవా- వైఎస్ జమానా నాటి అక్రమాలు, మహా కుంభకోణాలు? ముఖ్యమంత్రిగా వైఎస్ ధనరాశులు పోగేశారని తెలిసికూడా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగించామన్నది, ఇటీవల తనను కలసిన డీఎల్ ప్రభృతులతో సోనియా అన్నమాట. చట్టబద్ధ పాలనను, సమస్త రాజ్యాంగ విలువల్నీ తుంగలో తొక్కి, ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానం (క్రోనీ క్యాపిటలిజం) పెంచిపోషించి, తన కుటుంబానికి వేలకోట్లు దోచిపెట్టిన వైఎస్ నీతిబాహ్య పాలనకు స్వతంత్ర భారత చరిత్రలోనే సరిపోలిక లేదు. రైతుబాంధవుడని వైఎస్‌కు కీర్తికిరీటాలు తగిలించారే- ఏ ఒక్కరైతూ ఆత్మహత్య చేసుకోకూడదన్న ఆయన ఏలుబడిలో ఎన్ని వేలమంది బలవన్మరణం పాలయ్యారో గుర్తించిందెవరు? జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి పొలాల్లోకి నీళ్లు పారకపోయినా, అస్మదీయుల ఖాతాల్లోకి ప్రజాధనం ప్రవహించేలా కాసుల కాల్వలు తవ్వించిన ‘అపర కాటన్’దొర ఎవరో కాంగ్రెస్ పెద్దలకు తెలియనిది కాదు. ప్రజాసంక్షేమ పథకాల పేరిట జన ఖజానానుంచి ఏవో కొద్ది మొత్తాల్ని విదిలించి, వేలకోట్ల రూపాయల భూరి పెన్నిధుల్ని అక్రమంగా కొల్లగొట్టిన మహా కుంభకోణాలన్నింటిపైనా వైఎస్ ముద్ర- ఎవరెంత ప్రయత్నించినా చెరిగిపోయేది కాదు. 2004లో దివాలా అంచుల్లోకి వెళ్లిన ఆయన కుటుంబం, కళ్లు బైర్లుగమ్మే సంపదలకు ఎలా పడగెత్తిందో సమస్త ప్రజానీకానికీ తెలుసు! అష్త్టెశ్వర్య ప్రదాయనిగా పెద్దకుర్చీ మహిమ తెలిసి, దానిపై కన్నేసిన జగన్‌కు కాంగ్రెస్‌లో కొనసాగితే ఇప్పుడప్పుడే అది తనకు దక్కదని రూఢి అయ్యాకే- అధిష్ఠానంపై ఆక్రోశం పెల్లుబికింది. ‘జగన్ ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు… ఎదుగుదల అనేది అతనిపై, కాలంపై ఆధారపడి ఉంటుంది. నాపై కాదు’ అని వైఎస్సే చెప్పారు. కాలంచేసిన వైఎస్ బొమ్మ పట్టుకొని, ఆయనిచ్చిపోయిన ధనరాశుల దన్నుతో జగన్ ఇప్పుడు అధిష్ఠానంపైనే తొడగొడుతున్నారు! ఇంతలోనే ఎంత వైచిత్రి!
తండ్రి బాట వీడిన తనయుడు
Andhraprabha daily
apr – Wed, 1 Dec 2010, IST
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17 మాసాల క్రితం ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ప్రతి సభలోనూ హెచ్చరిక చేసేవారు. కానీ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వై.ఎస్. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొద్ది నెలలకే హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రం నిజంగానే కుక్కలు చింపిన విస్తరైంది. ఇప్పుడు ఆయన కుటుంబంలోనూ రవరవలు రేగాయి. ఈ పరిణామాలు నిస్సందేహంగా ఆయన ఆత్మకు క్షోభ కలిగించేవే. రాజశేఖరరెడ్డి తరువాత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పాలన సాగించనివ్వని పరిస్థితులే ఇప్పుడు అంతకుమించిన తీవ్ర మైన రూపును తీసుకున్నాయి. రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని వారసత్వంగా పొందుదామని పావులు కదిపి భంగ పడ్డారు. అలాగే,రెండవ సారి కూడా ప్రయత్నించి భంగపడిన జగన్ తన తండ్రి ఎదుగుదలకు కారణమైన కాంగ్రెస్ అధిష్ఠానం మీద అభాండం వేసి పార్టీ నుంచి వైదొలగారు. మూడవ ముఖ్యమంత్రిగా కొద్ది రోజుల క్రితం ప్రమాణం చేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాజశేఖరరెడ్డి అభిమానం పొందిన నాయకుడే కాక,ఇరువురిదీ ఒకే సామాజికవర్గం, ఒకే ప్రాంతం కావడం వల్ల పరిస్థితుల్లో కొంతైనా మార్పు వస్తుందని ఆశించిన అధిష్ఠానవర్గానికి జగన్ ధోరణి వల్ల ఆశాభంగం తప్పలేదు.
రాజశేఖరరెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం అసమ్మతి రాజకీయాలను నడిపినట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన ఏనాడూ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించలేదు. జనాకర్షణ విషయంలో రాజశేఖరరెడ్డికీ,జగన్‌కీ పోలికలు ఉన్నప్పటికీ అధిష్ఠానం పట్ల విధేయత విషయంలో ఏమాత్రం పోలిక లేకపోవడం వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యంగా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అందించిన సహాయ సహకారాలు, స్వేచ్ఛ కారణంగానే రాజశేఖరరెడ్డి మహానాయకుడిగా ఎదిగారు. అదే సోనియా గాంధీని ఆయన కుమారుడు నిందించే పరిస్థితి ఉత్పన్నం కావడం దురదృష్టకరం. జగన్ ధోరణి వల్ల పార్టీలోనే కాక,సొంత కుటుంబంలోనూ చిచ్చు రేపింది. ఎంత ప్రతిభావంతులైనా పెద్దల మాటలను గౌరవించడం, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక అడుగు వెనుకవేయడం ఎంత మాత్రం నామోషీ కాదు. పెద్దల మాట చద్ది మూట అనే సామెత ననుసరించి అధిష్ఠానం సలహాని పాటించకపోవడం వల్లే చివరికి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని కూడా జగన్ దూరం చేసుకున్నారు. వైఎస్ కుటుంబం మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా,ఇందిర, రాజీవ్‌ల తరువాత ఇప్పుడు సోనియా పట్ల విధేయత కలిగి ఉంది. గాంధీ, నెహ్రూ కుటుంబం పట్ల తనకు గల గౌరవాన్నిచాటేందుకు వైఎస్ తాను చేపట్టిన పథకాలన్నింటికీ ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టారు.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ పేరు పెట్టే విషయంలో ఆయన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యంతరాలను ఖాతరు చేయలేదు.
సోనియా మెప్పుకోసమే ఆమె భర్త, అత్తల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెడుతున్నారంటూ ప్రత్యర్దులు విమర్శించినా వైఎస్ ఏనాడూ పట్టించుకోలేదు.రెండు సార్లు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన సోనియా వంటి త్యాగశీలి ప్రపంచంలోనే లేరని నిండు శాసనసభలో వైఎస్ ఎన్నోసార్లు ప్రశంసించారు.ప్రతిపక్షాలు ఆమెను విమర్శిస్తే సహించేవారు కారు.అటువంటి మహోన్నత విశ్వాసం కలిగిన వైఎస్ కుమారుని జగన్ సారథ్యంలోని మీడియాలో సోనియాకి వ్యతిరేకంగా ప్రసారమైన కథనాలూ వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. వా రందరి మాదిరిగానే వైఎస్ వివేకానంద రెడ్డి కూడా బాధాతప్త హృదయంతో సోనియాకి సారీ చెప్పేందుకు నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఆమెను కలుసుకుంటే, అధిష్ఠానం తమ కుటుంబంలో చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోందంటూ సోనియాకు బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించడం కాంగ్రెస్ కార్యకర్తలకు పుండు మీద కారం చల్లినట్టుఅయింది.
జగన్ రాజీనామా తదనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన అభిమానులు సోనియా ఫ్లెక్సీలనూ, కాంగ్రెస్ జెండాలనూ తగులబెట్టడం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేయడం వైఎస్ ఆత్మకు క్షోభ పెట్టే పరిణామాలే. తన అభిమానులు ఎవరూ హింసకు పాల్పడవద్దని జగన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన మాటను ఎవరూ ఖాతరుచేయనట్టు కనిపిస్తోంది . పరిస్థితి తీవ్రంగా మారుతున్న కారణంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు సోనియాని విమర్శిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయవలసి వచ్చింది. జగన్ రాజకీయాల్లో ప్రవేశించి రెండేళ్ళు కూడా కాలేదు.
ఆయన తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తికి మాత్రమే కాక,పదవికి కూడా వారసత్వపు హక్కుని కోరుకోవడం వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయి.తన తండ్రి ప్రాంతీయ పార్టీ అధినేత అయితే జగన్ ఆ విధంగా ఆశించడాన్ని ఓ విధంగా అర్థం చేసుకోవచ్చు . కానీ, 125 సంవత్సరాల జాతీయ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి అంత సులభంగా దక్కదన్న సంగతి తెలియడం వల్లనే జగన్ సొంత కుంపటి ఏర్పాటు కోసం కాంగ్రెస్ నుంచి వైదొలగి ఉంటారు. ముఖ్యమంత్రి పీఠం తన తక్షణ లక్ష్యం కాదని ఆయన చెబుతున్నప్పటికీ ఆయన పోకడలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తన తండ్రి రెండో సారి అధికారంలోకి తెచ్చి న పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చారన్న అపవాదు పడకుండా జగన్ తన ధోరణిని మార్చుకోవడం ఎంతైనా అవసరం. ఆలా కాకపోతే ఇప్పుడు బాబాయ్ దూరమైనట్టే, రేపు జనం కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది.
Times of India
Andhra Pradesh seems headed for a realignment of political forces. The first sign came when the Congress chose Kiran Kumar Reddy as the new chief minister of the state last week. It sent a clear signal to Jagan Mohan Reddy, son of former chief minister Y S Rajasekhara Reddy, that the party was looking beyond him to chart its future course in the state. Jagan – who, along with his mother, the widow of YSR, quit the party on Monday – is expected to float a new outfit and challenge the Congress. This could have an immediate bearing on the government in Hyderabad and a long-term impact on the party’s future in the state.
Andhra Pradesh is one of the few Congress bastions left in the country. It’s one of the few states where the party is not dependent on allies to run the government. The UPA could gain office in 2004 and 2009 mainly because of the success in Andhra. The Congress won 29 and 33 of the 42 Lok Sabha seats from the state in 2004 and 2009 respectively, besides winning back-to-back assembly elections. A split in the Andhra unit could be disastrous for the party.
But can Jagan force a split in the party? His road show to connect with YSR supporters soon after the latter’s death was successful. Despite directions from the Congress leadership, many MLAs and even a couple of ministers shared the platform with Jagan during his travels. But will these legislators break away from the Congress and join him? Even a minor rebellion can upset the Congress’s calculations since it has only a majority of 10 in the assembly. It hopes to rope in Chiranjeevi’s Praja Rajyam to make up for any shortfall. The party has also roped in YSR’s brother, a member of the state legislative council, in the hope that Jagan will not walk away with his father’s legacy.
The challenge before Jagan is to make his revolt count. He has to translate the public sympathy for his father into approval for a new regional party. He needs to fight the Congress machinery, win over legislators and cadres and sustain public sentiment in his favour until the next election, which is most likely to be held in 2014. That’s no mean task. It also remains to be seen if Jagan can convince the public that YSR’s family alone owns his legacy. After all, YSR was the face of the Congress and his electoral success was as much the success of the Congress.