కడప : మహానేత వైఎస్ కృషితో పాటు జిల్లా వాసుల కల నెరవేరనుంది.. కాగితాలకే పరిమితమైన కడప- బెంగళూరు రైలు మార్గానికి మంగళవారం «శీకారం చుట్టనున్నారు… ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో నూతన శకానికి ఈ రైలు మార్గం నాంది పలకనుంది.మహానేత మన మధ్య లేకపోయినా ఆయన తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. 258.3 కిలోమీటర్లు.. రూ.1785 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు రీచ్‌ల్లో పనులు పూర్తి. ఎన్నో సంవత్సరాల నుంచి జిల్లావాసులు ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నేరవేరనుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప బుధవారం కడప- బెంగళూరు మార్గానికి శంకుస్థాపన చేయనున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి సాయిప్రతాప్, మంత్రి అహ్మదుల్లా, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
కడప-బెంగళూరు రైలు మార్గ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌విఎన్‌ఎల్) చేపట్టింది. 258.3 కిలోమీటర్లకు గాను రూ.1785కోట్లు అంచనా వ్యయంతో ఈ మార్గం పనులను బుధవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌విఎన్‌ఎల్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను చేస్తోంది.
కడప-బెంగళూరు రైలు మార్గం పనులను మొత్తం నాలుగు రీచ్‌లుగా వీరు చేపడుతున్నారు. అందులో మొదటి రీచ్‌గా కడప నుంచి పెండ్లిమర్రి వరకు 22 కిలోమీటర్ల పరిధి, రెండో రీచ్‌గా పెండ్లిమర్రి నుంచి చిత్తూరు జిల్లా వాయల్పాడు వరకు, మూడో రీచ్‌గా వాయల్పాడు నుంచి కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేట వరకు, నాలుగో రీచ్‌గా బంగారు పేట నుంచి బెంగళూరు వరకు రైలు మార్గం పనులను చేయనున్నారు. ఇప్పటికీ మూడు రీచ్‌ల సర్వే పూర్తయింది. నాల్గో రీచ్ పనులకు సర్వే చేయాల్సి ఉంది. పాకాల-ధర్మవరం రైల్వే లైను మదనపల్లె వద్ద ఈ నూతన మార్గానికి కలువనుంది. మార్గమధ్యంలో 54 పెద్ద వంతెనలు, 315 చిన్న వంతెనలు, 18 క్రాసింగ్ స్టేషన్లు, 13 స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రైలు మార్గం వల్ల కడప – బెంగళూరు మధ్య 70 కి.మీ దూరం కూడా తగ్గనుంది.
మార్గం 18 రైల్వేస్టేషన్ల గుండా వెళ్లేలా అధికారులు రూపకల్పన చేశారు. కడప నుంచి ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, మదనపల్లె, వాయల్పాడుల మీదుగా కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేట గుండా బెంగళూరు చేరుతుంది. ఇప్పటికే కడప, మదనపల్లెలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటిలలో స్టేషన్లు నిర్మించాల్సి ఉంది.ఈ మార్గం పూర్తయితే జిల్లాలోని కడప, పులివెందుల, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు అన్ని నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుంది. కడప, ప్రొద్దుటూరుల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపార వాణిజ్య సంబంధాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మార్గం పూర్తయితే కడప, ప్రొద్దుటూరు వాసులకు బెంగళూరుతో వ్యాపార, ఇతర వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి సాయిప్రతాప్ పలుమార్లు కేంద్రంతో, అప్పటి రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌తో మాట్లాడారు. చివరకు కడప-బెంగళూరు మార్గానికి రాష్ట్రం తరఫున సగ మొత్తం ఇస్తామని చెప్పడంతో కేంద్రం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు మొదటగా రూ.1023 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ప్రస్తుత అంచనా వ్యయం రూ.1785 కోట్లు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. ఈ మార్గానికి 2007-08లలో బీజం పడింది. 2008-09కి గాను సర్వేల కోసం రూ.కోటి కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో కేటాయించింది. తదనంతరం ఈ మార్గానికి 2009-10 బడ్జెట్‌లో రూ.29కోట్లు కేటాయించారు. 2010-11 బడ్జెట్‌లో రూ.40 కోట్లు మరో రూ.40కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాయి. ప్రస్తుతం మొదటి రీచ్ అయిన కడప-పెండ్లిమర్రి మార్గంలో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గం పట్ల చొరవ చూపి బడ్జెట్‌ను బాగా కేటాయిస్తే అయిదేళ్లలో కడప-బెంగళూరు రైలు మార్గం పనులు పూర్తవుతాయి.