శ్రీ వారిని దర్శించుకునే ముందు గానీ, దర్శించుకున్న తరువాత గానీ భక్తులు దేవునికడపను సందర్శిస్తే మహాపుణ్యమని భక్తుల నమ్మిక. తిరులేశుని తొలిగడప.. దేవుని కడప. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దేవునికడప మంచిచెడులను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విస్మరిస్తోంది. తితిదేలో విలీనం చేసుకుని నాలుగేళ్లు పూర్తయినా ఆలయ రూపురేఖలు మార్చడంలో ఘోరంగా విఫలమైంది.
బ్రహ్మోత్సవాలకు మూడు రోజుల ముందు తిరుమల నుంచి తితిదే సిబ్బంది రావడం, తూతూమంత్రంగా హడావుడి చేసి వెళ్లడం రివాజుగా మారింది. ఆలయంలో కొత్త బల్బు వెలగాలన్నా తితిదే విద్యుత్తు విభాగం నుంచి అనుమతి రావాలి. ఇందుకోసం ఎన్ని రోజులైనా నిరీక్షించాల్సిందే,అంధకారంలో ఉండాల్సిందే. ఒక్క బల్బు విషయంలోనే కాదు ఏ చిన్న సమస్య తలెత్తినా పరిష్కారం కావాలంటే ఇదే పరిస్థితి.
తితిదే తరఫున ఆలయ ఇన్‌స్పెక్టరు ఇక్కడ ఉన్నా పేరుకు మాత్రమే. 15 రోజుల క్రితం దేవుడికి పూలు సరఫరా కానీ దుస్థితి నెలకొంది. పూల సరఫరా చేసే గుత్తేదారుకు ఉత్తర్వులు అందలేదని మొహం చాటేశాడు. ‘ఈనాడు’లో కథనం వచ్చి, భక్తుల నుంచి విమర్శలు చవిచూస్తే గానీ తితిదే మొద్దునిద్ర వీడలేదు. నెలకు రూ.3 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నా దేవునిగడప శ్రీ లక్ష్మివెంకటేశ్వర ఆలయం బాగోగులను పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ప్రతి శనివారం శ్రీవారి ప్రసాదాలను సైతం సరిపడా అందుబాటులో ఉంచలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం భక్తులకు కలచివేస్తోంది.
అభివృద్ధి పేరుతో ఉన్న కట్టడాలను, చారిత్రక ప్రాధాన్యం ఉన్న చిత్రకుడ్యాలను ఊడబెరికి దిష్టిబొమ్మల్లా పడేయడం తితిదేకే చెల్లింది. అసలు బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా ఎంత వ్యయం చేస్తున్నామరన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఖర్చును ఎవరైనా అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నారు. నిధుల వ్యయంలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేవునికడప ఆలయం ముఖమండపాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో రెండేళ్ల కిందట తొలగించారు. ఇప్పటి వరకూ దీన్ని పూర్తి చేయకపోవడం తితిదే వైఖరిని స్పష్టం చేస్తోంది. తిరుమల నుంచి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఇక్కడ నిధులు వెచ్చించేందుకు అధికారులు చేతులు రావడం లేదు. వీరు అనుకుంటే మెరుపు వేగంతో పూర్తి చేయగల సామర్థ్యం, సత్తా ఉన్నా నిర్లక్ష్యం చూపుతుండటం భక్తుల హృదయాలను పిండేస్తోంది.
ముఖ మండపం నిర్మాణంలో జాప్యాన్ని ఎండగడుతూ ‘ఈనాడు’లో కథనం రావడంతో తాత్కాలికంగా చలువ పందిరి వేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా రెండేళ్ల కిందట ఆలయ ప్రాకారాన్ని తొలగించారు. ఇందుకు సంబంధించి అష్టదిక్కుల్లో ఉన్న కుడ్యచిత్రాలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శాసనాలను కల్లాల్లో పడేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు కదిలారు. వీటిని తెచ్చి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకింద వేశారు. భక్తులు ప్రదక్షిణాలు చేసే వీలులేకుండా పోయింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా అయినా వీటిని సురక్షిత ప్రదేశంలో భద్రపర్చడానికి తితిదేకుమనసొప్పడం లేదు.
శ్రీవారికి అత్యంత ప్రియమైన సేనాపతి విశ్వక్షేనుడికి బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం జరుగుతుంది. పవిత్ర స్నాన ఘట్టం ముగియగానే ఇందులో మునిగితే స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తులునమ్మకం. అయితే ఇందులో నీరు పాచిపట్టి దుర్గంధం వెదజుల్లుతోంది. ఇందులో స్థానిక యువకులు చేపలు పడుతుండటం గమనార్హం.దేవునికడప చెరువునుంచి ఇందులోకి నీరు వచ్చి బయటకు వెళ్లే ఏర్పాటు ఉంది.
ఈ కాలువను పునరుద్ధరించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తితిదే ముద్రించి పంపిన గోడ పత్రాలు అరకొరగా ఉన్నాయి. జిల్లాలో ముఖ్యమైన ఆలయాల వద్ద, ధార్మిక క్షేత్రాల వద్ద, ఆర్టీసీ బస్సులకు అతికిస్తే ప్రచారం జరిగి ప్రజలకు కార్యక్రమ వివరాలు తెలుస్తాయి. తగినన్ని పత్రాలను పంపలేని నికృష్ట స్థితిలో తితిదే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలను గతంలో నాలుగు శనివారాల్లో అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం మొదటి రెండు శనివారాల్లో తిరుమల లడ్డూను, మిగతా రెండు శనివారాల్లో తిరుచానూరు అమ్మవారి ప్రసాదాలను విక్రయిస్తున్నారు. వీటిని సైతం అరకొరగా సరఫరా చేస్తుండటంతో కొందరికే దక్కుతున్నాయి. మిగతా వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీనిపై భక్తులు అధికారులను నిలదీసినా పట్టించుకునే పరిస్థితి నెలకొంది.
దేవాదాయశాఖ పరిధి నుంచి దేవునికడప ఆలయాన్ని విలీనం చేసుకున్న తితిదే అర్చకులు, సిబ్బంది విషయంలో వివక్ష చూపుతోంది. రూ.40 లక్షల నగదు, రాజుల కాలం నాటి అత్యంత విలువైన అభరణాలు, రూ.లక్షలు విలువ చేసే భూములను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం స్వామి సన్నిధిలో భక్తుల తరఫున పూజలు చేసే అర్చకులను తితిదేలోకి విలీనం చేసుకోవడాన్ని విస్మరించారు. వీరితో పాటు మరో 20 మంది సిబ్బంది తాత్కాలిక ప్రాతిపదికన రూ. 5 వేల నుంచి రూ.8 వేల లోపు వేతనాన్ని పొందుతున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించి మెరుగైన వేతనాలు ఇవ్వాలని మొత్తుకుంటున్నా వీరి గోడు తితిదే పట్టించుకోవడం లేదు. దేవదాయశాఖ పరిధిలో ఇదే సర్వీసు ఉన్న ఉద్యోగులకు రూ.20 వేలకు పైబడి జీతం వస్తుండటం గమనార్హం.
– ఈనాడు దినపత్రిక