పులివెందుల పులిబిడ్డ!
కడప జిల్లా ముద్దుబిడ్డ!!
రాయలసీమ రత్నం!
ఆంధ్రుల ఆరాధ్య దైవం!!
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. జనహృదయ నేత వై.ఎస్.ఆర్ మరణంతో రాయలసీమ దుఃఖ సముద్రంలో మునిగిపొయింది. కడప జిల్లా కన్నీటి సాగరమే అయ్యింది. రాష్ట్రంలోని రైతులోకం గుండె ఆగిపొయింది. బడుగు బలహీన, మైనారిటీ , గిరిజన ప్రజానీకం ఈ దుర్వార్త తో నిలువెళ్ళా బండబారిపోయింది. ఒకపక్క రాష్త్ర సంక్షేమం కోసం పరితపిస్తూనే ప్రతీ క్షణం రాయలసీమ ప్రజల క్షేమాన్ని కాంక్షించారు, వై.ఎస్.రాజ శేఖర రెడ్డి. ఎక్కడో దూరంగా విసిరి వేయబడ్డట్టు అభివృద్ది కి నోచుకోకుండా అనామకంగా పడివుండిన కడప జిల్లా కు దేశపటంలో ఒక గుర్తింపును కలిగించారు. ఎందరు నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని పత్రికలు ఏం రాసినా లెక్కచేయకుండా కడప జిల్లాకు ప్రాజెక్టులనూ, పరిశ్రమలనూ తెచ్చారు. కడపను ఒక నగరంగా తీర్చిదిద్దారు.
రైతు బాంధవుడిగా రైతులోకంలో చెరగని ముద్ర వేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా వ్యవసాయదారులకు చేయూతను ఇచ్చారు. అపర భగీరధుడిగా అవతరించి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. కరువు పీడిత రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 45 వేల క్యూసెక్కుల నీటిని మళ్ళించేందుకు కంకణబద్దుడై పని పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు , రేషన్ కార్డులూ అడిగినన్ని పేదలందరికీ మంజూరు చేసారు. రాయలసీమలోనే కాదు, తెలంగాణా, ఉత్తరాంధ్ర, కొస్తా అన్నిప్రాంతాల్లోనూ అశేష ప్రజల అభిమానాన్ని చూరగొని వారి హృదయాల్లో నిలిచిన మహా నాయకుడు అందర్నీ దుఃఖసాగరంలో ముంచి మహాప్రస్థానం చేశారు. పసిపిల్లలకు గుండె చికిత్సలను చేయించారు. కులాలకూ మతాలకూ అతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించి మానవతను చాటారు. ఒకటీ రెండూ కాదూ ప్రజల అభివృద్దికి వందలాది పథకాలను అమలుచేసిన మడమ తిప్పని యోధుడు, వై.ఎస్.రాజ శేఖర రెడ్డి. కడప జిల్లాలో పుట్టడం తన అదృష్టంగా, గర్వంగా ప్రకటించుకున్న కడప ముద్దుబిడ్డ,
మళ్లీ మరొక్కసారి కడప జిల్లాలో జన్మించు…మహానేతా!
కడప జిల్ల్లా ప్రజల తరపున ఆ మహా ప్రజా నేతకు కడప డాట్ ఇన్ ఫో .(www.kadapa.info) అశృ నివాళి అర్పిస్తోంది.