Tourist Attractions
శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర యోగీంద్రులు స్వయంగా శిల్పించి, ప్రతిష్టించిన శ్రీ వీరభద్ర స్వామి అల్లాడుపల్లె క్షేత్రంలో వెలిసి, భక్తులకు కొంగుబంగారంగా నిలిచారు. రాయలసీమతో పాటు కర్నాటక ప్రాంతం నుండీ కూడా భక్తులు తరలి వచ్చి పవిత్ర కుందూనది ఒడ్డున వెలసిన శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. శైవ క్షేత్రమైన అల్లాడుపల్లె మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ...

వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్టించిన అల్లాడుపల్లె వీరభద్ర స్వామి

(- తవ్వా ఓబుల్‌రెడ్డి )

శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర యోగీంద్రులు స్వయంగా శిల్పించి, ప్రతిష్టించిన శ్రీ వీరభద్ర స్వామి అల్లాడుపల్లె క్షేత్రంలో వెలిసి, భక్తులకు కొంగుబంగారంగా నిలిచారు. రాయలసీమతో పాటు కర్నాటక ప్రాంతం నుండీ కూడా భక్తులు తరలి వచ్చి పవిత్ర కుందూనది ఒడ్డున వెలసిన శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. దైవక్షేత్రాలను , స్వయంభువులు, తపోనిధి మహర్షి ప్రతిష్టితాలు, సాధారణ వేదవిధులైన రుత్విక్కులచే ప్రతిష్టితాలు అని మూడు విధాలుగా విభజించారు. వీటిలో మొదటి రెండు విధాల క్షేత్రాలు మహిమాన్వితాలనీ, దివ్యశక్తి సంపన్నములనీ, భక్తజన శుభాభీష్ట ప్రదములనీ చెప్తారు. శైవ క్షేత్రమైన అల్లాడుపల్లె అలాంటి మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె వద్ద మైదుకూరు- ప్రొద్దుటూరు రహదారిపై మైదుకూరుకు 6 కి.మీ, ప్రొద్దుటూరికి 14 కి.మీ. దూరంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం వెలిసింది. అల్లాడుపల్లె సమీపంలోని కుందూ నదికి వచ్చే వరదల కారణంగా అగ్రామ ప్రజలు ఎప్పుడూ కష్టాలతో అల్లాడుతూ ఉండినందున అగ్రామానికి ” అల్లాడుపల్లె ” అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు. ఆలు అంటే ఆవులు, పశువులు అనీ, ఆడుట అంటే తిరుగుట అనీ అర్థం. ఈ ప్రాంతపు బయళ్లలో మేతకోసం ఆవులూ, పశువులూ తిరుగుతూ ఉండినందున ఈ పల్లె ” ఆలాడుపల్లె ” గా ప్రసిద్ధమైందనీ, క్రమక్రమంగా అదే ” అల్లాడుపల్లె ” గా మారిందనీ కూడా చెప్తారు.

స్వామివారి ఆవిర్భావం

కాలజ్ఞానకర్త, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి క్రీ. శ . 1608- క్రీ. శ 1698 మధ్య కాలంలో రాయలసీమలో తత్వవేత్తగా వెలుగొందారు. ప్రభోధాలతో, సంస్కరణోద్యమంతో సంచారం చేశారు. శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి తన 12 వ ఏటనే దేశసంచారానికి బయలుదేరి కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మగారింట్లో పశులకాపరిగా చేరారు.

శ్రీవీరభద్ర, శ్రీ భద్రకాళీ అమ్మవారి అర్ధనారీశ్వర , కేదారేశ్వరుల గర్భగుడులపై గోపురాలు

తాను గీసిన గిరిలో పశువులు మేస్తుండగా , బ్రహ్మంగారు శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని మలిచారు. తన మనసులో ఆ వీరభద్రున్నే గురువుగా తలచుకొన్నారు. జ్ఞానిగా మారి గుహలో కూర్చుని కాలజ్ఞాన రచన చేశారు. బనగానపల్లె మజిలీ ముగిశాక, శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి తన దేశసంచారాన్ని కొనసాగించారు. కొన్నేళ్ల తర్వాత అతివృష్టి కారణంగా వరదలు వచ్చాయి. ఈ వరదలకు కుందూ లో ప్రవేశించిన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం అల్లాడుపల్లె సమీపంలోని మడుగులోకి చేరింది. ఆ మడుగు సమీపంలో కేతవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పిల్లలు తమ పశువులను కుందూనది ఒడ్డున మేపుకుంటూ , నదిలో ఈత ఆడేవారు. అక్కడి మడుగులోకి చేరిన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం బాలునిగా మారి ఆ పిల్లల ఆటల్లో కలిసి పోయేవారు. ఆ పిల్లలు తెచ్చుకున్న సద్ది మూటలను భుజించేవారు. ఆటలలో తానే పైచేయి అవుతూ, ఆ పిల్లలను కొట్టడం, బెదిరించడం చేసి, నదిలో దూకి అదృశ్యం అయ్యేవారు. దీంతో గ్రామ పిల్లలు ” నల్లోడొచ్చె” ,” కొట్టె ” అంటూ నిద్రలో కలవరించేవారు. ఈ కారణంగా నదిలో రోజూ జరుగుతున్న వ్యవహారం గ్రామస్తుల దృష్టికి వెళ్లింది. దీంతో గ్రామస్తులు నది వద్దకెళ్లి కాపు కాసి స్వామి బాలుని అవతారంలో ప్రత్యక్షంకాగానే చుట్టుముట్టి పట్టుకుని ఒడ్డుకు తీసుకువస్తారు. తాను వీరభద్రస్వామిననీ, తనను ప్రతిష్టించి పూజించాలనీ, తాను నదినుండి ఫలానా దినాన వెలువడుతాననీ, చెప్పి నదిలో దూకి స్వామి అదృశ్యమౌతారు.సమయంలోనే నదిలోననుండి బుగ్గలు రావడాన్ని వారు గమనిస్తారు.

Read :  నేడు అన్నమయ్య 507 వ వర్దంతి.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

స్వామి చెప్పిన రోజున కేతవరం గ్రామాధికారి కోడలు, కొడుకులైన పోతెమ్మ, పోతిరెడ్డి గ్రామస్తులతో కలిసి మేళతాళాలతో, మంగళవాద్యాలతో , పూజాసామగ్రితో కుందూనది ఒడ్డుకు చేరుకుని స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిర్ణీత సమయం మించిపోతున్నా ,స్వామి ప్రత్యక్షం కాకపోవడంతో పోతిరెడ్డి దంపతులు నిరాశకు గురౌతారు. కలతతో నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే నదిలోనుండి బుగ్గలు రావడాన్ని వారు గమనిస్తారు. ఆ నీటి బుగ్గల వెంట విగ్రహ రూపంలో తేలిన స్వామి ఒడ్డుకు వచ్చి నిలబడ్తారు. ప్రజలు ఆనందోత్సాహాలతో జయజయ ద్వానాలు పలికారు. స్వామికి పూజలు జరిపారు. తరువాత స్వామి విగ్రహాన్ని ఒక బండిపైకి ఎక్కించి ఊరేగింపుగా ముందుకు కదిలారు. ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటికి బండి చేరుకోగానే బరువెక్కి కదలకుండా నిలిచిపోయింది. ప్రజలు ఎన్ని శక్తి యుక్తులు ప్రదర్శించినా, బండి అంగుళం కూడా ముందుకు కదలదు. దీంతో చేసేదేమీలేక స్రజలు స్వామి వారిని అక్కడనే ఉంచి భోజనముల కోసమని కేతవరం గ్రామానికి వెళ్లిపోగా, వారి వెంట వచ్చిన వడ్రంగి పిచ్చివీరయ్య వీరభద్రస్వామి విగ్రహం దగ్గరే ఉండి పోయాడు. ఆ పిచ్చివీరయ్య ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి.. మానసిక భగవదాదేశం వల్ల శుభముహూర్తమును గుర్తించిన వీరబ్రహ్మంగారు సమాధి నిష్టతో ” ఓం నమోభగవతే వీరభద్రాయ ” అనే మూలమంత్రాన్ని జపించగానే, ఆ మంత్రోచ్ఛారణతో శ్రీ వీరభద్రస్వామి తానే స్వయంగా ఉత్తరాభిముఖుడై ప్రతిష్టితులయ్యారు. భోజనాలు చేసి తిరిగి వచ్చిన గ్రామప్రజలు శ్రీవీరభద్రస్వామి ప్రతిష్టితులై ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఆ శుభ సమయంలో తాము లేనందుకు తీవ్ర విచారాన్నీ వ్యక్తం చేశారు. తాము పిచ్చివాడుగా భావించే వీరయ్యే , వీరబ్రహ్మేంద్రస్వామిగా తెలుసుకున్నారు.

శ్రీ కేదారేశ్వర స్వామి

వీరబ్రహ్మంగారు తన గురువైన వీర భద్రస్వామికి పూజలు జరిపిన అనంతరం కందిమల్లాయపల్లెకు వెళ్తూ , శ్రీ వీరభద్రస్వామికి ఆలయాన్ని కోడికూత రోకటిపోటు వినబడని గడువులో నిర్మించాలని, ఇది స్వామి ఆదేశమనీ సూచించారు. కోడి కూత రోకటిపోటు ఆగినప్పటినుండి తిరిగి అవి వినపడే సమయాన్ని ఒక రోజుగా పరిగణలోనికి తీసుకున్న గ్రామస్తులు ఒక్క రోజులోనే స్వామివారికి గర్భగుడిని నిర్మించారు. స్వామివారి విగ్రహం ఆప్పటినుండి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండడంతో, స్వామివారి తలపై రాగి చెంబును బోర్లించి తీయడంతో విగ్రహవృద్ధి నిలిచిపోయిందనీ చెబుతారు.

స్వామి దివ్యమూర్తి-ప్రశస్తి

శ్రీవీరభద్రస్వామివారి దివ్యమూర్తి జీవకళ ఉట్టిపడే ఆరు అడుగుల నిండైన గంభీర విగ్రహం. స్వామివారి మూర్తి నల్లరాతి శిల్పము. రౌద్రమూర్తి కిరీటము, తలపై శివలింగం, నొసటమూడుపట్టెలు, త్రినేత్రాలు, శిరముపై కలశముఉరమున హారాదిభూషణాలు, యజ్ఞోపవీతము, లింగకాయ, సుదీర్ఘమైన కపాలమాల, కుండల కంకణాద్యాభారణాలు, కుడిచేతిలో ఎత్తిన ఖడ్గం, ఎడమచేతి అరచేతికింద ఆనించినట్లున్న వీర ఫలకాయుధం, నాభిస్థానానికి కాస్త కింద భద్రకాళి ముఖాకృతి, నడుమున ఒరలో పిడిబాకులు, కాళ్లకు మంజీరాలతోస్వామివారి విగ్రహము రౌద్రముగ ఉంటుంది. శిరముపై కలశమున్నట్టు విగ్రహములోనే మలచబడి ఉంది. స్వామివారు మకరతోరణంలో ఉత్తరాభిముఖుడై ఉన్నారు. స్వామివారి కుడిపాదం వద్ద దక్షుని చిన్న విగ్రహం ఉంది. వాహన స్థానీయుడైన నందీశ్వరుడు, స్వామివారికి ఎదురుగా ముఖమండపం మధ్యన స్వామివారి ఆజ్ఞకు ఎదురు చూస్తున్నట్లుగా ఉంటాడు. స్వామి వారి శిల్పమూర్తికి యథార్థ ప్రతిరూపాలైన రాగి, వెండి తొడుగులు ఉన్నాయి. ప్రతి రోజు ఆ తొడుగులను స్వామివారికిి అలంకరిస్తారు. స్వామి వారి మూడవ నేత్రం స్వర్ణమయం.

Read :  కడప ప్రాంత శాసనాలలో రాయలనాటి చరిత్ర!

స్వామి వారి పూజోత్సవాలు

బ్రహ్మంగారు ప్రతిష్టించిన నాటినుండీ ఇప్పటిదాకా 400 సంవత్సరాలుగా శ్రీవీరభద్రస్వామికి పూజా, పురస్కారోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మాన్యపు భూములు కూడా ఉన్నాయి. శ్రీ వీరభద్రస్వామి రుద్రాంశమున జన్మించిన వారు. అందువలన ఈ స్వామి పూజా విషయంలో రుద్రునికి వలే సోమవారాలు ప్రశస్తమైనవిగా భావిస్తారు. కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామిని సేవిస్తారు. మహాశివరాత్రి తిరుణాలకు రైతులు అధిక సంఖ్యలో ఎద్దుల బండ్లలో , ట్రాక్టర్లలో తరలి వస్తారు. వీరు శనగ, అలసంద గుగ్గుళ్లనూ, పానకాన్నీ తిరుణాలలో పంచిపెడతారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పౌరాణిక నాటక ప్రదర్శన , చెక్కభజన , హరికధాకాలక్షేపాలు ఉంటాయి. సంక్రాంతి సమయంలో కనుమ పండుగ రోజున, స్వామివారు గ్రామములలో పారువేటకు వెడతారు. తొలుత అల్లాడుపల్లె, తరువాత పాటిమీద పల్లె, భద్రిపల్లె, పుల్లయ్యసత్రం, విశ్వనాధపురం, లక్ష్మీపేట, వీరభద్రాపురం, గ్రామాలలో పారువేట జరుగుతుంది.మహాశివరాత్రికి స్వామివారి తిరుణాల రెండురోజులు జరుగుతుంది. శివరాత్రినాడు స్వామివారికి రుద్రాభిషేకము, క్షీరాభిషేకము, చేసి అష్టోత్తర శతనామ పూజ నిర్వహిస్తారు. శ్రీస్వామివారు ఆస్థాన మండపంలో కొలువై రాత్రి 2 గంటల తర్వాత ఊరేగింపునకు బయలుదేరుతారు. శివరాత్రి నాడు పార్వతీ కళ్యాణం కూడా జరుగుతుంది. మరుసటి రోజు ఎద్దులకు గొప్పగా బండలాగుడు పోటీలు జరుగుతాయి. శ్రీవీరబ్రహ్మంగారు తానే శ్రీ వీరభద్రస్వామి శిల్పాకృతిని మలిచి, ఆ స్వామినే గురువుగా భావించి, అల్లాడుపల్లెలో ప్రతిష్టించి, పూజించి , సేవించినందువల్ల బ్రహ్మంగారి మఠాధిపతులకు ఇది గురు పీఠమైంది.. ఈనాటికీ బ్రహ్మంగారి మఠంలో జరిగే ప్రతి పూజోత్సవ కార్యక్రమానికీ ముందు అల్లాడుపల్లెలోని శ్రీవీర భద్రస్వామికి పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు

ఈ ఆలయంలో శుక్రవారం నుంచి రెండు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. జిల్లా నుంచే గాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఉత్సవాలకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇటీవల రూ.73 లక్షలతో ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. 12వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12న జాగారం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు, జానపద గీతాలాపన, స్కూల్‌ పిల్లల నృత్య ప్రదర్శనలు, 13వ తేదీ ప్రత్యేక పూజలతో పాటు ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు.

గెలుపొందిన ఎడ్లకు రూ.12,016, రూ.10,016, రూ.5016లు అందజేస్తారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా 108, ప్రత్యేక వైద్య సిబ్బంది, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా ఆలయానికి చెందిన నాలుగు సత్రాలున్నాయి. అల్లాడుపల్లెకు వెళ్లే దారిలో ఉన్న సత్రం కూలడానికి సిద్ధంగా ఉంది. దీని గురించి నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. శివరాత్రి రోజు భక్తులు ఈ సత్రంలోనూ గడుపుతారు. సత్రానికి మరమ్మతులు చేయాల్సి ఉంది.

శ్రీవీరభద్రస్వామి మహిమలు

శ్రీ వీరభద్రస్వామి భక్తులకు అభీష్ట ఫలాలను సిద్దింపజేసే కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. శ్రీ స్వామి వారి పవిత్రనామాన్ని ఏకాగ్రతతో జపిస్తే సకల పాపాలు పటాపంచలవుతాయని, అజ్ఞానాంధకారం నశిస్తుందనీ, శుభ సంపదలు, ఆయురారోగ్యాలూ కలుగుతాయనీ, సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయనీ, నిఖిల పురుషార్థాలు ప్రాప్తిస్తాయనీ, సంతానం లేని స్త్రీలు చేతులలో కొబ్బరికాయలతో స్వామివారి ఎదుట సాష్టాంగ దండ ప్రమాణంగా , నేలపై సాగిలపడి వరపడితే సంతానం కలుగుతుందనీ భక్తుల నమ్మకం. ఆ విధంగా సంతానం పొందిన వారితో పాటు ఈ ప్రాంతంలో చాలా మంది తమ పేరులో ” వీర ” శబ్దమును చేర్చుకుంటారు. శ్రీస్వామివారు రౌద్రమూర్తి కావటం వల్ల, శ్రీ స్వామి వారి నాభి స్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని ఉండటం వల్ల గర్భవతులైన స్త్రీలు శ్రీ స్వామివారిని దర్శించకూడదనే నియమం ఇక్కడ ఉంది.

Read :  Jammalamadugu to Mydukur Bus Timings & Schedule

అల్లాడుపల్లె సమీపంలోని భద్రిపల్లెకు చెందిన చాగంరెడ్డి మునెమ్మ , పెద్ద గంగిరెడ్డి దంపతులు తమకు 45 సంవత్సరముల వయస్సు వరకు సంతానం లేక బాధపడుతూ , శ్రీస్వామి వారిని దర్శించి , ఒక మండలం దినాలు భక్తితో నిష్టగా సేవించి సంతానం కోసం వర పడ్డారట. శ్రీ స్వామి వారి అనుగ్రహమున కొన్నాళ్లకు వారికి ” వీరారెడ్డి ” అను పుత్రుడు జన్మించాడు. వీరారెడ్డి పుట్టుకతోనే ఇహలోక వాసనాదూరుడై ,” అవధూత దిగంబర వీరయ్య ” గా పిలువ బడుతూ పల్లెల్లో సంచారం చేసేవాడు. 1978లో సిద్ది పొందిన వీరయ్య ఆరాధన ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. అవధూత వీరయ్య శ్రీ వీరభద్రస్వామి వారి అంశమనీ , ఆయన సమాధి దివ్యమందిరాన్ని దర్శించిన వారికి ఆర్తి నివృత్తి కలుగుతుందని చెబుతారు. శ్రీ స్వామివారు కుందూ నది నుండి బయలు వెడలేందుకు సారధ్యం వహించిన శ్రీమతి పోతెమ్మ , శ్రీపోతిరెడ్డి దంపతులు స్వామి వారి పాద పద్మాల్లో లీనమై , సాయుజ్యం పొందారని భక్తుల విశ్వాసం.

శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వివిధ దశలలో వృద్ధి చెందింది. దేవాలయ ప్రాంగణంలో నాలుగు
దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది , శ్రీ వీరభద్రస్వామి,శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాలు, స్వామివారికి ఎడమవైపున శ్రీ అర్ధనారీశ్వరుడు లింగమూర్తియై పార్వతీ దేవితో ఉత్తరాభిముఖుడై వెలసియున్నారు. ఈ లింగానికి అభిషేకం చేసినప్పుడు లింగం రెండుగా విభక్తమైనట్లుగా స్ఫష్టమైన చార కనిపిస్తుంది. అర్థనారీశ్వర మందిరానికి కాస్త పడమరగా శ్రీ భద్రకాళీ అమ్మవారి నూతన గుడి ఉంది. అమ్మవారిని భక్తులు ప్రత్యేక శ్రద్దతో పూజిస్తారు. ఆర్ధనారీశ్వరుడికి ముందువైపు కాస్త ప్రక్కగా శ్రీ కేదాశ్వరుడు లింగమూర్తియై పూర్వాభిముఖుడై ఉన్నాడు.కార్తీకపున్నమి రోజున తొలిసూర్యకిరణాలు ఈ స్వామి వారిపై పడటం ఒక గొప్పవిశేషం. కేదారేశ్వరుడి ద్వారం బయట కుడివైపున గణపతి , ఎడమవైపున పార్వతీదేవి ఇటీవల ప్రతిష్టమై ఉన్నారు. రెండు శివాలయాల్లోనూ నందీశ్వరులున్నారు. శ్రీవీరభద్ర , శ్రీ భద్రకాళీ,అర్ధనారీశ్వర , కేదారేశ్వరులకు గర్భగుడులపై గోపురాలు ఉన్నాయి. దేవాలయంలో ఈశాన్య దిశలో నవగ్రహ విగ్రహములు ఉన్నాయి. ఆ గుడిపై కూడా చిన్న గోపురం ఉంది. వాయువ్య దిశలో బావి ఉంది. స్వామి వారి దేవాలయానికి బయట స్వామికి ఎదురుగా ద్వజ స్ధంభం ,దాని వెనుక నందీశ్వరుడి గుడి , దేవాలయం ముఖద్వారంపై గాలి గోపురం ఉన్నాయి. దేవాలయం బయట ఈశాన్య దిశలో కోనేరు, వాయువ్య దిశన ఆస్థాన మండపం ఉన్నాయి. శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి మహాశివరాత్రి సందర్భంగా ఈ మండపంలో కొలువు తీరుతారు.

యాత్రీకులకు సౌకర్యాలు

రాష్ట్ర ప్రభుత్వదేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ దేవస్థానంలో వివాహం, కేశఖండనం లాంటి శుభకార్యాలు విరివిగా జరుగుతాయి. ఇక్కడ ఆర్య,వైశ్య అన్నసత్రం, శ్రీ వాసవి కళ్యాణ మండపం ఉన్నాయి. ఈ దేవస్థానం, మైదుకూరు- ప్రొద్దుటూరు ప్రధాన రహదారిపై ఉన్నందున ప్రతి 5-10 నిముషాలకు బస్సు సౌకర్యము ఉంది.

Check Also

Mydukur to Kamalapuram Bus Timings & Schedule

Mydukur to Kamalapuram Bus Timings & Schedule

Find APSRTC bus timings from Mydukur to Kamalapuram. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Mydukur and Kamalapuram.

Tirupati to Mydukur Bus Timings & Schedule

Tirupati to Mydukur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Tirupati to Mydukur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Tirupati and Mydukur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *