Tourist Attractions
పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.

కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే…

పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.

మొత్తం 276.70 లక్షల హెక్టార్ల వైశాల్యం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ వైశాల్యం 75.30 లక్షల హెక్టార్లు. అంటే సుమారు 30 శాతం విస్తీర్ణం. జనాభా మాత్రం 20 శాతం కన్నా తక్కువే (19.5 శాతం). జన సాంద్రత 117 మంది మాత్రమే. కరువులు, పేదరికం, వలసలు కలగలపి ఇక్కడ జనులు నివసించే పరిస్థి తులు లేనందువలన ఇంత తక్కువ జనసాంద్రత ఈ సీమలో ఉన్నది. ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.

మద్రాసు ప్రెసిడెన్సీలో సీమ

1947 నాటికి కేవలం 1.4 శాతం భూమికి మాత్రమే నికర నీటి పారుదల కల్పన జరిగింది. బ్రిటిష్‌ వలస పాలకులు ప్రెసిడెన్సీ పెట్టుబడులలో 6.1 శాతం నీటిపారుదలపై ఖర్చు చేశారు. కర్నూలు జిల్లాలోని కంభం ప్రాజెక్ట్‌ ఒక్కటి మాత్రమే రాయలసీమ జిల్లాలలో అప్పుడు నిర్మించారు. చిత్తూరు జిల్లాలో 1911లో (మునుపు నార్త్‌ ఆర్కాట్‌ జిల్లా) నిర్మించిన రెండు ప్రాజెక్టులతో కలిపితే మొత్తం సీమలో 1.4 శాతం సాగుభూమి. అనగా 1947 వరకు రాయలసీమ మొత్తానికి 3 ప్రాజెక్టుల కింద సాగు భూమి 1.4 శాతం మాత్రమే. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో 1947లో రాయలసీమ పరిస్థితి. అందుకే సీమలో వరుసగా కరువులు: 1832, 1837, 1854, 1860-61, 1868, 1870-76, 1883-84, 1889, 1894-96, 1899, 1901, 1905, 1907-08, 1911-13, 1917(డొక్కల కరువు), 1923-24, 1946-51 (గంజి కరువు).

మిగిలిన సాగుకు అంతా చెరువులు, బావులే గతి. ఇంక 1915-1945 మధ్యకాలంలో కోస్తా రాయలసీమ రైతాంగానికి నికర నీటి పారుదల 45:13 నిష్పత్తిలో ఉండేది. అదీ రాయలసీమ చెరువులు, బావుల కింద సాగే. ఇవి మరమ్మతులకు నోచుకోకపోవడంవల్లే కరువులకు నిలయమైందని ప్రతి ఫ్యామిన్‌ కమిషన్‌ తమ నివేదికలలో (1878, 1888, 1892, 1898, 1901) స్పష్టం చేసింది. ఈ కమిషన్లు భారీ ప్రాజెక్టుల ఆవశ్యకతను నొక్కి వక్కాణించాయి.

Read :  కడప బరిలో కాంగ్రెస్ కుదేలు

నీటి పారుదల వనరుల స్థితిగతులు

అయితే వలస పాలకులు వ్యాపార పెట్టుబడి దారులు కావడంవలన నీటి పారుదల ప్రాజెక్ట్‌లను లాభాల రీత్యా రెండుగా విభజించారు. మొదటిది ప్రొడక్టివ్‌ వర్క్స్‌ అనగా లాభాలు వచ్చేవి. వీటిపై ఏటా కనీసం 4 శాతం లాభాలు రావాలి. రెండవది ప్రొటెక్టివ్‌ వర్క్స్‌ అనగా కరువు కాటకాల నుండి రక్షించేవి. మొదటి రకం భారీ ప్రాజెక్టులకు సంబంధించినవైతే, రెండోది చెరువుల మరమ్మతులు, రోడ్లు వేయడం, బావుల తవ్వకం మొదలైనవి. రాయలసీమ భారీ ప్రాజెక్టులకు ఎప్పుడూ నోచుకోలేదు. మద్రాసు ప్రెసిడెన్సీలో 1944 మార్చి, 31 వరకూ ప్రొడక్టివ్‌ వర్క్స్‌ మొత్తం 21 కాగా, అందులో సీమలో 3 మాత్రమే. పెట్టుబడి మొత్తం రూ. 15,37,45,818లు కాగా అందులో రూ. 9,30,290 లు సీమ ప్రాజెక్టులు మూడింటిపై ఖర్చు చేయగా, సాగైన విస్తీర్ణం 52,953 ఎకరాలు. అనగా 1.4 శాతం మాత్రమే.

ప్రొటెక్టివ్‌ వర్క్స్‌ కింద సీమలో 1,39,642 ఎకరాల సాగుకుగాను ఖర్చు రూ. 2,53,43,566 లు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మొత్తం సాగుభూమి 3,89,264 ఎకరాలు కాగా, ఖర్చు రూ. 41,857,550లు. అందులో సీమలో సాగు భూమి శాతం 35.8, ఖర్చు శాతం 60.54. అయితే నికర సాగుభూమి సీమలో 1920-46 మధ్య కేవలం సగటున 13 శాతానికి మించలేదు. కోస్తా ఆంధ్రలో అదే కాలంలో నికరసాగు 40 శాతానికి మించింది. మొత్తం మీద కరువు కాటకాల నుండి ప్రొటెక్టివ్‌ వర్క్స్‌ కింద సాగుభూమి 1900 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో 10.4 శాతం, బళ్లారిలో 2 శాతం, అనంతపురంలో 2.9 శాతం, కడపలో 8.2 శాతం, నార్త్‌ఆర్కాట్‌లో 5.9 శాతం మాత్రమే. మిగిలిన ప్రాంతమంతా కరువులమయమే.

1871 నుండి 1911 వరకూ సీమలో సాగుభూమిగానీ, జనాభాగానీ పెరగలేదు సరికదా, 1911లో సాగు విస్తీర్ణం, జనాభా 1871 కన్నా తక్కువని మరువరాదు. 1898 ఫ్యామిన్‌ కమిషన్‌ ప్రకారం వలస పాలకుల ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ను ఒక కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌ అని, లాభాలు వస్తే తప్ప ఇరిగేషన్‌ పనులు చేపట్టడంలేదని, వెంటనే ఫ్యామిన్‌ రక్షణ పనులకు నిధులు ఎక్కువగా కేటాయించి, చెరువులు, బావులు మొదలైన వాటి మరమ్మతులు చేయాలని సిఫార్సు చేసింది. అయినా వలస పాలకులు పట్టించు కున్న పాపాన పోలేదు. రాయలసీమ మాత్రం మానవ కళేబరాల సీమగా మారిపోయింది.

కరువు లెక్కలు

1876లో వచ్చిన కరువుతో ఎంతమంది చనిపోయారో ఇంతవరకు లెక్కలు తేలలేదు. సుమారు 40 శాతం జనాభా చనిపోయారని అంచనా. దీంతో పరాయి కసాయి గుండె కరిగింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌, సర్‌ మెకంజి లాంటి బ్రిటిష్‌ ఇంజనీర్లు సీమకు నీటిపారుదల వసతి కల్పించే అవకాశాల మీద పరిశోధన చేశారు. 1890లో కేసీ కెనాల్‌ నిర్మాణం జరిగింది. ఇది సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పుణ్యమే. సర్‌ మెకంజీ పథకం అమలు జరిగివుంటే కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల సంగమంతో మొత్తం 36 లక్షల ఎకరాలకు సీమలో నీరు అంది ఉండేది. కానీ ఈ పథకం అమలు కాలేదు.

Read :  BOMMIREDDY NARASIMHA REDDY - A DOYEN OF TELUGU FILM

అందుకే కరువులు వరుసగా 1875-76, 1896, 1900, 1907, 1908, 1909, 1923-24, 1946-51 సంవత్సరాలలో సీమను చుట్టుముట్టాయి. ఫలితంగా గ్రేటర్‌ బళ్లారి, కడప, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ భూమి 1874-75లో 82,50,000 ఎకరాలు కాగా 1894- 95లో 82,43,000 ఎకరాలే. 1906-07 నాటికి కేవలం 87,60,000 ఎకరాలకు పెరిగింది. అంటే, 5 లక్షల ఎకరాలు మాత్రమే పెరిగింది. సుమారు నాలుగు దశాబ్దాల కాలంలో ఈ పెరుగుదల పెద్దగా లెక్కలోకిరాదు. ఎంత దుర్భర జీవన పరిస్థితులు సీమలో ఉండేవో బ్రిటిష్‌ గణాంకాలు తెలియచేస్తున్నాయి. తరువాత ప్రపంచ యుద్ధాలతో సతమతమైన వలస పాలకులు ఎవరి గురించీ పట్టించుకోలేదు.

స్వాంతంత్య్రానంతరం…

ఇప్పటికీ రాష్ట్రంలో మూడోవంతు దుర్బిక్ష ప్రాంతం సీమలోనే ఉంది. దేశంలో గుర్తించిన 99 కరువు జిల్లాలకుగాను, మొత్తం 4 రాయలసీమ జిల్లాలు ఉన్నాయన్నది గమనార్హం. ఎడారిగా మారి పోతున్న అనంతపురం జిల్లా సాగునీటికి సంబంధిం చిన అన్ని హామీలు నీటిమీద రాతలుగానే మిగిలి పోయాయి. 1951 నుంచి 2004 వరకూ 53 ఏళ్లలో 24 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు కల్పించగా సీమకు దక్కింది ఎంత? 2,746 టీఎంసీల నదీ జలాలు రాష్ట్రంలో లభ్యమవుతుంటే, సీమకు జనాభా ప్రాతిపదికనైతే 549 టీఎంసీలు; పంట భూముల విస్తీర్ణం ఆధారంగానైతే 723 టీఎంసీలు ఇవ్వాలి, రావాలి. కానీ ఇచ్చింది కేవలం 122.6 టీఎంసీలే.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందే రాయలసీమ కోసం రూపొందించిన కృష్ణా-పెన్నార్‌ ప్రాజెక్టును అడ్డు కుని నాగార్జునసాగర్‌ను నిర్మించి సీమకు చుక్కనీరు కూడా రాకుండా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్‌ ప్రాజెక్టుగా మార్చారు. భారీ ప్రాజెక్టుల గతి ఇలా ఉండగా, చెరువుల పరిస్థితి మరీఘోరం. 1960లలో సీమలో 50 శాతం సాగు చెరువుల కింద ఉండగా, నేడు 8 శాతం కూడా లేదు. 1955-56 నాటికి చెరువుల కింద సాగు 1.70 లక్షల హెక్టార్లు కాగా 2000 నాటికి 0.44 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. ఇంక రైతుకు బోరుబావులే గతయ్యాయి. 1970-80 దశకంలో బక్కరైతులు బోర్లు వేసి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకొన్న సందర్భాలు సీమలోనే అధికం. అయినప్పటికీ బావుల కింద విస్తీర్ణం 1955లో ఒక లక్ష హెక్టార్లు మాత్రమే. అది 2000 సంవత్సరం నాటికి 4.31 లక్షల హెక్టార్లకు పెరిగింది. స్వాతంత్య్రా నంతరం కోస్తాంధ్రలో దాదాపు 80 శాతం కాలువల కింద సాగవుతుండగా, మిగతా ప్రాంతాలలో ఈ సాగులో ఎట్లాంటి పెరుగుదల లేదు.

Read :  Puttur(u) to Kadapa Bus Timings & Schedule

ఉదాహరణకు 1955లో కాలువల కింద కోస్తాలో సాగు 84 శాతం, సీమలో 7 శాతం, తెలంగాణలో 9 శాతం. 2008లో ఈ శాతాలు వరుసగా 78, 8, 14గా ఉన్నాయి. అంటే, గత 50 సంవత్సరాలలో సీమ, తెలంగాణ ప్రాంతాలలో కాలువల కింద సాగు భూమి అదనంగా పెరగలేదు. అదేకాలంలో చెరువుల కింద సాగు 39 శాతం నుంచి 62 శాతం కోస్తాలో పెరగగా, సీమలో 16 నుంచి 10 శాతానికి తగ్గింది. ఇలా సీమ రైతు సహజంగా లభించే చెరువు నీరుపోయి బావుల మీద ఆధారపడి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది.

జలయజ్ఞం

సీమలో జలయజ్ఞం పూర్తి అయిన తర్వాత కూడా 63.4 శాతం భూమికి నీరు అందదన్నది గమనార్హం. అదే కోస్తాలో 16.3, తెలంగాణలో 40.9 శాతం భూమికి మాత్రమే నీరందదు. జలయజ్ఞం ద్వారా రాయలసీమలో 19,22,344 ఎకరాలకు అదనంగా, అంటే సుమారు 20 శాతం భూమికి నీటి వసతి లభిస్తుందని అంచనా. ప్రస్తుత సాగుభూమి సీమలో 17 శాతం కాగా, కోస్తాలో 61 శాతం, తెలంగాణలో 27 శాతం. జలయజ్ఞం ఒక అద్భుత ప్రయత్నం. వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సీమవాసుల కోసం జనప్రియనేత వైఎస్‌ చేపట్టిన మహా సంకల్పం జలయజ్ఞం. దీనిద్వారా రాష్ట్రంలో జలవనరుల వినియోగంలో ‘సమత్యులత’ సాధించాల్సి ఉంది.

రాయలసీమ జలపీడిత రాజకీయసీమ కాకూడదు. స్వార్థరాజకీయాలతో సీమ కరువుల వాతపడకూడదు. కరువుబండ యాత్రల సంస్కృతితో సంతోషపడి సరిపెట్టుకోకూ డదు. సీమవాసుల చింతన ఇకనైనా మారాలి. భావితరాలు కరువు బండరాళ్లు, రోళ్లు, రోకళ్లు ఊరేగింపుగా మోసుకుపోయి పొలిమేర యాత్రలు చేయకూడదు.

– డా॥ ఎనుగొండ నాగరాజనాయుడు,

(ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,రాపూరు, నెల్లూరు జిల్లా)

–      సాక్షి

Check Also

Kakinada to Kadapa Bus Timings & Schedule

Kakinada to Kadapa Bus Timings & Schedule

Find APSRTC bus timings from Kakinada to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Kakinada and Kadapa.

Kadapa to Kakinada Bus Timings & Schedule

Kadapa to Kakinada Bus Timings & Schedule

Find APSRTC bus timings from Kadapa to Kakinada. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Kadapa and Kakinada.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *