ముమ్మాటికీ జగనే వైఎస్ రాజకీయ వారసుడు. వైఎస్ మీద బురదచల్లిన వారు, జగన్‌ను వేధించిన వారు వైఎస్ వారసులు ఎలా అవు తారు? జగన్ వైఎస్ ఆస్తి పాస్తులకు మాత్రమే వారసుడు కాదు. వైఎస్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి వారసుడు. రాజకీయ వారసుడు.
వైఎస్ మరణానంతరం పడక వేసిన వైఎస్ పథకాలను పూర్తి స్థాయిలో జగన్ మాత్రమే అమలు జరపగలడన్నది ప్రజల విశ్వాసం. కృష్ణానదీ తీరాన లక్షల సంఖ్యలో లక్ష్య దీక్షలో నలభై ఎనిమిది గంటలు నిద్రాహారాలు మాని పాల్గొన్న జన సమూహాలే ఇందుకు సాక్ష్యం. నాయకునికి కావలసింది నాలుగు సార్లు ఎన్నికవడం కాదు, ఆపన్నులను ఆదుకునే తపన, నిజాయితీ, నిబద్ధత కావాలి. ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయడానికి ముందు ఐదేండ్ల కాలంలో నలుగురు కాంగ్రెస్ సీఎంలు మారి కాంగ్రెస్‌ను నగుబాటు చేశారు. వారేమైనా అనుభవంలో తక్కువ వారా? అనుభవం కంటే విశ్వసనీయత, మడమ తిప్పని సచ్ఛీలత ముఖ్యం. జగన్‌లో అవి దండిగా ఉన్నాయన్నది ప్రజల విశ్వాసం.
కాలదోషం పట్టిన సోనియా నాయకత్వం!
కాంగ్రెస్‌ను బలోపేతం చేయగల శక్తి సోనియా గాంధీకి లేదని రోజురోజుకూ రుజువవుతోంది. బీహార్ ఫలితాలు దానికి తిరుగులేని తాజా సాక్ష్యం. వైఎస్ పుణ్యమా అని ఆంధ్రలో కాంగ్రెస్ బతికి బట్టకట్టింది. అది ఇప్పుడు ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూస్తున్నాం. వైఎస్ పుణ్యంతోనే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మనగలిగింది. ఇది గుర్తించ ఇష్టంలేని సోనియా భజనపరులను చేరదీసి జగన్‌మీద కక్ష సాధించి అతడు నిష్ర్కమించే వరకు నిద్రపోలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్లీనరీలోనైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని జనం ఆశించారు. అది జరగకపోగా వైఎస్ మరణంపట్ల కంటితుడుపుగా వందల్లో ఒకడిగా సంతాపం ప్రకటించారు.
అవినీతిని పారదోలడానికి ఎవరికీ అర్థంకాని పంచసూత్ర పథకాన్ని సోనియా ప్రతిపాదించి కాంగ్రెస్ నాయకుల మెప్పుపొందారు. దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అన్నట్లు స్కామ్‌ల కథనం నడిపించారు. 63 ఏండ్ల స్వరాజ్యంలో అధిక కాలం అధికారం చెలాయించి కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో గెలవగల గొప్ప ప్రజాస్వామ్యాన్ని వెలగబెట్టిన ఘనతను చల్లగా విస్మరించారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని ధర్మ సూత్రాన్ని వల్లిస్తున్నారు. ధర్మ సూత్రాలు సోనియాకు వర్తించవా? జగన్ ఓదార్పు యాత్రను బలపరిచిన వారిని సంజాయిషీ కోరకుండానే పత్రికల్లో బహిష్కరణ వార్తను ప్రకటించడం ఏ సూత్రం పాటించి చేశారు? బురద చల్లే వారిని, క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఉపేక్షించడం ఏ సూత్రం ప్రకారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భ్రష్టుపట్టడానికి సోనియా కారణం కాదా? ఈ నిజాలు సామాన్యులకు కూడా అర్థమైపోబట్టే జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాలతో సోనియాకు లభించిన కరిష్మా ఆంధ్రప్రదేశ్ పరిణామాలతో ఆవిరి అవుతోంది.
ప్రత్యామ్నాయం జగన్ పార్టీయే!
వైఎస్ పట్ల మూడు ప్రాంతాల్లోనూ అభిమానం, విశ్వసనీయత ఉంది. అదే జగన్ పెట్టబోయే పార్టీకి పునాదిగా, రాజకీయ స్ఫూర్తిగా ఉంటుంది. గ్రామ గ్రామాన, వాడవాడలా వెలుస్తున్న వైఎస్ విగ్రహాలే వెల్లువెత్తుతున్న ప్రజాభిమానానికి తార్కాణం. వృద్ధులు, వికలాంగులు, డ్వాక్రా మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, ఆరోగ్యశ్రీ లబ్దిదారులు వైఎస్‌ను ఏనాటికీ విస్మరించరు. నీరే సర్వస్వంగా భావించే రైతన్న వైఎస్ జలయజ్ఞాన్ని ఎలా మరచిపోతాడు? నిషేధాలను సరకు చేయకుండా 30 మంది శాసనసభ్యులు జగన్ చెంతకు చేరారు. 2014 నాటికి కట్టలు తెంచుకుని వచ్చేవారు ఎందరో! గాలి ఎటు వీస్తోందో ఈపాటికి వారందరికీ అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు స్పష్టంగా జగన్‌దే! జగనే ప్రత్యామ్నాయం. పార్టీల కతీతంగా ఓదార్పు యాత్రకు ఎరత్రివాచీ పరుస్తున్న విశాఖ జనసం దోహం సమీప భవిష్యత్తుకు సంకేతంగా భావించ వచ్చు.
కాంగ్రెస్‌లో వచ్చిన చీలిక తమకు అనుకూలమైన అంశంగా టీడీపీ నాయకులు ఆశలు పెంచుకుంటు న్నారు. కానీ, రాజకీయాల్లో గణితశాస్త్రం పని చేయదు. రాజకీయాలకు విశ్వసనీయత ఆరోప్రాణం. అది లేని నాడు చీలికతో టీడీపీకి ఒరిగిందేముంది? బీహార్ ఎన్నికల్లో కౌంటింగ్ నాటికిగానీ తేలలేదు, రబ్రీదేవి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోతుందని. తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుది రైతు వ్యతిరేకమైన ప్రభుత్వమని ముద్రపడిన కారణంగానే, ఆ ముద్ర చెరిపేసేందుకు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు జనం అనుకోవటంలో తప్పులేదు. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు సహజమే. తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్టీఆర్ పథకాలను ఒక్కొక్కదాన్నే పీకిపారేయలేదా? విద్యుత్ రేట్ల తగ్గింపునకు జరిగిన బషీర్‌బాగ్ ప్రదర్శన మీద కాల్పులు జరిపి రక్తసిక్తం చేయలేదా? వైఎస్‌తో పోటీపడి పగలే 12 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానని 2009 ఎన్నికల్లో వాగ్దానం చేయలేదా? బియ్యం రెండు రూపాయలేమి ఖర్మ ఉచితంగా ఇస్తానని చెప్పలేదా? నగదు బదిలీ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా నెలకు రూ. 2,500లు నగదు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తానని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపలేదా? అయితే, ఇవన్నీ ఆపద మొక్కులేనని గ్రహించి ప్రజలు తిరస్కరించారు. విశ్వసనీయత లేకపోవడం అంటే అర్థం అదే! అధికారం కోసం వేష, భాషలు మార్చే వారిని ప్రజలు నమ్మరు.
జగన్‌కు బాసటగా సీమ ప్రజలు
కరువుసీమ వైఎస్‌ను ఎన్నటికీ మరవదు. కారణం, సీమ ప్రజల కన్నీటిని వైఎస్ తుడిచారు గనుక. సీమకు జరిగిన కుడి, ఎడమల దగా నుండి న్యాయం వైపు మళ్లించారు గనుక. భారీ పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలోనూ, అమలు జరపడం లోనూ చిత్తశుద్ధితో వ్యవహరించిన వైఎస్‌ను సీమ ప్రజలు విస్మరించరు. వైఎస్ సహజ వారసునిగా జగన్‌కు బాసటగా నిలుస్తారు.
రాష్ట్రాల పునర్విభజనవల్ల 1956కు ముందు రాయలసీమలోని తుంగభద్ర రిజర్వాయరు, తర్వాత కర్ణాటకకు వెళ్లిపోయింది. దీనివల్ల రాయలసీమకు ప్రాణప్రదమైన ఎగువ, దిగువ కాల్వల కింద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బచావత్ తీర్పువల్ల నమ్మకమైన జలాధారం లేక కేసీ కెనాల్ అనిశ్చిత జలవనరుగా మారిపోయింది. అనంతపురం జిల్లా లోని పెన్న అహోబిలం రిజర్వాయరు పూర్తి చేసినా దానికి నీటి కేటాయింపు లేదు. కృష్ణా-పెన్నారు రద్దు చేసి నాగార్జునసాగర్ నిర్మించారు కానీ, సిద్ధేశ్వరం, గండికోట విస్మరించారు. శ్రీబాగ్ ఒడంబడికను ఏనాడో బుట్టదాఖలు చేశారు.
చంద్రబాబు నిర్వాకం
మరోపక్క సీమ పట్ల ఎటువంటి నిబద్ధత, నిమగ్నత లేని చంద్రబాబు సీమ కంట నీరు తుడిచేందుకు 1996లో గండికోట, హంద్రీనీవాకు పునాది రాళ్లు వేసి, తర్వాత ఎనిమిదేండ్లు అధికారంలో ఉండి ఎనిమిది పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. 2004లో అధికారానికి వచ్చిన వైఎస్ వేల కోట్లు ఖర్చుపెట్టి పునాది రాళ్లకు ప్రాణం తెప్పించి, పరుగెత్తించాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కులకు పెంచాడు. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టాన్ని 834 అడుగుల నుండి 854కు పెంచి కృష్ణ నీరు ధారాళంగా ప్రవహించేలా చేశాడు.
నెల రోజుల్లోనే దాని కింద గల ప్రాజెక్టులన్నింటికీ వరద నీరు మళ్లించే సదుపాయం కల్పించి, అఖిలపక్ష సమావేశ నిర్ణయం మేరకు ఒక జీవో జారీ చేయిం చాడు. హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మర్రి శశిధర్‌రెడ్డి, దేవేంద్ర గౌడ్‌ల ఆటలు కట్టించాడు. తెలుగుగంగకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేసి ఇరవై ఏళ్లు గడిచినా చంద్రబాబు దానిని పూర్తి చేయలేకపోయాడు. వైఎస్ అధికారానికి వచ్చి ఏటా వందలాది కోట్లు కేటాయించినందువల్ల, బ్రహ్మసాగర్ రిజర్వాయరు కృష్ణ నీటితో నిండి, బద్వేలు తాలూకా అంతా కరువుల నుండి విముక్తి చెందింది. బాబు హయాంలో కేసీ కెనాల్ బీడుగా మారితే, వైఎస్ హయాంలో జలకళ వచ్చింది. పుష్కలంగా పండింది. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. రాయలసీమ నోముల పంట గండికోట రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, దాని కోసం జీవితమంతా కృషి చేసిన కమ్యూనిస్టు నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు యెద్దుల ఈశ్వరరెడ్డి పేరు పెట్టింది వైఎస్ అన్నది ఎవరైనా ఎలా విస్మరిసారు? ప్రజలు కృతజ్ఞులేగానీ, కృతఘు్నలు కారు. కడప జిల్లాలో ఒకనాడు పండిట్ నెహ్రూ ప్రధానిగా దర్శించి గంజి కేంద్రంలోని గంజి రుచి చూసిన రాయచోటి ప్రాంతంలో వైఎస్ వెలిగల్లు ప్రాజెక్టు రికార్డు టైంలో నిర్మించి జాతికి అంకితం చేసి, విస్మయం కలిగించాడు.
రాష్ట్రానికంతటికీ వర్తించే సంక్షేమ పథకాలకు తోడు, రాయలసీమ అభివృద్ధికి ఎన్నో కీలకమైన పథకాలను వైఎస్ చేపట్టాడు. కడప పట్టణ శివారు ప్రాంతంలో పాపికొండల కింద ఒక విశాల ప్రాంతంలో రిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను రికార్డు టైంలో వైఎస్ పూర్తి చేశాడు. కడపకు సమీపంలో నాటికి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఎదుగూబొదుగూ లేకుండా ఉన్న పీజీ కేంద్రాన్ని వేమన యోగి యూనివర్సిటీగా నామకరణం చేసి, చాలినంత డబ్బు కేటాయించి సమగ్ర ఉన్నత విద్యాకేంద్రంగా వైఎస్ అభివృద్ధి పథం పట్టించాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కడప పట్టణంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీని, భాషా పరిశోధనా కేంద్రంగా పేరు మార్చి దానికి ఆర్థిక సౌష్టవం కలిగించింది వైఎస్. ఇడుపులపాయలో రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ట్రిపుల్ ఐటీని స్థాపించి వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు ఉన్నత ఇంజనీరింగ్ విద్యలో అవకాశం కలిగించింది వైఎస్. తాళ్లపాక అన్నమయ్య భారీ విగ్రహాన్ని తాళ్లపాకకు సమీపంలో ప్రధాన రోడ్డు మార్గంలో నిర్మించి టూరిస్టు ఆకర్షణ కలిగించాడు. ఇడుపుల పాయ ద్వారా కడప-బెంగళూరు రైల్వే లైనుకు వైఎస్ ఆకాంక్ష మేరకు శంకుస్థాపన జరిగింది. కడప, పులివెందుల పట్టణాలకు కార్పొరేషన్, మునిసిపల్ స్థాయి కల్పించి రాష్ట్రంలో మేటి నగరాలకు దీటుగా అభివృద్ధి పథం పట్టించాడు.
అధిష్టానానికి భంగపాటు తప్పదు!
కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో జగన్‌ను ఓడించే ఉద్దేశంతో కడప పార్లమెంట్ పరిధి నుంచి ముగ్గురు మంత్రులను కిరణ్ మంత్రివర్గంలో నియమించి బాధ్యత అప్పగించారు. ఈ ఎన్నికలు సచ్ఛీలతకు, కుళ్లు రాజకీయాలకు మధ్య పోటీగా జగన్ వర్ణించాడు. పదవీ వ్యామోహంతో వివేకానందరెడ్డి ఆ కుళ్లు రాజకీయాల్లో దిగబడ్డాడు. వాస్తవాలను వక్రీకరించడం ప్రారంభించాడు. వైఎస్ కుటుంబాన్ని అవమానపరచి, జగన్‌ను వేదింపులకు గురి చేసిన సోనియా చేతిలో వివేకా కీలుబొమ్మగా మారడాన్ని ప్రజలు హర్షించరు. ప్రజా అధిష్టానానిదే అంతిమ తీర్పు. ఢిల్లీ అధిష్టానానికి, స్థానిక అమాత్య త్రయానికి ఈ ఎన్నికల బరిలో భంగపాటు తప్పదు. జగన్ స్థాపించే నూతన పార్టీకి ఉపఎన్నికల విజయాలు నూతన సంవత్సర కానుకలుగా, స్ఫూర్తి దాయకంగా ఉండగలవని ఆశిద్దాం!
ఎన్.శివరామిరెడ్డి మాజీ శాసనసభ్యులు
(సాక్షి దినపత్రిక సౌజన్యంతో..)