Tourist Attractions

రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!

అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు విదిల్చారు. సికింద్రాబాద్, తిరుపతిలను అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్లుగా మారుస్తామని, మరో మూడుస్టేషన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మమత శెలవి చ్చారు. రైల్వే సౌకర్యాల విషయంలో రాష్ట్రంలో దారుణంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం కాగా బడ్జెట్‌లో సీమకే తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో అరకొరగా జరిగిన మేలు కూడా కోస్తా, తెలంగాణా ప్రాంతాలకే పరిమితం అయ్యింది. రాయలసీమను నట్టేటముంచారు. విజ’ప్తులు బుట్టదాఖలే. సీమలో రైలుమార్గాల అభివృదికి, సౌకర్యాలకోసం నిధులను కేటాయించాలని కోరుతూ వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రైల్వేమంత్రి మమతాబెనర్జీని జూన్ 9న ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే ఈ కోరికలను మమత పెడచెవిన పెట్టారు.

గతంలో కూడా సీమలో రైలుసౌకర్యాల విషయమై పలువురునేతలు వినతి పత్రాలిచ్చారు. సికింద్రాబాద్- కర్నూలుల మధ్య తిరిగే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను కడప మీదుగా తిరుపతికి పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గత ఏడాది నవంబరు 8న అప్పటి కేంద్రరైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌కు లేఖ రాశారు. అయితే ఈ సమస్యపై బడ్జెట్‌లో స్పందన కరువైంది. రాయలసీమలో గుంతకల్లు కేంద్రంగా ఎప్పుడో ఏర్పాటైన రైల్వే డివిజన్ప్ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. 2004లో గుంతకల్లును మోడల్‌జంక్షన్‌గా ఎంపిక చేసినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధిపనులనూ చేపట్టలేదు. ఈ బడ్జెట్‌లో సైతంశూన్యహస్తమే చూపారు. ఎర్రగుంట్ల – నంద్యాల, ఓబులవారి పల్లె-కృష్ణపట్నం రైలుమార్గాల నిర్మాణం నత్తనడకను సాగుతోంది. ఎంతో కాలంగా ప్రజలు ఎదరుచూస్తున్న ప్రొద్దుటూరు – కంభం రైలుమార్గం సర్వేలకే పరిమితమైంది. ఈ లైను సర్వే కోసం ఇప్పటి దాకా మంజూరైన నిధులు కేవలం ఆరు లక్షల అరవై అయిదు వేల రూపాయల మాత్రమే! ఈ లైనునిర్మిస్తే మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, పోరుమామిళ్ల ప్రాంతాలు అభివృద్ధిచెందే ఆస్కారం ఎంత గానో ఉంది.

అలాగే బద్వేలు కేంద్రంగా నెల్లూరు, కడప, ప్రొద్దుటూ రులకు రైలు మార్గాలను నిర్మించేందుకు కృషిచేస్తామంటూ గతంలో నేతలు గుప్పించిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ఎప్పుడో 1982లో ప్రారంభించిన రేణిగుంట-గుత్తి డబ్లింగ్ పనులు ఇంకా సగం దూరం కూడా పూర్తి కాలేదు. నందలూరులో రైలు బోగీల మరమ్మతు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి లాలూ ఇచ్చిన హామీ అమలు కాలేదు. లైను డబ్లింగ్ పను లకే ఏండ్లు పూండ్లు పూస్తుంటే రాయలసీమలో రైలు మార్గాల విద్యుదీకరణ పరిస్థితి మరింత దారుణం. రేణిగుంట-గుంతకల్లు, రేణిగుంట-చిత్తూరు, మదనపల్లె-పాకాల, మదనపల్లె – ధర్మవరం, ధర్మవరం-గుంతకల్లు మార్గాల్లో విద్యుదీకరణ ఇప్పటికీ ప్రయాణీ కులకు ఒక కలగానే మిగిలిపోయింది. రాయలసీమలోని ముఖ్య పట్టణాల వద్ద కొన్ని రైళ్లకు స్టేజీలను నిర్ణయించడంలో కూడా రైల్వేశాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. సంపర్కక్రాంతి, మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌లను రాజంపేట వద్ద, సూపర్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరు వద్ద, ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ను నందలూరు వద్ద, వెంకటాద్రి, రాయల సీమ ఎక్స్‌ప్రెస్‌లు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట వద్ద ఆపా లన్న ప్రయాణికుల డిమాండు నెరవేరలేదు. పట్టాలు లేని సీమ గ్రామాలెన్నో ఎప్పుడో బ్రిటీషు వారి కాలంలో బొంబాయి-మద్రాసు నగరాల మధ్య తమ వ్యాపార ప్రయోజనాలకోసం ఒక రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ రైలుమార్గం పొరపాటున్నో గ్రహపాటున్నో రాయల సీమ గుండా పోయింది. కడప జిల్లాలో 168 కి.మీ. పొడవున రైలు పట్టాలు వెళ్తాయి. ఈ రైలు మార్గం తప్ప కడప జిల్లాలో మరెక్కడా రైలు పట్టాలు కనిపించడం కానీ, రైలుకూత వినిపించడం కానీ జరగలేదు. (ఏళ్ల తరబడి సాగుతున్న ఎర్రగుంట్ల – నంద్యాల రైల్వే నిర్మాణం తప్ప!)

Read :  Veteron Actress Kavitha visited the Ameen Peer Dargah

కడప నుంచి బెంగుళూరికి రైలు మార్గం వేస్తే సీమ ప్రజలు కరువుల నుండి కాస్త ఉపశమనం అయినా పొందుతారనే ఉద్దేశ్యంతో చాలా కాలంగా సర్వేలకే పరిమితమైన కడప- బెంగు ళూరు లైను నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గత ఏడాది కాస్త చొరవ చూపారు. ఈ లైను నిర్మాణానికి అయ్యే 1000 కోట్ల ఖర్చులో 500 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక చూడండి.. అక్కడే మొదలయ్యింది. విమర్శల పర్వం! జలయజ’ం నీళ్లపై చేసిన విమర్శల్లాగే ఇడుపులపాయ కోసమే కడప-బెంగుళూరు రైల్వే లైను నిర్మిస్తున్నారని నోరు పారేసుకున్నారు. కడప-బెంగుళూరు రైలు మార్గానికి ఈ బడ్జెట్‌లో కేవలం 29 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన ఈ రైలుమార్గం నిర్మాణం పూర్తి కావడా నికి 40 ఏళ్లు పడుతుందని అంచనా!

Read :  రాజీనామాను ఉపసంహరించుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి

కడప-కర్నూలు జిల్లాలకు ఉపయోగపడే ఎర్రగుంట్ల – నంద్యాల మార్గనిర్మాణానికి ఇంకా 429 కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఈ బడ్జెట్‌లో కేవలం 51 కోట్లనే కేటాయించారు. కృష్ణపట్నం – ఓబులవారిపల్లె రైలుమార్గ నిర్మాణానికి 732 కోట్లు అవసరం ఉండగా కేవలం 50 కోట్లు విదిల్చారు. మదనపల్లె-ధర్మవరం లైను గేజ్ మార్పిడి పనులకు 100 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ బడ్జెట్‌లో రాయలసీమకు కేటాయించిన అరకొర నిధులను చూసి సీమ అభివృద్ధి నిరోధకుల కళ్లు చల్లబడ్డాయేమో..! ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం కోస్తాలోని రెండున్నర జిల్లాలనో, తెలంగాణా, హైదరాబాదులు మాత్రమేననో తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీల నేతలు భావిస్తున్నారు. అందుకే రాయలసీమ ప్రయోజనా లను, ఆ ప్రాంత ప్రజల అవసరాలనూ కించపరిచే వైఖరిని అనేకసార్లు ప్రదర్శిస్తూ వస్తున్నారు. మీడియాలోని కొన్ని వర్గాల భావజాలం ఇదే వైఖరిని సమర్ధించడం దురదృష్టకరం! కడప పండింది.. కడుపు నిండింది.. ఇవే విమర్శలు. ఇవే శీర్షికలు! తరతరాలుగా కరువులతో సతమతమైన రాయలసీమలో ఒక రైలు మార్గాన్ని నిర్మించడం ప్రతిపక్షాల వారికి పెద్ద తప్పుగా కనిపించింది. విపక్షనేత చంద్రబాబునాయుడు కూడా రాయల సీమలోనే జన్మించారు. అధికార దాహం వల్లనో, ఓటు బ్యాంకు కోసమే ప్రత్యేక తెలంగాణా అయినా ‘ఫ్రీ’గా ఇస్తామన్నారు గానీ రాయలసీమ మాటను గానీ, ఈ ప్రాంత సమస్యలను గానీ తన నోట ఉచ్చరించిన దాఖలాలు లేవు.

 సమస్యలను పట్టించుకోక పోతే పోయారుగానీ పోతిరెడ్డిపాడు, కడప – బెంగుళూరు రైలు మార్గంపై తనవాళ్లను ఉసికొల్పడమే దారుణం! ”అమ్మ పెట్టక పోయె.. అడుక్కు తిననీయక పాయె” అన్న చందాన ఉంది, రాయలసీమ సమస్యల విషయంలో చంద్రబాబు వైఖరి. రాష్ట్రం లోని మూడు ప్రధాన ప్రాంతాల్లో రైల్వే లైన్లు, రైళ్ల సదుపాయాల గురించి పరిశీలిస్తే ఈ విషయంలోనూ రాయలసీమ ప్రాంతానికే తీరని అన్యాయం జరుగుతూ వచ్చిందన్న వాస్తవలు వెలుగు చూస్తాయి. జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కని ప్రజలు రాయల సీమలోనే చాలా మంది ఉన్నారన్నది కూడా అక్షరాలా నిజం! కన్నీటి తుడుపు సౌకర్యాలే కోస్తా, తెలంగాణా ప్రాంతాలతో పోలిస్తే రైల్వేసౌకర్యాల విషయంలో కూడా రాయలసీమ పరిస్థితి కడుదయనీయంగా ఉంది. ఇతర రాష్ట్రాలలో బయలుదేరి, రాయలసీమ మీదుగా ఇతర రాష్ట్రాలకు దూసుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఖనిజాలు, ముడిసరు కులనూ మోసుకువెళ్లే గూడ్సు రైళ్లు తప్ప రాయలసీమ ప్రయాణీ కులకు అందుబాటులో ఉన్న రైళ్లు అతి తక్కువ. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల ప్రజలు తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకునేందుకు ప్రవేశపెట్టిన ఒక రైలుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేశారు. ఈ రైలు హైదరాబాదులోని నాంపల్లిస్టేషన్ నుండి బయలు దేరిరాష్ట్రంలోని వికారాబాద్, తాండూరు పట్టణాలమీదుగా కర్ణాటక రాష్ట్రంచేరి, ఆ రాష్ట్రంలోని వాడి, రాయచూర్ పట్టణాల మీదుగా మన రాష్ట్రంలోని గుంతకల్లు చేరుతుంది. అక్కడి నుండి గుత్తి, కడప, రేణిగుంటల మీదుగా తిరుపతి వెళ్తుంది. ఈ రైలు ప్రయాణ కాలం 18 నుండి 24 గంటలు. నేతిబీరకాయలో నేతిలాగా రాయల సీమ ఎక్స్‌ప్రెస్‌సీమ ప్రజలకు అందిస్తున్న సేవలతీరు ఇది. మరింత తొందరగా హైదరాబాదుకు చేరాలనుకునే వారికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లే ఇకదిక్కు.

Read :  Police arrested Viveka

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఉద్దేశించిన రైలు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల రైలు ప్రయా ణీకుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గుంతకల్లు నుండి తిరుపతి, కర్నూలు, హిందూపురానికి, తిరు పతి నుండి హుబ్లీ వెళ్లే నాలుగు ప్యాసింజరు రైళ్లు తప్ప రాయల సీమ పరిధిలో మరే రైళ్లు లేకపోవడం దారుణం! రైళ్లే కాదు ప్రాజె క్టులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు తదితర ఏ అభివృద్ధి కార్యక్రమాలనూ రాయలసీమ వాసులు ప్రశ్నించి ఎరు గరు. నిట్టనిలువునా కోసి చూసినా అలాంటి కుశ్చితబుద్ధి రాయలసీమ వాసుల్లో కనిపించదు. మమతాబెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ద్వారా కోస్తా, తెలంగాణా ప్రాంతాల తరహాలో రైలు మార్గాలూ, రైళ్లూ రాయలసీమకు రావడంకల్ల అని తేలిపోయింది. కోస్తా, తెలంగాణా ప్రాంతాలలో లాగా నాన్‌స్టాప్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాట దేవుడికెరుక.. రాయలసీమ ప్రజలు ఓ రెండు కొత్త రైలు మార్గాలనూ, నాలుగు ప్యాసింజరు రైళ్లనూ సమీప భవిష్యత్తులో కళ్ల చూసే పరిస్థితి లేనట్లేనా?

                                                       –తవ్వా ఓబుల్ రెడ్డి, వార్త దినపత్రిక , సంపాదకీయ పుట వ్యాసం, 20 జూలై 2009.

Check Also

kadapa Chennai flight

Kadapa – Chennai Flight Timings

Kadapa to Chennai Flight Timings… List of Flights that are flying in between Kadapa and …

Kadapa fire stations

Kadapa Fire Stations – Telephone Directory

Kadapa District Fire stations Telephone Directory. The activities of the Fire stations and staff are …

One comment

  1. your web site more valuable info for kadapa. thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *