కడప : కడప బేసిన్‌లో ఎంతో విలువైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. రామకృష్ణన్ తెలిపారు. ‘జియో డైనమిక్స్ అండ్ మినరల్ రీసోర్సెస్ ఆఫ్ ప్రొటోరోజోయిక్ బేసిన్స్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై గురువారం యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన మూడు రోజుల జాతీయ సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డైమండ్స్, బెరైటీస్, కడప శ్లాబ్స్, లైమ్ స్టోన్, యురేనియం వంటి ఎన్నో ఖనిజాలు కడప బేసిన్‌లో అపారంగా లభిస్తున్నాయని చెప్పారు. వీటిపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమి ఏర్పడ్డాక మొదటి జీవరాశి ఉద్భవించింది కడప బేసిన్‌లోనేనని ఆయన వెల్లడించారు.
కడప బేసిన్ స్టేబుల్ ల్యాండ్(దృఢమైన భూమి)తో కూడుకుని ఉందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ భూకంపాలు తక్కువగా ఉంటాయన్నారు. ఇటీవల రాయచోటి ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనలు స్వల్పమైనవేనని చెప్పారు. రిక్టర్ స్కేల్‌పై 2.5గా నమోదు కావడంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అప్పుడప్పుడు స్టేబుల్ ల్యాండ్ ఉన్న ప్రాంతాల్లో సైతం భూకంపాలు సంభవించవచ్చని తెలిపారు. అయితే ఇటీవల చిలీ దేశంలో సంభవించిన భూకంపాలతో వీటిని పోల్చలేమన్నారు. భూ నిర్మాణంలో తేడాలున్నందున కడప బేసిన్‌లో భూకంపాలు తీవ్ర ప్రభావం చూపవని వివరించారు.
వైవీయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎ. ఆర్. రెడ్డి మాట్లాడుతూ కడప బేసిన్‌లో లభిస్తున్న ఎంతో విలువైన ఖనిజ సంపదపై పరిశోధనలు సాగేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే వైవీయూలో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. పరిశోధన రంగానికి విశ్వవిద్యాలయంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. డైరెక్టర్ ఎం. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో రిజిస్ట్రార్ సి. నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ వలీపాషా, జియాలజీ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్ డిపార్టుమెంట్ హెడ్ ఐవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. వివిధ రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ టి. రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన సెవెన్‌హిల్స్ రాక్ ఆర్ట్ విశేషంగా ఆకట్టుకుంది.