45 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల నాటికి కొత్త పార్టీ తరఫునే బరిలో దిగుతానని చెప్పారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ”ఇడుపులపాయలో వైఎస్ సమాధి సాక్షిగా చెబుతున్నా. 45 రోజుల్లో కొత్తపార్టీ పెడతా. ఇంటింటిపై మన జెండా ఎగురుతుంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల నాటికి.. స్థాపించిన పార్టీ తరఫున బరిలో దిగుతా. నాన్న వైఎస్‌పై చూపిన ఆదరణ, ఆప్యాయత నాపై చూపండి. పులివెందుల ముద్దు బిడ్డ అయిన నన్ను రాష్ట్రాన్ని పాలించేందుకు చెయ్యి పట్టి నడిపించండి. ఒక్క సారి గద్దెనెక్కిస్తే వందేళ్లయినా వైఎస్‌ను మరచిపోలేని రీతిలో పాలన సాగిస్తా” అని కార్యకర్తలతో అన్నారు.
విలువలు, విశ్వసనీయత, ఆత్మగౌరవానికి చోటు లేని కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటకొచ్చినట్లు జగన్ చెప్పారు. దిక్కూ, దారిలేక కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను పాదయాత్రతో ఒకసారి, ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పరుచుకుని రెండో సారి వైఎస్ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారన్న కృతజ్ఞతను సోనియా మరిచారని విమర్శించారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టే నీచస్థితికి ఆమె దిగ జారడాన్ని జీర్ణించుకోలేక పార్టీ నుంచి బయటపడినట్లు చెప్పారు. తమ చిన్నాన్నను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. వైఎస్ మృతిని జీర్ణించుకోలేక గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడితే సోనియా అడ్డుకోవాలనుకున్నారన్నారు.
భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తన తల్లి విజయలక్ష్మిపై సాటి మహిళగానైనా జాలి చూపలేదని, ఓదార్పునకు అంగీకారం తెలపలేదని అన్నారు. బాధితులందరినీ ఒక చోటికి పిలిచి ఆర్థికసహాయం చేయాల్సిందిగా సలహా ఇచ్చారని, చనిపోయిన వారి కుటుంబాలు ఆర్థిక సహాయం చేయాలని అడిగాయా అని ప్రశ్నించారు.
ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించినప్పటి నుంచి సోనియా వైఖరితో మానసిక సంఘర్షణ అనుభవించానని, ఆమె మాటను ధిక్కరించింనందుకు చివరకు తమ కుటుంబంలో చిచ్చు రగిల్చి ఛిన్నాభిన్నం చేయాలనుకున్నారని విమర్శించారు. మాట వినలేదన్న అక్కసుతో తన ఇంటిపై, సాక్షి కార్యాలయాలపై పోలీసులతో దాడి చేయించారని, ఈ అన్యాయాన్ని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య వద్ద ప్రస్తావిస్తే పై నుంచి ఫోన్లు వచ్చాయని, తానేమీ చేయలేనన్నారని జగన్ చెప్పారు.
ఇప్పుడు కుటుంబాన్ని విడదీస్తారని, రేపు రాజకీయంగా అనుకున్నది సాధించేందుకు వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడరని భావించే పార్టీని వీడాలనుకున్నట్లు చెప్పారు. చిన్నాన్న వివేకానందరెడ్డికి కేవలం రెండు రోజుల్లో సోనియా అపాయింట్‌మెంట్ ఖరారైందని, తమకు అపాయింట్‌మెంట్ రావడానికి నెల పైనే పట్టిందని చెప్పారు. దాన్ని బట్టే తమపట్ల సోనియా వైఖరేంటో తెలిసిందన్నారు.
స్వర్ణ పరిపాలన అందిస్తా…
కడపలో జరగనున్న ఉప ఎన్నికలపై దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తోందని జగన్ అన్నారు. ఉప ఎన్నికల కల్లా కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, ఆత్మగౌరవానికి- కుళ్లు, కుంతంత్రాలకు మధ్య జరిగే పోరు అని చెప్పారు. ఇవి సెమీఫైనల్స్ లాంటివని, 2014 ఎన్నికలు ఫైనల్స్ అని అభివర్ణించారు. ఈ మూడేళ్లూ తనను, తన వర్గీయులను కాంగ్రెస్ అధిష్ఠానం నానా బాధలకు గురిచేస్తుందని చెప్పారు. మూడేళ్లు ఓపిక పడితే తమదే అధికారమని, 30 ఏళ్లు స్వర్ణ పరిపాలన అందించేందుకు మార్గం సుగమమవుతుందని అన్నారు.