హైదరాబాద్ : రాష్ట్రంలో వున్న నాలుగు రాజీవ్ గాంధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) బోధన ఆసుపత్రులను ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కడప, శ్రీకాకుళం, ఒంగోలు, ఆదిలాబాద్ లలోని రిమ్స్ ఆసుపత్రుల పనితీరుపై సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు రూ.44కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2011 మార్చిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం రాష్ట్రానికి రానున్నదని, అప్పటిలోగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాని ఆయన వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో 100 మెడికల్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్, శ్రీకాకుళం రిమ్స్‌లలో ఇప్పటికే మెడికల్ కళాశాల మూడవ సంవత్సరం కొనసాగుతున్నదని , కడపలో విజయవంతంగా నాల్గవ సంవత్సరం కూడా పూర్తి కానున్నదని మంత్రి వివరించారు.
వైద్య విధాన పరిషత్ పరిధిలో ఒంగోలులో కొనసాగుతున్న మెటర్నిటి ఛైల్డ్ కేర్ సెంటర్ లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి డిఎల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వైద్య సదుపాయాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదన్నారు. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు గతకొన్ని నెలలుగా వేతనాలు అందక చేపడుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని 22 కోట్ల రూపాయల బకాయి వేతనాలను విడుదల చేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఈ నిధులు సరిపోతాయని, అప్పటి నుండి శాశ్వత వేతనాలు అమలౌతాయని ఆయన వివరించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా వున్న 880 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.
వైద్య విధానపరిషత్ ఆసుపత్రులలో 480 డాక్టర్ పోస్టులు ఖాళీగా వున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 180 మంది డాక్టర్లను ఇప్పటికే నియమించడం జరిగిందని, జోనల్ పధ్ధతి అడ్డు రావాడంతో అభ్యర్థులెవరూ ముందుకు రావడం లేదని అన్నారు. పరిషత్‌ను ఎత్తివేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, పేదలకు ఉత్తమ వైద్యం అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిఎల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమిళనాడు రాష్ట్రం లో వైద్య ఆరోగ్య శాఖకు ఏటా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారని, మన రాష్ట్రంలో సుమారు వంద కోట్లు కేటాయిస్తున్నప్పటికీ మెరుగైన సదుపాయాలే అందుతున్నాయని అన్నారు. ఒంగోలులోని రిమ్స్ బోధనాసుపత్రిలో రూ.15కోట్లతో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 108 అత్యవసర వైద్య సేవలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యధావిధిగా కొనసాగించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఈ సేవలలో అనుకున్న లక్ష్యం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రభుత్వమే నిర్వహించేందుకు సిధ్ధంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ నేతృత్వంలో మంజూరైన నిజామాబాద్ మెడికల్ కళాశాలకు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్తాపన చేయనున్నట్లు మంత్రి డిఎల్ వివరించారు.