జిల్లాలో టీడీపీకి కోలుకోలేని శరాఘాతం తగిలింది. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ ‘దేశం’ మాజీ అధ్యక్షుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి నిష్ర్కమణతో ఆ పార్టీ డీలాపడిపోయింది.
తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న ఓ నేత మనసు మార్చుకుని, రఘురామిరెడ్డితో చర్చించడం ఆ పార్టీ కలవరానికి కారణమవుతోంది. ఇప్పుడు అన్ని పార్టీల నేతలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు యువనేత జగన్మోహన్‌రెడ్డి వైపు కదులుతున్నారు.
రఘురామిరెడ్డి తన అనుయాయులతో శుక్రవారం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించడం తెలుగుదేశం పార్టీని కలవరపెట్టింది. పార్టీ విడిచిపోకుండా చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం తెలుగుదేశం కేడర్‌నైనా నిలుపుకోవాలని చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
గురువారం చంద్రబాబునాయుడు అనేకమంది పార్టీ నేతలకు స్వయంగా ఫోన్ చేసి ‘పార్టీని వదిలి వెళ్లకండి, పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది’ అని చేసిన సూచనలను ఎవరూ చెవికిక్కించుకోలేదు.
మైదుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి దాదాపు తెలుగుదేశం నేతలందరూ రఘురాముని వెంట నడిచి వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపారు.
మరికొందరు నేతలు నేరుగా వైఎస్ జగన్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో ఒకరిద్దరు నాయకులు మినహా, అందరూ జగన్మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించే వారేనని స్పష్టమైపోయింది.
శుక్రవారం రఘురామిరెడ్డి వెంట వచ్చిన వారిలో ప్రధానంగా మైదుకూరు నుంచి లెక్కల వెంకటరెడ్డి, వనిపెంట కటారి వీరన్న, కటారి కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, చాపాడు మండలం నుండి వేమారెడ్డి, నారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కుంచెం శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దువ్వూరు మండలం నుంచి వీవీ స్వామి, వెంకటరామయ్య, వెంకటేశ్వర్లు, నర్సి ఓబయ్య, బి మఠం నుంచి మఠం వీరనారాయణరెడ్డి, మేకల రత్నకుమార్, వీరయ్యయాదవ్, గుండాపురం రమణారెడ్డి, భూమిరెడ్డి పుల్లారెడ్డి, ఖాజీపేట మండలం నుంచి బాలకొండారెడ్డి, బీచు సుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డి, అహ్మద్, పత్తూరు గంగన్న తదితరులెందరో ఉన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జిల్లాలో మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నేత రఘురామిరెడ్డి నిష్ర్కమించడంతో, ఆ ప్రభావం చుట్టుప్రక్కల ఉన్న కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లోని తెలుగుదేశం నేతలపై పడనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ నేతగా అనేకమందితో పరిచయం ఉన్న రఘురామిరెడ్డి పార్టీని వదిలిన ప్రభావం అటు ఇటుగా ఉన్న నేతలపై పడనుంది.
కమలాపురం నియోజకవర్గంలో ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డిపై ఒకప్పటి మైసూరారెడ్డి అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. కడప నియోజకవర్గంలో కందుల కుటుంబంపై, బద్వేలులో విజయమ్మపై అసంతృప్తితో ఉన్న అనేకమంది నేతలు, కాంగ్రెస్‌లోకి వెళ్లలేక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ, ఇప్పుడు తమ పార్టీ నుంచే వెళ్లిన రఘురామిరెడ్డి ఓ ఆధారంలా, పెద్ద దిక్కులా కనిపిస్తున్నారు. ఆయనను ఆసరా చేసుకుని జగన్మోహన్‌రెడ్డి వైపు మళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అనేకమంది తెలుగుదేశం నేతలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పక్కన నిలిచే రోజు మరెంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Video: