పుష్పగిరి గ్రామం నుంచి పెన్నానది మీదుగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్దకు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోనుంది. ప్రారంభ దశలోనే ఆగిపోయిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నిధుల కొరత కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులకు ఏర్పడుతున్న ఆటంకాల గురించి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ద్వారా రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ దృష్టికి తీసుకెళ్లారు.
నిధుల కొరత లేకుండా చూస్తామని, బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జయేష్‌రంజన్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెన్నానదిలో నీరు ప్రవహిస్తున్న సమయంలో భక్తులు నది ఆవల ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్లడం కష్టంగా ఉందని, ఆలయం వద్ద నదిలో సుడిగుండాలు ఉండడంతో ప్రజల శ్రేయస్సుకోసం నదిపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని ఇంటాక్ ( భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ) ఐదేళ్ల కిందట అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న జయేష్‌రంజన్‌ను కోరింది.
కలెక్టర్ చొరవచూపి హెరిటేజ్ టూరిజం ప్రాజెక్టు కింద బ్రిడ్జి పనులకు రాష్ట్ర పర్యాటకశాఖ నుంచి అనుమతి పొందారు. ఆ తర్వాత తిరుమల కృష్ణబాబు కలెక్టర్‌గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో జిల్లాలో హెరిటేజ్ టూరిజం పనులకు రూ. 36 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుత కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. దీంతో పుష్పగిరి గ్రామం నుంచి నది మీదుగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్దకు ఫుట్ ఓవర్ బ్రిడ్జికిగాను రూ. 2.80 కోట్లు, ఆలయం వద్ద పర్యాటకుల విశ్రాంతి గృహానికి రూ. 31 లక్షలు మంజూరయ్యాయి. మొదటి విడతగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ఇటీవల ప్రారంభించారు. కానీ నదిలోతు ఎక్కువగా ఉండడంతో పునాది పనులకు మంజూరు చేసిన నిధుల కంటే చాలా ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో కాంట్రాక్టర్ పనులను ఆపేశారు.
ఈ విషయాన్ని కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి ఈ విషయంపై జయేష్ రంజన్‌ను కలిశారు. బ్రిడ్జి, విశ్రాంతి భవనం నిర్మాణాలకు ప్రస్తుతం మంజూరు చేసిన నిధులు చాలవని తెలిపారు. స్పందించిన జయేష్ రంజన్ ఆలయం వద్ద విశ్రాంతి భవనం నిర్మాణానికి కేటాయించిన నిధులను కూడా బ్రిడ్జి నిర్మాణానికి వాడుకోవాలని, విశ్రాంతి భవన నిర్మాణ నిధుల గురించి కేంద్ర పర్యాటకశాఖ దృష్టికి తీసుకెళ్లి నిధులు తెప్పించగలమని హామీ ఇచ్చారు.