హైదరాబాద్ : కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియాజకవర్గాల్లో ఏపార్టీ గెలవాలన్నా…చాలా కష్టపడాల్సి వుంటుందని మాజీ మంత్రి జె.సి దివాకర్ రెడ్డి అన్నారు. దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ఆప్రాంత ప్రజానీకానికి విడదీయరాని సంబంధాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి నియోజక వర్గంలో పేరుపెట్టి పిలుచుకునే వ్యక్తిగత సంబంధాలే వారి ఓటు బ్యాంకుకు రక్షగా ఉన్నాయని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వెంటవెంటనే రెండు మార్లు వాయిదా పడటంతో జెసి దివాకర్ లాబీలో మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ముఖ్యంగా ఆయన (జగన్) వద్ద దండిగా డబ్బు ఉంది, ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసుకునే అవకాశమూ వుంది, అంతేగాకుండా నియోజక వర్గంలో బలమైన అనుచరగణం కూడా ఎన్నికల్లో ప్లస్ పాయింట్ కాగలవని అంచనా వేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నిజంగా జగన్‌తో గెలవాలంటే చాలా పెద్ద ప్రయత్నమే చేయాలన్నారు. జిల్లా నేతలంతా మూకుమ్మడిగా ఆయా నియోజక వర్గాల్లో ఇంటింటికీ తిరిగి కష్టపడితే తప్ప ఫలితాలు రావని అన్నారు. తన వరకు ఎన్నడూ ఏ జెండాతో ఎన్నికల సమయంలో ప్రచారం చేయనని, కేవలం దివాకర్ రెడ్డిగానే ఎన్నికలకు పోతానని జె.సి అన్నారు. నిద్ర లేచింది మొదలు ఏ అవసర మొచ్చినా…ఆదు కునేది, సాయం అందించేది, నేను కాబట్టే నియోజకవర్గ ప్రజలు కూడా దివాకర్‌రెడ్డనే చూసి ఇంతకాలం ఓటమి లేకుండా గెలిపిస్తూ వచ్చారని స్పష్టం చేశారు.
ప్రభుత్వాల నడపడంలో ఎవరి స్టైల్ వారికుంటుందని, ఆ విషయంలో కిరణ్ (ముఖ్యమంత్రి) కూడా అసమర్థుడు ఏమీ కాదని జెసి దివాకర్‌రెడ్డి కితాబు ఇచ్చారు. యువకుడు, స్పీకర్‌గా సభా నియమాలు పూర్తిగా తెలిసిన వాడు కావడం ఆయనకు పెద్ద తోడ్పాటని చెప్పుకొచ్చారు.
జగన్ పార్టీ పెట్టినా…ఆయన పార్టీతో పోటీకి దిగాలన్నా…ముందుగా కాంగ్రెస్, తెలుగు దేశం రెండు పార్టీలు ఏ పార్టీ తమకు ప్రధానమైన పోటీ దారుగా గుర్తిస్తున్నారో తేల్చు కోవాలని సూచన చేశారు. తెలుగు దేశానికి జగన్ పార్టీతోనా…కాంగ్రెస్ పార్టీతోనా పోటీ పడేది ముందుగా ఆపార్టి నిర్ణయించుకోవాల్సి వుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగనా…దేశం పార్టీనా తేల్చు కోవాల్సిన అవసరం జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రత్యేకతగా జెసి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన అంశం కమిటీ చూసుకుంటుందని, అంతగా విభజన అంటూ జరిగితే మాప్రాంత ప్రజలు రాయలతెలంగాణానే కోరుకుంటారని అన్నారు. భాషా పరంగా, భావ వ్యక్తీకరణ, సంబంధ బాంధవ్యాలు అన్నింటిలో తెలంగాణా ప్రాంతంతో రాయలసీమ ప్రజానీకానికి విడదీయరాని అనుబంధాలు కలిగి ఉన్నాయని వివరించారు. ఈ రెండు ప్రాంతాలు కలిసి వుంటేనే ప్రాజానీకానికి తాగేందుకు మంచి నీళ్ళు దొరుకుతాయని అన్నారు. ప్రాజెక్ట్‌లు సీమలో వున్నా…నదుల ప్రవాహం తెలంగాణాలో ఉండటం వల్ల రెండు ప్రాంతాల నడుమ సయోధ్య తప్పదని దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.