కడప : రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలోని కమలాపురంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. సోమవారం సాయంత్రం జిల్లాకు చెందిన మంత్రులు డీఎల్.రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, టీడీపీ నేత లక్ష్మిరెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ముందుగా జిల్లాలోని కొండాపురంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని సమస్యలపై నిలదీస్తామని బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. దీంతో నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు సోమవారం తుది నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీపీపీలో ఐదు యూనిట్లు పూర్తికావడంతో ఆరవ యూనిట్‌కు అదేరోజు భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.
రచ్చబండ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి కడపలో బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నగరంలో ప్రసిద్ది చెందిన పెద్దదర్గాను సందర్శించే అవకాశం ఉంది.
అలాగే మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి అదేరోజు కాంగ్రెస్ కండువా కప్పనున్నారు. ఈ కార్యక్రమాలు ముగించుకుని 12వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా సోమవారం ముఖ్యమంత్రి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎటుతిరిగి పార్టీ ప్రతిష్ఠను నిలిపేందుకు సమైక్యంగా పోరాటం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించినట్లు సమాచారం.