పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. కడప ప్రజపైన కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న వార్తలను చూసిన తరువాత ఆ ప్రాంతానికి చెందిన సగటు సాధారణ పౌరునిగా నా వేదన మీ ముందుకు తెస్తున్నా…
‘కడపలో ప్రజాస్వామ్యం లేదు’, ‘కడప నిండిపోతోంది’, ‘కడప రౌడీయిజం’. ‘కడప మార్కు దందా’ …. ఇవన్నీ ఇక్కడి కొద్ది రోజులుగా లేదా సంవత్సరాలుగా కడప పైన పత్రికలలో కనిపిస్తున్న పతాక శీర్షికలు.
అయ్యా! పత్రికాదిపతులారా … మీకు, మీ ప్రత్యర్థులుగా మీరు భావిస్తున్న మా జిల్లా నేతలకు మధ్య ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుని , కడపను లేదా ఇక్కడి ప్రజలను మొత్తం కించపరిచే విధంగా పనికట్టుకుని ప్రచారం చేయవద్దని మా మనవి.
జిల్లా వెనుకబడినప్పుడు ఏనాడూ ప్రధాన సంచికలో వార్తలు ప్రచురించని మీరు ఈ జిల్లాకు కొద్దిపాటి నిధులు ప్రభుత్వం కేటాయించిన వెంటనే అదేదో అంతా మాకే ఇచ్చినట్లు ప్రచారం చేసారు. ఇప్పుడేమో ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని ప్రచారం చేస్తున్నారు. తమ వోట్లను ఎవరో వేసుకుంటే చూస్తూ ఊరుకునే అమాయకులం కాదు మేము. మా వోటు ఎవరికీ వేయాలో మాకు తెలుసు.
దయచేసి కడప పేరును దుష్ప్రచారానికి వాడవద్దని మా మనవి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పయనిస్తున్న ఈ ప్రాంతంపైన చెడు ముద్ర వేయకండి … దయచేసి!
– విజయచందర్.కే (ఈ మెయిల్ ద్వారా)
www.kadapa.info Voice of the YSR Kadapa District