గోపురం పైభాగంలో చెట్లు మొలవడం వంటి కారణాలతో నెర్రెలు చీలాయని నిర్లక్ష్యం చేస్తే గోపురం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. పురావస్తుశాఖ తమ నిబంధనలను పాటిస్తూనే త్వరితగతిన మరమ్మతు పనులు చేపడితే మంచిదని సూచించారు. గోపురాల పైభాగాల్లో చెట్లు మొలిచిన కారణంగా నెర్రెలు చీలుతున్నాయని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే చెట్టు కాండం పెద్దదై నెర్రెలు పెద్దగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. తాము పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి, పురావస్తుశాఖకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
నివేదిక ఆధారంగా ఆలయ పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. రాజగోపురంలోని శిల్పాలు కూడా చాలా భాగం దెబ్బతిన్నాయని, వాటికి రీ ప్లాస్టరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గోపురంలో పగుళ్లు చాలా కాలం నుంచి ఉన్నాయని, అయితే మధ్యమధ్యలో పురావస్తుశాఖ మరమ్మతులు చేయడంతో ఎలాంటి ప్రమాదం లేదని వారు నిర్ధారించారు.
రాష్ట్రంలో పురాతన, చారిత్రాత్మక దేవాలయాల స్థితిగతులపై పరిశీలనలు చేస్తున్నట్లు దేవాలయాల పరిశీలన బృందం కన్వీనర్ జగన్మోహన్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని, గోపురాన్ని, మంటపాన్ని, గర్భగుడి పైభాగాన్ని శనివారం సాయంత్రం పరిశీలనబృందంసభ్యులు నిశితంగా పరిశీలించారు. పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు నెలల క్రితం శ్రీకాళహస్తిలో ఆలయ శిథిలమైన సంఘటన దరిమిల ప్రభుత్వం పురాతనఆలయాల పరిశీలన కోసం ప్రత్యేకబృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ బృందంలో రిటైర్డ్ చీఫ్‌ఇంజినీర్‌లు, ఐ.ఐ.టి. ప్రొఫెసర్లు వంటి మేధావులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పురాతన, చారిత్రాత్మకమైన 47 ఆలయాలను పరిశీలించామని తెలిపారు. వీటిల్లో చాలా దేవాలయాలకు అతి త్వరితగతిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అంతకుముందు ఆలయానికి వచ్చిన పరిశీలన బృందానికి ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఇ.ఒ. శేషారెడ్డి ,ఒంటిమిట్ట ఎంపీపీ ఆకేపాటి రాజేశ్వరి, జడ్పీటీసీ ఇరగంరెడ్డి రాజ్యలక్ష్మి, పరిశీలనా బృందం సభ్యులు పాల్గొన్నారు.