అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ మనవి. నా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ వార్తను తట్టుకోలేక గుండెపగిలి వందలాది మంది మా ఆత్మబంధువులు మరణించిన సంగతీ, ఆ కుటుంబసభ్యులను పలకరించడానికి నేను ఓదార్పుయాత్రను ప్రారంభించిన సంగతీ మీకు తెలిసిందే. ఇప్పటికే రెండు జిల్లాల్లో పర్యటన పూర్తయింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంత విరామం. ఆలస్యానికి మన్నించండి. రెండో విడత పర్యటన ఈ నెల ఎనిమిదో తేదీన శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమవుతుంది. అటునుంచి అటే మరో అయిదారు రోజులు తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పుయాత్ర వుంటుంది. నాన్నగారి పై ప్రేమను గుండెలనిండా నింపుకొని ఆయన ఇకలేరన్న వార్తతో ప్రాణాలు కోల్పోయిన వందలాది మందీ నాకు ఆత్మీయ బంధువులే. వారి కుటుంబాల్లోని మీరంతా నాకు తల్లులూ, తండ్రులూ, తోబుట్టువులే. మిమ్మల్ని కలుసుకుంటాననీ, మీ కష్టాల్లో సుఖాల్లో తోడుంటానని మాట ఇచ్చి చాలా రోజులైంది. మా నాన్న చనిపోయిన పావురాలగుట్ట సాక్షిగా ప్రజావేదికపై నుంచే నేనా ప్రకటన చేసిన విషయం గుర్తుంది. సెప్టెంబర్ 25 న నల్లకాలువ దగ్గర జరిగిన సంస్మరణ సభలో ఆ మాట ఇచ్చాను. తొమ్మిది నెలలు దాటింది. ఈ ఆలస్యానికి ఎన్నో కారణాలు. చాలా వరకు మీకు తెలుసు. మధ్యలో ఏవేవో అభ్యంతరాలు. రాజకీయ భూతద్దాల్లోంచి ఓదార్పుయాత్రను చూడటం మొదలైంది. ఓదార్పు అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటో నాకు తెలియదు. ఓదార్పు అంటే నా దృష్టిలో కేవలం ఒక పలకరింపు కాదు. తృణమో, ఫణమో ఇచ్చి చేతులు దులుపుకోవడం అంతకన్నా కాదు.
నిజానికి నేనూ ఓ బాధితుడినే. ఆకాశమెత్తు తండ్రిని కోల్పోయిన బాధితుడిని. నా తండ్రి మరణంతో కుటుంబ ముఖ్యులను కోల్పోయిన బాధితులు వారు. మా ఇరువురి బాధల మధ్య ఓ ఆత్మీయ బంధాన్ని ముడివేసి పోయారు మా నాన్న. రక్త బాంధవ్యం కంటే నా దృష్టిలో ఈ ఆత్మబాంధవ్యం పెద్దది. అందుకే ఓదార్పు కార్యక్రమాన్ని నేను మొక్కుబడి తతంగంగా భావించలేను. నేను వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలి. వారి కష్టసుఖాలు వినాలి. పంటి బిగువున దాచిపెట్టుకున్న గుండెచప్పుళ్లను వినిపించుకోవాలి. ఒకరి కన్నీళ్లను ఒకరు తుడవాలి. జీవితంలో వారికి అండగా ఉంటాననే భరోసాను ఇవ్వాలి. పర్యటించిన రెండు జిల్లాల్లో నేను చేసిందదే. మా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి కూడా ఇదే విషయాన్ని వివరించాము.
నా తల్లిగారు విజయమ్మ, నా చెల్లెలితో కలిసి ఇటీవల మా పార్టీ అధినేతను కలుసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే. నా ఓదార్పుయాత్రను కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం రాజకీయం చేసిన నేపథ్యంలో నా తల్లిగారు మా పార్టీ అధ్యక్షురాలికి జూన్ 2 న ఒక లేఖను రాసిన సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. అప్పటికే అనుకున్న ప్రకారం జూన్ 8 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కావాల్సిన ఓదార్పుయాత్రను ఆపవద్దని ఆ లేఖలో అమ్మ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే, సమయం కేటాయిస్తే స్వయంగా కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వారిని ప్రార్థిస్తామని కూడా లేఖలో కోరారు. ఆ లేఖకు స్పందించి జూన్ 29 న సోనియాగాంధీగారు మాకు సమయం కేటాయించారు. నా తల్లిగారితోపాటు నేనూ, నా చెల్లెలు ఆ రోజు మా అధినేతను కలుసుకున్నాం. బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని నేను మాట ఇచ్చిన విషయాన్నీ, వారికి తోడు నిలవాల్సిన అవసరాన్ని సోనియాగాంధీగారికి వివరించాం. నిర్ధిష్టమైన కారణమంటూ చెప్పలేదుగానీ, ఎందుకో వారు ఓదార్పుయాత్ర పట్ల అంత సుముఖంగా ఉన్నట్టు కన్పించలేదు. యాత్రకు బదులుగా బాధిత కుటుంబాలను ఒకచోట చేర్చి ఆర్థిక సాయం చేయవచ్చనే సూచన చేశారు. అది సత్సంప్రదాయమనిపించుకోదని సోనియాగాంధీగారికి వివరిస్తూ “నా భర్త చనిపోయినప్పుడు మీరు సహృదయంతో ఢిల్లీ నుంచి వచ్చి మమ్మల్ని ఓదార్చారే తప్ప, మమ్మల్ని ఢిల్లీకి పిలుపించుకోలేద’ నే సంగతిని నా తల్లిగారు గుర్తుచేశారు. పైగా ఈ యాత్ర కేవలం ఆర్థికసాయం చేసే అంశంగా మాత్రమే పరిగణించడం లేదనీ, బాధిత కుటుంబాల వారెవ్వరూ కూడా సాయం కావాలని ఆర్థించలేదనీ వివరించాము. అటువంటివారిని ఎక్కడికో, మూకుమ్మడిగా పిలిచి సాయం చేస్తే అవమానించినట్టుగా భావించే అవకాశముందన్న అభిప్రాయాన్ని వారికి నివేదించాం. ఓదార్పు అంటే మా దృష్టిలోవున్న విస్తృతార్థాన్నీ ప్రాధాన్యతనూ వారికి వివరంగా చెప్పాము. వారు కూడా సావధానంగా విన్నారు. ఓదార్పుయాత్రపై వారికి నివేదించిన విషయాలనే మీతో పంచుకుంటున్నాను.
ఓదార్పుయాత్రను ఆర్థికసాయం చేసే అంశంగా నేనెప్పుడూ భావించలేదు. నేను ఇదివరకే పరామర్శించిన కుటుంబాలకు కూడా నేనేమైనా ఆర్థికసాయం చేశానా… లేదా, చేస్తే ఎంత? అనే విషయాలు నాకూ, వారికి తప్ప ఎవ్వరికీ తెలియవు. నా యాత్రలో అదొక ముఖ్యాంశం కూడా కాదు. మీడియా కానీ, ఇతరులు కానీ ఎవ్వరూ లేకుండా కాసేపు ఏకాంతంగా వాళ్లతో గడపడానికే ప్రయత్నించాను. వారి కష్టసుఖాలు విన్నాను. నాతోపాటు వచ్చిన స్థానిక నాయకులను పిలిచి వారికి పరిచయం చేశాను. చిన్న చిన్న ఇబ్బందులుంటే వారికి చెప్పుకోవచ్చని సూచించాను. అంతకంటే పెద్ద అవసరం ఏర్పడితే నాకే ఫోన్ చేయవచ్చని నా నెంబర్‌నూ వారికిచ్చాను. జరిగిందిదే. నేనేదో రాజకీయం కోసమో, ప్రచారం కోసమో చేసే వాణ్నయితే ఇదంతా మీడియా ముందే జరిగేది. కానీ ఈ ఓదార్పు కార్యక్రమాన్ని నా బాధ్యతగా భావించి, వ్యక్తిగత హోదాలో చేస్తున్నందువల్లే బహిరంగపరచడం లేదు.
ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న ఓదార్పుయాత్రపై ఇన్ని రాజకీయ క్రీనీడలెందుకో… ఇంత అనవసర వివాదమెందుకో నాకిప్పటికీ అర్థం కాలేదు. అయినా అపార్థాలకు తావివ్వరాదని ఓర్పుగా ఇంతకాలం ఆగాల్సివచ్చింది. ఈ ఆలస్యాన్ని నా ఆత్మబంధువులు అర్థం చేసుకోవాలనే ఈ వివరణ. అలాగే, ఈ ఆటంకాల మధ్య అసలు ఓదార్పుయాత్ర ఉంటుందా? ఉండదా? అనే గందరగోళస్థితి ఏర్పడింది. ఈ అస్పష్టతను దూరం చేయడానికే మీకీ లేఖను రాయాల్సివచ్చింది. ఓదార్పుయాత్ర వుంటుంది. ఈ నెల 8న నాన్న పుట్టిన రోజు. నిరంతరం జన సంక్షేమం కోసం తపించిన మహా నాయకుడాయన. ఆయన కోసం కన్ను మూసినవారి కుటుంబాల ఓదార్పు కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి ఆయన పుట్టినరోజు కంటే మంచి రోజేముంటుంది? మాట తప్పడం మడమ తిప్పడం ఎరుగని మహానేతకు కొడుకుగా పట్టిన ‘నేను…. ఆయన ఆత్మ శాంతికోసం, ఆయన చనిపోయిన చోటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పుత్రధర్మం. ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నది ముఖ్యం.
ఇచ్చిన మాటమీద నిలబడ్డామా? లేదా అన్నది జీవితంలో చాలా ముఖ్యమని నాన్న చెబుతుండేవారు. ఆయన రక్తాన్నే కాదు, స్వభావాన్నీ నాకు పంచి ఇచ్చారు. మాటమీద నిలబడని రోజున ప్రజాజీవితం సంగతి అటుంచి, మనిషిగా బతకడమే వ్యర్థమని నా ఉద్దేశం.’ తండ్రి ఆత్మ పుణ్యలోకాల్లో ప్రశాంతంగా వుండేలా ఉత్తరక్రియలు నిర్వహించేవాడే నిజమైన కొడుకని మన సంప్రదాయం చెబుతోంది. కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. చరిత్రాత్మకమైన ప్రజాప్రస్థానం పాదయాత్రను నా తండ్రి ఎక్కడైతే ముగించాడో అదే ఇచ్చాపురం నుంచి ఆయన కోసం చనిపోయిన వారి కుటుంబాలకు నా ఓదార్పు ఆయన పుట్టిన రోజునాడే మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ఓదార్పుయాత్ర సందర్భంగా నన్ను కలవడానికో, చూసేందుకో మీ పనులు చెడగొట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. హంగులు ఆర్భాటాలు వద్దు. ఎవరైనా పార్టీలకు అతీతంగా నాన్న మీద ప్రేమతో పాలుపంచుకోవాలనుకుంటే అది కూడా దివంగత మహా నాయకుడిపై ప్రేమతో… దాన్ని కూడా పెద్ద మనసుతో ఆహ్వానిద్దాం.
మీ
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి