కడప:వెనుకబాటుతనానికి గురైన వైఎస్సార్ జిల్లా పై కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో అభివృద్ధి జరిగితే కాని వెనుకబాటు తనం నుండి వైఎస్సార్ జిల్లా ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన 250 వెనుకబడిన జిల్లాల్లో కడప కూడా ఉండడంతో ఈ జిల్లాకు అభివృద్ధి నిధులు బాగా వచ్చే అవకాశం ఏర్పడింది.
దేశవ్యాప్తంగా 250 వెనకబడిన జిల్లాలు ఉన్నాయని, వీటిలో 13 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది .లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య సోమవారం లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 13 వెనకబడిన జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ , కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ వి కాగా కోస్తాంధ్ర నుంచి కేవలం విజయనగరం ఒక్కటే వెనకబడిన జిల్లా అని ప్రదీప్ జైన్ ఇచ్చిన సమాచారం వెల్లడించింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి రాష్ట్రానికి రూ.348.28 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఒక ప్రాంతంలో ప్రణాళికల అమలు, అభివృద్ధి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని, రాష్ట్రాల కృషికి వివిధ పథకాల ద్వారా కేంద్రం తనవంతు దోహదం చేస్తుందని వివరించారు. తద్వారా, ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్రాలు ప్రయత్నిస్తాయని చెప్పారు.
వైఎస్ మరణానంతరం జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగడం పలు అభివృద్ధి పనులు నిలిచి పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాను వెనుకబడిన జిల్లాగా ఎంపిక చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలకు ఎంపిక చేసిన రూ. 4678 కోట్ల నిధుల్లో వైఎస్సార్ జిల్లా కు కూడా దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. పలు మౌళిక సదుపాయాలు కలగనున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ఎంపిక చేస్తే ఇందులో 9 జిల్లాలు తెలంగాణ జిల్లాలు ఉండగా కోస్తా నుండి విజయనగరం జిల్లాను రాయలసీమ నుండి వైఎస్సార్ జిల్లా చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా లో ఆది నుండి కూడా కరువు కాటకాలు వెంటాడుతుండడం, వర్షాభావ పరిస్థితులు నెలకొంటూ రావడం, సాగునీటి వనరులు లేక పోవడంతో ప్రధానంగా ఈ జిల్లా వెనుకబాటు తనానికి గురవుతుంది.
కేసీ కెనాల్ ఆయకట్టు కొద్దో గొప్పో మైలవరం, పింఛా ప్రాజెక్టులు మినహా మిగిలిన వ్యవసాయ పొలాలకు సాగునీరే లేదు. రాయల నాటికాలంలో నిర్మించిన చెరువులు, మట్లిరాజుల కాలం నాటి ఊట బావులు జిల్లాలో మెండుగా ఉన్నా వర్షాభావ పరిస్థితుల్లో వాటికి నీరు చేరేది లేదు. ఇప్పుడు అవికూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తోంది. పల్లె సీమలు కష్ట నష్టాలను మూటకట్టుకుని జీవనం సాగిస్తూ వచ్చే పరిస్థితి. పల్లె సీమల దుస్థితి జిల్లా వెనుకబాటుపై చూపుతూ వస్తోంది. ఇక 2004 తరువాత వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో మెడికల్ కళాశాల, వైవీ యూనివర్శిటీతో పాటు పలు విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి కాని అంతకు ముందు కడపలో ఉన్నత విద్యకు సాంకేతిక విద్యకు సరైన సదుపాయాలు ఉండేవి కావు.
అక్షరాస్యత పరంగా చూసినా జిల్లాలో 26 లక్షల 1797 మంది జనాభా ఉంటే 14 లక్షల 20వేల 752 మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. మహిళల్లో 5,53,698 మంది ఉంటే పురుషుల్లో 8,67,054 మంది మాత్రమే అక్షరాస్యులున్నారు. ఇక పరిశ్రమల పరంగా చూస్తే ముందునుండి ఉన్న రెండు సిమెంట్ పరిశ్రమలకు తోడు ఇటీవల సిమెంట్ పరిశ్రమలు వచ్చాయి కాని అంతకు మించి పెద్దగా పారిశ్రామిక పురోగతి జిల్లాలో జరగలేదు. బ్రహ్మణీస్టీల్స్ నిర్మాణం జరుగుతుందని ఆశించినా, అది కూడా నిలిచి పోవడం మరో కొత్త స్టీల్ పరిశ్రమ వస్తుందని ఆశించినా అది కార్యరూపం దాల్చక పోవడం, పండ్ల తోటల ఆధార పరిశ్రమలు, బెరైటీస్ ఆధార అనుబంధ పరిశ్రమలు లాంటివి ఏర్పాటు అవుతాయని అనుకున్నా నిరాశే మిగిలింది. ప్రొద్దుటూరు పాల పరిశ్రమ మూత పడడం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ రేపో మాపో అన్నట్లు నడుస్తుండటం లాంటి నేపథ్యంలో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. అటు పారిశ్రామికంగానూ, ఇటు వ్యవసాయపరంగా, సాగునీటి రంగంలోనూ అభివృద్ధి కానరాక పోవడంతో జిల్లా వెనుక బాటు తనం నుండి కోలుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలో కడపను చేర్చడం కొంత ఊరట ఇచ్చినట్లేనని భావించవచ్చు. అయితే ఈ నిధులను జిల్లా ఉన్నతాధికారులు ఎంతమేరకు ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు పెడతారో, అందుకు ప్రజాప్రతినిధులు ఏమాత్రం సహకరిస్తారో వేచిచూడాల్సిందే !
వెనకబాటుకు ప్రాతిపదిక ఇలా ..
దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. మరికొన్ని వెనకబాటుతో సతమతమౌతున్నాయి అందుకే.. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధి (బీఆర్‌జీఎఫ్)ను ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి.. ఆయా ప్రాంతాల్లో సత్వర అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. వెనకబడిన జిల్లాలను ఎంపిక చేయడానికి ముఖ్యంగా మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. అవి,
1. ఒక్కో వ్యవసాయ కూలీ చేసే పని విలువ
2. వ్యవసాయ కూలీ రేటు
3. ఆయా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతం
పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలను వెనకబడినవిగా ప్రకటించాలనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఇవి కాకుండా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలను కూడా వెనకబడిన జిల్లాలుగా పరిగణించి వాటికి కూడా నిధులు కే టాయిస్తారు.