కాశినాయన : ఎంతమంది ఆకలితో వచ్చినా 24 గంటలూ కడుపునిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలోని ఈ అన్నదాన క్షేత్రం ప్రత్యేకత. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి అందాల మధ్య అలరారే శ్రీ అవధూత కాశినాయన పంచదశ ఆరాధన మహోత్సవాలను సోమ, మంగళవారాల్లో నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది.
* ఆరు జిల్లాల నుంచి.. :
ఖమ్మం, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు వంటి చుట్టుపక్కల జిల్లాల నుంచేకాక హైదరాబాదు వంటి ఇతర పట్టణాల నుంచి వచ్చే భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం, విరాళాల రూపంలో డబ్బులు పెద్ద ఎత్తున చేరవేస్తున్నారు.
కాశినాయన ఎవరు :
నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లె ఈయనిది. సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించారు. యుక్త వయస్సులో ఆధ్యాత్మిక భావనతో కొండలు దాటుకొని కడప జిల్లా కాశినాయన మండలంలోని వరికుంటకు చేరుకున్నారు. పక్కన నాయునిపల్లెలో చిన్నపిల్లలకు విద్య నేర్పుతూ కొంతకాలం గడిపారు. ఆ సమయంలో నల్లమల అటవీ ప్రాంతలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని కొన్నేళ్లు తపస్సు చేశారు. స్థానికుల సహకారంతో అనేక పాడుబడిన ఆలయాలను పునరుద్ధరించారు. అన్నదానమే బాటగా ఆలయాల సముదాయంలో అన్నపూర్ణ ఆలయాన్ని నిర్మించారు. మొదట జ్యోతిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే 1995 డిసెంబరు 6న జ్యోతిలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఆయన భక్తుల సమక్షంలో కన్నుమూసి, సమాధి దీక్ష పొందారు.
ప్రసాదం : అన్నదాన క్షేత్రం… కాశినాయన ఆశ్రమంలో భోజనం చేసి రావడమే దేవుని ప్రసాదం స్వీకరించినట్లని భక్తులు చెబుతారు. నమ్ముతారు.
సేవాభావం : ఇంత ప్రసాదం తిని, తమ చేతులమీదుగా పదిమందికీ భోజనం వడ్డించడమే పరమాత్మునికి సేవ చేసిన తృప్తిగా తదాత్మ్యం పొందుతారు. అన్నదానానికి తమకు తోచిన రీతిన తొలిపంట, ధనం, ధాన్యం, నగదు రూపాల్లో తృణమో, ఫణమో ఇస్తారు. ఆధ్యాత్మికతను చాటుకుంటారు. ఇవే నిత్యాన్నదానానికి ఆధారం.
* కాశినాయన మండలంలోని జ్యోతిక్షేత్రం, శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమానికి వచ్చే ఏ భక్తుడిని అడిగినా చెప్పేమాటలివి
సదుపాయాలు : కాశినాయన సమాధి స్థితి తర్వాత వరికుంట్ల నుంచి జ్యోతిక్షేత్రానికి తారురోడ్డు ఏర్పడింది. విద్యుత్తు, పరిశుభ్రమైన తాగునీరు, విశాలమైన భోజనశాల, భక్తులకు మరుగుదొడ్లు, భక్తుల సహకారంతో దాదాపు 50 విశ్రాంతి గదులు ఏర్పాటయ్యాయి. ఆర్యవైశ్యులు ప్రత్యేకమైన అతిథి గృహం ఏర్పాటు చేసుకున్నారు.
నిర్వహణ : జ్యోతిక్షేత్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు. నాయన దేవాలయం నేటికీ నిర్మాణ దశలోనే ఉంది. దాదాపు 60 రాతి స్తంభాలతో గుడి నిర్మాణం జరుగుతోంది. ఆలయం చుట్టూ, లోపల, బయట వివిధ రకాల దేవతా మూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. దాతలు ఒక్కొక్కరూ ఒక్కో ప్రతిమకో, రాతి స్తంభానికో సరిపడా విరాళాలు ఇస్తూ గుడి నిర్మాణానికి సహకరిస్తున్నారు. తలనీలాలు, టెంకాయల వేలంలో ఈ ఏడాది దాదాపు రూ.28 లక్షల ఆదాయం వచ్చింది. భక్తులు విరాళంగా ఇచ్చిన పశుసంపద దండిగా ఉంది. ఆశ్రమంలో దాదాపు 400 అవులు, 200 ఎనుములు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి : కర్నూలు, ఒంగోలు జిల్లాల నుంచి వచ్చే భక్తులు గిద్దలూరు చేరుకుంటే రైల్వే స్టేషను వెలుపల నుంచి జ్యోతిక్షేత్రానికి నేరుగా ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
* నెల్లూరు, కనిగిరి నుంచి వచ్చే భక్తులు పోరుమామిళ్లకు చేరుకుంటే ఆర్టీసీ బస్టాండు నుంచి ప్రత్యేక బస్సులు జ్యోతికి అన్నివేళలా అందుబాటులో ఉంటాయి.
* కడప, అనంతపురం నుంచి వచ్చే భక్తులు మైదుకూరు చేరుకుంటే అక్కడ నుంచి అమగంపల్లె మీదుగా జ్యోతికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.