Tourist Attractions

బ్రహ్మంగారి కాలజ్ఞానం-ప్రపంచం చదవాల్సిన గ్రంథం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి (బ్రహ్మంగారి) గుఱించి తెలుగువారికి ఉపోద్ఘాతం అవసరం లేదు. హిందువులు విశ్వసించే మతంలో ఆయనకూ, ఆయన రచించిన కాలజ్ఞానానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే “ధర్మం యుగానుసారి, ఋషులు క్రాంతదర్శులు (తమ కాలాన్ని దాటి ఆలోచించగలవారు)” అనే నమ్మకాలకి అది సాక్ష్యంగా నిలుస్తుంది. కాలజ్ఞానం భవిష్యత్ సంఘటనల్ని తెలిపే గ్రంథంగా చాలామందికి తెలుసు. ఇటువంటి కాలజ్ఞాన గ్రంథాలు కొన్ని ఇతరజాతుల సారస్వతాలలో కూడా ఉన్నాయంటారు. కన్నడభాషలో సర్వజ్ఞుడు రచించిన కాలజ్ఞానం, విద్యారణ్యులవారు ఉల్లేఖించిన విద్యారణ్య కాలజ్ఞానం, ఫ్రెంచి భాషలో నోస్ట్రడేమస్ వ్రాసిన The Centuries ఇటువంటి కృతులే. బైబిల్ (కొత్త నిబంధన) లోని Revelations అనే ప్రకరణం కూడా కాలజ్ఞానమే. ఇవి కాక భవిష్యత్తులు తెలపడం కోసం భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఏకంగా భవిష్యపురాణం పేరుతో ఒక మహాపురాణమే వ్రాశారు.

భవిష్యత్తు (ఏష్యం) తెలుసుకోవాలనే కుతూహలం మానవులలో ఈనాటిది కాదు. ఱేపటి కోసం ఆహారం దాచుకోవాలనుకున్నప్పటినుంచి అది మనిషిలో నానాటికీ బలీయమవుతూనే వచ్చింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కుతూహలాన్ని తీర్చడం కోసమా ? అనడిగితే, కానేకాదు. తన త్రికాలవేదిత్వాన్ని వెల్లడించడం కోసం గానీ, పాండిత్యప్రకర్ష కోసం గానీ, చంచల మనస్కులైన సామాన్యప్రజలకి ఏష్యాల పట్ల రేకేత్తే వృథా కుతూహలాన్ని సంతృప్తిపఱచడం కోసం గానీ బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాయలేదు. ఎందుకంటే ఇది ఆయన మతగురువుగా దేశమంతటా ప్రసిద్ధుడైనాక రచించినది కాదు. శ్రీమతి గరిమిరెడ్డి అచ్చమ్మగారింట్లో ఒక సామాన్య అనామక పశువుల కాపరిగా ఉన్నరోజుల్లోనే వ్రాసినది. ఆయన యజమానురాలైన అచ్చమ్మగారే దీనికి ప్రథమశ్రోత. బ్రహ్మంగారి ముఖ్యోద్దేశం – దేశమూ, ప్రపంచమూ, ప్రజలూ ఇంకా అధ్వాన్నంగా పాడైపోయే రోజులు రాబోతున్నాయని, ఆ విధంగా కలియుగం పరాకాష్ఠకి చేఱుకొని అంతం కాబోతున్నదనీ, ఆ తరువాత కృతయుగం మొదలు కాబోతున్నదనీ, ఈ లోపల ఆయా ఉపద్రవాల నుంచి దైవభక్తి ఒకటే కాపాడగలదనీ హెచ్చఱించడం. కనుక కాలజ్ఞాన రచన వెనుక తీవ్రమైన తపస్సుంది. భగవత్ సందేశం ఉంది. అంతర్మథనం ఉంది. మానవాళి భవిష్యత్తు గుఱించి రచయిత పడ్డ ఆవేదన, ఆక్రోశం దాగున్నాయి. ముందుగా చెప్పి ఎలాగైనా మానవుల్ని యుగాంతపు బాధల నుంచి తప్పించాలనే తపన ఇమిడి ఉంది. ఏసుక్రీస్తులాగే బ్రహ్మంగారు కూడా “తాను మళ్ళీ రెండోసారి వస్తాననీ, ఈసారి వచ్చినప్పుడు వీరభోగ వసంతరాయలనే పేరుతో ప్రపంచాన్ని 95 సంవత్సరాల పాటు పరిపాలించి కృతయుగ ధర్మాల్ని నెలకొల్పుతాననీ, ఆ తరువాత తన సంప్రదాయస్థులు వెయ్యేళ్ళపాటు పరిపాలిస్తారనీ, ఈ మాట తప్పితే తాను నరకానికి వెళతా”ననీ ఈ పుస్తకంలో పదేపదే వాగ్దానం చేశారు.

ముద్రితమైన ప్రస్తుత కాలజ్ఞానంలో–

౧. వచన కాలజ్ఞానం (పన్నెండాశ్వాసాలు – 93 పుటలు)
౨. ద్విపద కాలజ్ఞానం (23 పుటలు)
౩. రెండు సౌజన్య పత్త్రికలు (10 పుటలు)
౪. జీవైక్యబోధ (21 పుటలు)
౫. సిద్ధగురుబోధ (55 కందపద్యాలు)
౬. కాళికాంబ పద్యరత్నాలు (232 ఆటవెలది పద్యాలు)
౭. కాలజ్ఞాన గోవిందవాక్యాలు (326 చరణాలు)

Read :  కడప ప్రాంత శాసనాలలో రాయలనాటి చరిత్ర!

అనే విషయవిభాగం ఉంది. ఇందులో స్థానం సంపాదించుకొన్న అన్ని అధ్యాయాలూ బ్రహ్మంగారు వ్రాసినవి కావు. ఆయన శిష్యులూ, కుమారులూ వ్రాసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏదేమైనా కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. నిజానికి శుద్ధ గ్రాంథికాన్ని అర్థం చేసుకోవడం కూడా కొన్నిసార్లు ఆధునికులకి కష్టం కాదు. అసలు విషయం – ఈ గ్రంథం 350 సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికంలో గ్రాంథికశైలి మిశ్రమంగా వ్రాయబడింది. రెండోది – ఈ గ్రంథంలోని కొన్ని అధ్యాయాల్ని రచయిత మౌఖికంగా మాట్లాడగా ఇతరులు వ్రాసుకొన్నవి కావడం చేత వాటి సమయం, సందర్భౌచితి అర్థం కాక అయోమయం తలెత్తుతుంది. మఱికొన్ని ఘట్టాలు లోకోత్తరమైన మార్మికతతో కూడుకొన్నవి. అవి ప్రజలకి అర్థం కావాలనే ఉద్దేశం రచయితకి నిజంగానే లేకపోవచ్చు. మచ్చుకు-

రాజశ్రీ ఆదికేశవ అనే పేరు మొదలుగాను అన్ని పేర్లు ఇస్తిని. నాకన్న ఘనుని జేస్తిని. శాంతాకారమైన సార్వభౌమంతం, ఆది ఆదిత్య మధ్యమాల మేఘమేకాను కోదండమూర్తి దేవతల సాన్నిధ్యం, రామమూర్తి, వజ్రసింహాసనమూర్తి, పూర్ణమేకో భవతి, భృగునక్షత్త్రదేవమూర్తి, పట్టభద్రుని చేసిన రామమూర్తి, అమౌక్తిక మౌక్తికాభరణాలు ఆనందాశ్రమములు ఇచ్చీని. శతసహస్రాల భోజనాలలోను మా పొత్తుల ప్రసాదం పంపబడుదురు. సకలమైన భోగాలకు నేడే మొదలు. ’అది దివసం, ఆదిదేవమయో మయమ్’ ఆదివేదానకు గురువారమే మొదలు. అన్నిటికి కారణం ఆదవేణికి వచ్చేది. ముప్ఫైయొక్కటి ఆయెను. మేము బ్రహ్మమేకం మొదలైన ఆనందాన ఉన్నారము. ఆషాఢ బహుళ పంచమినాడు ప్రకాశము. రాజశ్రీ రఘునాయకుల ఆనతి, బహుళ సప్తమీ గురువారమని ఆనతిచ్చినారు. రాజ్యమెల్లా కట్టవలెను అని మేమంటిమి. ఆనందాశ్రమముల ఆనతి, ధర్మకాలము వచ్చె గనుక, తామే నడచేరు అని ఆనతిచ్చిరి. శాంతిం కరోమి శాంతి:”

భవిష్యత్తులు చెప్పినా అర్థం కాకపోవడానికి మఱో కారణం ఉంది. అసలు మనమే భవిష్యత్తుని ప్రత్యక్షంగా దర్శించగలిగినా అది మనకు అర్థం కావడం కష్టం. సదరు సంఘటనలకున్న పరిసర ప్రాతిపదికలూ, నేపథ్యాలూ అర్థం కాకపోతే ఆ మనుషులూ, ఆ వస్తువులూ, ఆ సంఘటనలూ దర్శనంలో గోచరించినా సరే, అర్థం కావు. ఉదాహరణకి – విమానాలు లేని కాలంలో ఒకడు ఒక విమానప్రమాదాన్ని ముందే దర్శించగలిగితే ఆ విమానాన్ని అతడు “లోహవిహంగమనీ, దాని పొట్టలో మనుషులున్నా”రనీ వర్ణించగలడు తప్ప అంతకుమించి ముందుకుపోలేడు.

అదే విధంగా కాలజ్ఞానాలు వ్రాయడంలో సహజంగానే కొన్ని ఇబ్బందులున్నాయి ఉంది. అందులో చెప్పబడిన విషయాలు నిజమయ్యాక కూడా అవి సంశయాస్పదంగానే మిగుల్తాయి. భవిష్యత్తుని ఊహించి రాశారనడం సర్వసాధారణంగా వినవచ్చే వ్యాఖ్య. ఎంతటి మేధావికైనా వందలాది సంవత్సరాల భవిష్యత్తుని ఊహించడం సాధ్యం కాదనేది దృష్టిలో ఉంచుకుంటే బ్రహ్మంగారిది ఊహ కాదని విశదమవుతుంది. మనం మన భవిష్యత్తుని ఎంత ఊహించగలమో అంతకంటే చాలా తక్కువే ఊహించగలరు పదిహేడో శతాబ్దపు మనుషులు. భవిష్యత్తు చెప్పడానికి మేధాశక్తి ఉపకరించదు. “జఱిగిపోయిన విషయాల్ని భవిష్యత్తులా వ్రాసి గ్రంథంమధ్యలో ప్రక్షిప్తం (interpolation) చేసి ఇఱికించారనీ, అలా నమ్మించాలని చూస్తున్నా”రనీ ఆరోపించడమూ మామూలే. లేకపోతే “పుస్తకంలో ఏదో రాసుంటే దాన్ని వేఱే దేనికో అంటగట్టి సమన్వయిస్తున్నా”రనే అవకాశం కూడా ఉంది.

Read :  శత్రు దుర్భేద్యమైన గండికోట

కాలజ్ఞానంలోని భవిష్యాలకు సమయక్రమం (chronological order) లేకపోవడం ఒక సమస్య. మఱో అయోమయం – జఱగబోయేవాటిని జఱిగిపోయినట్లుగా, లేదా జఱుగుతున్నట్లుగా అక్కడక్కడ వర్ణించడం. భవిష్య దర్శనుల మనస్తత్త్వాన్ని అర్థం చేసుకుంటే దీన్ని భేదించడం పెద్ద కష్టం కాదు. భవిష్యత్తుని దర్శించగలవారికి అది వర్తమానంలాగానే సజీవంగా అనుభవంలోకి వస్తుంది. వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళు దాన్ని భవిష్యశైలిలో పెట్టి చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే అది మనకి భవిష్యత్తు. కానీ వాళ్ళ మటుకు వాళ్ళకి అది వర్తమానమే. కలియుగాంతంలో జఱగబోతాయని బ్రహ్మంగారు వర్ణించిన విషయాలు చాలావరకు జఱిగాయి. అయితే ఇంకా జఱగాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి కాలజ్ఞాన గోవిందవాక్యాలలో–

ముండమోపులెల్ల ముత్తైదులయ్యేరు…. (విధవా పునర్వివాహం)
నాలుగువేల యెనమన్నూట ముప్పదియేండ్లు
కలియుగాబ్దములు జరిగేనిమా
కలియందు శ్వేతముఖులు దొరలయ్యేరు (తెల్లవారి పాలన)
మెలకువతో రాజ్యమేలేరుమా ||హరిగోవింద గోవింద, శివ గోవింద గోవింద||
బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు
మహిని వేసే దినములొచ్చేనిమా… (రిజర్వేషన్లు)
వావివరుస లేక పొయ్యేరు జగములో…. (మొదలయింది)
అయిదువేల ముప్పదారింటిమీదను
అమితముగ యుద్ధములు జరిగేనిమా (రెండో ప్రపంచయుద్ధం)

కోయరాజ్యంబంత గొడవల పాలవును
కోయనాయకుడతికోపంబుతో
కువలయపతికి పలు కష్టములు కల్గించి
అవనిలో నదృశ్యుడయ్యేనిమా ||హరిగోవింద|| (అల్లూరి సీతారామరాజు) అని వ్రాశారు.

మహాత్మాగాంధీ గుఱించి :

ఉత్తరదేశమున వైశ్యకులమందు
ఉత్తమ గంధొకడు పుట్టేనిమా
హత్తుగ నన్నియు దేశములవారంత
సత్తుగ పూజలు చేసేరుమా ||హరిగోవింద||
లోకమంతయు ఏకంబుగా జేసి
ఏకు పట్టెడువాడు వచ్చేనిమా
ప్రాకటంబుగాను లోకంబులో తాను
మేకై నిలిచి జనుల మేలెంచేనిమా ||హరిగోవింద||

అమెరికా గుఱించి బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తులు ఇంకా నెఱవేఱాల్సి ఉంది. గోవిందవాక్యాలలో ఇలా వ్రాశారు :

భువిలో దక్షిణ అమెరికా దేశమున
భూకంపం బహుగాను బుట్టేనిమా
అదిరిన ఆ నగరమందు సర్వాత్ములు
బెదిరియు నాశనమయ్యేరుమా ||హరిగోవింద||

అందులో నైదు కుటుంబాలవారు
అచటను తప్పియు బ్రతికేరుమా….
కకుతిల్లా (ల్గా ?) నగరము ’కారాము” అవలోక
మగ్ని వల్లను భస్మమయ్యేనిమా
సెగనిప్పుల్ పడి నగరము కారాము
తోడేడు నగరాలు నాశనమయ్యేనిమా ||హరిగోవింద||

అమెరికాలో పుట్టబోతున్న ఒక విశిష్టవ్యక్తి గుఱించి :-

Read :  CHARLES PHILIP BROWN - REVIEVER OF TELUGU

మేలొరు” నగరమునందు కాపరివంశ
మున నొక బాలుడు పుట్టేనిమా
తోలువన్నె ముఖము తెలుపు నలుపు ఛాయ
కల బిడ్డడచటను పెరిగేనిమా ||హరిగోవింద||
ఒక పార్శ్వము తెల్పు ఒక పార్శ్వము నల్పు
సగము వెంట్రుకలు తెల్పు నుండేనిమా
సగము కురులు నలుపై కరిగి పోసిన ప్రతిమ
లాగను కనులు తెలుపై యుండేనిమా ||హరిగోవింద||
సుఖశరీర మధిక బలశాలిగ నుండు
వివేకశాలిగ నుండేనిమా
ప్రకటముగ అమెరికా దేశమునందు
ప్రజలుంచుకొని పాలించేరుమా ||హరిగోవింద||

కలియుగాంతంలో పురుష శిశువులు ఆసనద్వారాలకి దగ్గఱగా ఉన్న వృషణాలతో జన్మిస్తారని బ్రహ్మంగారు వ్రాశారు. ఇటీవల గతకొద్దికాలంగా ఆధునిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఈ పరిణామం గుఱించే భయపడుతున్నారు. మగజీవుల్లో మర్మాంగాలు ఆసనద్వారానికి కొంచెం దూరంగా ఉంటాయి. అయితే సబ్బులూ, షాంపూలు, అత్తరులు, హ్యాండ్ వాషులూ స్త్రీత్వాన్ని పెంపొందించే పదార్థాలతో చేయబడినవి. కనుక సుదీర్ఘకాలంలో అవి మగవారిలో స్త్రీలక్షణాల్ని పెంపొందిస్తాయి. శాస్త్రవేత్తలు భయపడుతున్నది అదే. బ్రహ్మంగారు వ్రాసినది ఇప్పటికే కొన్ని కేసుల్లో బయటపడ్డమే అందుక్కారణం.

వచనకాలజ్ఞానంలోని విషయాలు ఏదో ఒక బృహద్ యుద్ధ పరిణామాల్ని సూచిస్తాయనిపిస్తుంది, ఆ మాట రచయిత స్పష్టంగా చెప్పకపోయినా ! ఆ సమయంలో పిడుగులు (బాంబులు ?) పడి నదులెండిపోతాయంటారు బ్రహ్మేంద్రులు. కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్లు, నిలబడ్డవాళ్లు నిలబడ్డట్లు చనిపోతారంటారు. విషవాయువు (రేడియేషన్ ?) వల్ల లక్షలాదిమంది ఒకేసారి పోతారంటారు. చచ్చినవాళ్ళకు తద్దినాలు పెట్టడానిక్కూడా ఎవరూ మిగలరని, పంచాంగాలు పొల్లుపోతాయని, అర్ధరాత్రి ఆకాశంలో సూర్యుడు (atomic mushroom ?) ఉదయిస్తాడని, అది చూసినవాళ్లు లక్షలాదిమంది గుడ్డివాళ్ళవుతారనీ వర్ణించారు. చావగా మిగిలినవాళ్ళు అడవులకీ, కొండలకీ, గుట్టలకీ చేఱుకొని “కాకిశోకము చేసేరు” అన్నారు. అయినప్పటికీ తనని నమ్మినవాళ్లు ఆ సమయంలో శ్రీ శైలానికి రావలసినదని అక్కడ తాము వారిని తప్పకుండా రక్షిస్తామని అభయమిచ్చారు. అయితే తెలుగేతర జాతులకి ఏ విధమైన అభయమూ ఇవ్వకపోవడం ఆలోచనీయం. ఇందుకు సరైన కారణం తెలియదు. ఎంత నాశనం జఱిగినా రాయలసీమలో జుఱ్ఱేడు దగ్గఱ మళ్ళీ సృష్టి చేయగల యోగులు అవతరిస్తారని, వారు జీవజాతుల్ని పునరుద్ధరిస్తారని ఆయన వ్రాశారు.

వీరబ్రహ్మేంద్రులు వ్రాసిన అన్ని రచనలూ ముద్రితం కాలేదు. అచలవేదాంత సంప్రదాయపు అవధూత అయిన వేమనని కొన్ని విమర్శనాత్మక ఆటవెలదుల ఆధారంగా హిందూధర్మ వ్యతిరేకి అని, నాస్తికుడనీ భ్రమించడం వల్ల ఆయన్ని అతివేలంగా ఉద్ద్యోతించడానికి మొదట బ్రిటిషువారు, తరువాత అభ్యుదయవాదులూ మిక్కిలి ఉత్సాహంతో శ్రమించారు. తెలుగుజాతి చరిత్రలో వీరబ్రహ్మేంద్రుల పాత్ర వేమనని మించినదైనప్పటికీ ఆయన హిందూ మతగురువనే ఉద్దేశంతో పక్కన బెట్టారు. లేకపోతే ఇది అన్ని ప్రపంచభాషలలోకి అనువదించాల్సిన గ్రంథం.

తాడేపల్లి  లలితాబాలసుబ్రహ్మణ్యం

Check Also

chinmayaranyam

Chinmayaranyam – Ellayapalli

Chinmayaranyam (Telugu : చిన్మయారణ్యం)  is an ashram that is located in Ellayapalle at a distance …

kadapa Chennai flight

Kadapa – Chennai Flight Timings

Kadapa to Chennai Flight Timings… List of Flights that are flying in between Kadapa and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *