కడప : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధికి చెందిన భారతి అనే మహిళ 59 ర్యాంకు సాధించడం పట్ల ప్రొద్దుటూరు వాసుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఈమె భర్త సీవీ.శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో పర్యాటక శాఖ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన భారతి 2007 జనవరి 25న శంకర్‌రెడ్డిని వివాహం చేసుకుంది.
గతంలో తహశీల్దార్‌గా పని చేసిన ఈమె గత ఏడాది సివిల్స్ ఫలితాల్లో 274వ ర్యాంకు సాధించడంతో ఐపీఎస్ హోదా లభించింది. ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా భారతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం కఠోర సాధన చేశానన్నారు. వివాహం అయ్యాక భర్త, అత్త ప్రోత్సాహం బాగా లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సరైన ప్రిపరేషన్ లేకుండా పరీక్షలు రాసి అవకాశాలను వృధా చేసుకోవద్దని ఆమె సూచించారు. ప్రణాళిక ప్రకారం చదివితే విజయం సాధించవచ్చన్నారు. పేద ప్రజలకు సేవలు అందించేందుకు తాను అంకితమవుతానన్నారు. ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన దేవిరెడ్డి స్వప్న 322వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ లెక్చరర్ వెంకటేశ్వర్‌రెడ్డి, నిర్మలమ్మ కుమార్తె అయిన ఈమె ఇదివరకే గ్రూప్-1లో ఎంపికై ఇబ్రహీంపట్నంలో ఆర్టీఓగా పనిచేస్తున్నారు. ఈమె సోదరుడు ప్రశాంత్‌రెడ్డి కూడా గతంలో సివిల్స్‌లో 64వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణ పొందుతున్నారు. వచ్చేనెలలో ఈయన శిక్షణ పూర్తి చేసుకుని ఒరిస్సా రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా వెళ్లనున్న నేపథ్యంలో అదే కుటుంబం నుంచి తిరిగి మరొక ఆణిముత్యంగా స్వప్న ఎంపికైంది. ఓ మధ్యతరగతి కుటుంబంలోని ఒకే తల్లి బిడ్డలు ఇద్దరూ సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల సర్వత్రా వారిని అభినందిస్తున్నారు. ఇద్దరూ ఎలాంటి కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో ర్యాంకు సాధించారని వారి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
స్వప్న తల్లి నిర్మలమ్మ ముద్దనూరు బాలికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరు ముద్దనూరులో స్థిరపడ్డారు. ప్రశాంత్ రెడ్డి, స్వప్నలు ప్రాథమిక విద్యాభ్యాసం ముద్దునూరు సాగింది. పదవ తరగతి వరకు ప్రొద్దుటూరు మహర్షి విద్యామందిర్‌లో చదివారు. స్వప్న 1996-98 వరకూ స్థానిక భావన జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ ఇంగ్లీషు మీడియం) చదివింది. ఎంసెట్‌లో అదే సంవత్సరం 180వ ర్యాంకు సాధించి జేఎన్‌టీయూ (హైదరాబాద్)లో బీటెక్ చేరింది. అనంతరం సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌పై దృష్టి సారించింది.
స్వప్న సోదరుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి 1998-2000లో ఇదే కళాశాలలో ఇంటర్ చదివి ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించాడు. స్వప్న ఇంటర్మీడియేట్‌లో 945 మార్కులు సాధించగా ప్రశాంత్‌కుమార్‌రెడ్డి 957 మార్కులు సాధించారు. ఇతను కూడా జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు.
వ్యవసాయ కుటుంబం నుంచి మరో ఆణిముత్యం
ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లెకు చెందిన ఉండేల రామనాథరెడ్డి సివిల్స్‌లో 376వ ర్యాంక్ సాధించారు. తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి వెంకటలక్షుమ్మలు వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్న నారాయణరెడ్డి సూపర్‌బజార్ రోడ్డులో సిమెంటు డీలర్‌షిప్ నిర్వహిస్తున్నాడు. టెన్త్ వరకు స్థానిక రమణమహర్షి హైస్కూళ్లో చదివిన రామనాధరెడ్డి, ఇంటర్, డిగ్రీ స్థానిక ఉస్మానియా కళాశాలలో పూర్తి చేశాడు. హైదరాబాద్ నిజాం కళాశాలలో పీజీ చేసి 2003లో యూనివర్శిటీ గోల్డ్‌మెడల్ సాధించారు. 2003 డీఎస్సీలో జిల్లాలో 2వ ర్యాంక్ సాధించి లింగాల మండలం దొండ్లవాగు హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా పని చేస్తున్నారు.
courtesy: sakshi