న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని తపాలా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వైఎస్ తొలి వర్ధంతి సందర్భంగా సెస్టెంబర్ 2వ తేదీన ఈ స్మారక తపాలా బిళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందింది. దివంగత వైఎస్ స్మారకార్థం తపాలా బిళ్ల విడుదల చే యాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎ.రాజాను న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ కోరారు. ఈ ప్రతిపాదనను రాజా ఆమోదించారు. ఈ విషయాన్ని వీరప్పమొయిలీ రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు తెలియజేస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య స్పందిస్తూ.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి, గొప్ప రాజకీయ నాయకుడైన దివంగత వైఎస్ స్మారకార్థం తపాలా బిళ్ల విడుదల చేయాలని నిర్ణయిం చినందుకు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, రాజాలకు కృతజ్ఞతలు తెలిపా రు.
అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని రెండు కోట్ల పేద, సామాన్య కుటుంబాల సంక్షేమంకోసం చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని, అనేక రాష్ట్రాలు వైఎస్ పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రోశయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించటంతో పాటు, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం సరఫరా, సామాజిక పింఛన్లు వంటి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌దేనన్నారు. ముఖ్యమంత్రి తపాలా శాఖకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు.