హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. శనివారం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. సెప్టెంబరు 20 నుంచి తన రాజీనామాను ఆమోదించాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
రాజీనామాకు, ఉపసంహరణకు దారితీసిన పరిస్థితులను లేఖలో వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో దిగజారుతున్న న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను నిలబెట్టడానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. న్యాయవ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను పునః ప్రతిష్ఠించడానికి ఎవరో ఒకరు కొంతమేరకైనా తమ వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉందని భావించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజీనామా నిర్ణయంపై వచ్చిన ప్రతిస్పందనలను చూశాక దీనిపై పట్టుబట్టలేక పోయానని అన్నారు. ‘ఈ వ్యవస్థ నుంచి బయటికి వెళ్లటం కంటే ఈ బాధ్యతలు నిర్వరిస్తూ కొనసాగడం వల్లనే పోయిన ప్రతిష్ఠను నిలబెట్టడానికి వీలవుతుందన్న విషయాన్ని మీరంతా అర్థమయ్యేలా వివరించారు’ అన్నారు.
ప్రధాన న్యాయమూర్తి రాకతో వచ్చిన మార్పుల నేపథ్యంలో శుక్రవారం కోర్టు కార్యకలాపాలు సజావుగా కొనసాగడంతో వ్యవస్థ ప్రతిష్ఠ పునరుద్ధరణ ఆశలు చిగురించాయని చెప్పారు. అందుకే కొనసాగడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆపత్కాలంలో కొండంత అండగా నిలబడి, మార్గదర్శనం చేసినందుకు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.