కడప, 25 ఫిబ్రవరి: యోగి వేమన విశ్వవిద్యాలయానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ. 7 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో విశ్వవిద్యాలయంలోని రెండవ దశ అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఈ కేటాయింపుల వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దు స్థితి ఉత్పన్నం కానుంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులు నిలిచిపోతే వైవీ యూకు యూజీసీ గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు.
దీంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారనుంది. విశ్వవిద్యాలయంలో రెండ వ దశ పనుల్లో భాగంగా ఆర్ట్స్ బ్లాక్, సెంట్రల్ లైబ్రరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఎగ్జామ్స్ హాలు, మేనేజ్‌మెంట్ బిల్డింగ్, హ్యూమానిటీస్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు.
2008-09 బడ్జెట్‌లో రూ. 36 కోట్ల కేటాయింపులకు హామీ ఇవ్వగా, 17.50 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2009-10 బడ్జెట్‌లో 39 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది మాత్రం 9.75 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రెండు బడ్జెట్‌లకు సంబంధించి రూ. 47.75 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపు లు చేశారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయల బిల్లులు రాకపోవడం వల్ల రెండవ దశ పనులు నిర్వహిస్తున్న నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ పనులు నిలిపివేసి తట్టాబుట్టా సర్దుకుంటోం ది. ప్రొద్దుటూరులోని వైవీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల పనులకు సంబంధించి కూడా సుమారు రూ. 6 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
గత సంవత్సరానికి సంబంధించి రూ. 14 కోట్ల బ్లాక్ గ్రాంట్ వైవీయూకు రావాల్సి ఉంది. యేటా పది శాతం బ్లాక్ గ్రాంట్ పెంచాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్‌లో ఈ యేడు ఏడు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడంపై వైవీయూ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగైతే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని వారు వాపోతున్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో:
రాష్ట్ర బడ్జెట్‌లో వైవీయూకు నామమాత్రంగా కేటాయింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా కడప-పులివెందుల రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా జాయింట్ సెక్రెటరీ భాస్కర్ మాట్లాడుతూ వైవీయూ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన 47.75 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో వైవీయూకు అన్యాయం జరుగుతున్నప్పటికీ జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చోద్యం చూ డడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు రాబట్టకపోతే ప్రజా ప్రతి నిధులను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామన్నారు. అన్ని కళాశాలల విద్యార్థులను సంఘటిత పరిచి జిల్లా బంద్‌కు పిలుపునిస్తామని తెలిపారు.
రాజధానిలో వీసీ సంప్రదింపులు:
వైవీయూకు బడ్జెట్‌లో అవసరమైన నిధులు రాబట్టేందుకు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి. నారాయణరెడ్డి ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు. వైస్ చాన్స్‌లర్ ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఆర్థికశాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో సంప్రదింపులు చేశారని వెల్లడించారు. అలాగే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారని, విద్యార్థులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో విద్యార్థులు శాంతిం చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు చెన్నయ్య, ఈశ్వరయ్య, రామాంజనేయులు, నాగరాజు, నాగమణి, పద్మావతి, స్వప్న, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
భయపడాల్సిన అవసరం లేదు : వీసీ
రాష్ట్ర బడ్జెట్‌లో యోగివేమన విశ్వవిద్యాల యానికి అరకొరగా నిధులు కేటాయించారని విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని వీసీ ఏఆర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం లో పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నా తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల కలత చెందడం సహజమేనన్నారు. రెండు రోజులుగా తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యామండలి అధికారులను కలసి చర్చించానన్నారు. ఇందుకు వారంతా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
మంత్రి అహ్మదుల్లా కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమైనప్పుడు కూడా వైవీయూకు కేటాయించిన బడ్జెట్ విషయం వారి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామని తెలిపారన్నారు.
– సాక్షి