Tourist Attractions

భక్తులతో పోటెత్తిన పుష్పగిరి

పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగిన అక్షయ తృతీయ ఉత్సవాలకు హాజరైన భక్తులతో పుష్పగిరి పోటెత్తింది. పంచనదీ సంగమమైన పెన్నానదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి అక్షయ తృతీయ రోజున శివకేశవులను భక్తితో పూజిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణ గాథ. దీంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించి కాయకర్పూరాలు సమర్పించారు. తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. కొందరు మహిళలు స్వామి వారి ఎదుట సాష్టాంగ ప్రదక్షిణలతో మొక్కులను తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్య ప్రాప్తిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఆదివారం అనేకమంది పెన్నానదిలో పిండ ప్రదానం చేశారు.

పూలంగి సేవలో చెన్నకేశవుడు

Read :  Kadapa getting ready for the big family fight

శ్రీ చెన్నకేశవస్వామికి వేద పండితులు అల్‌ దీక్షిత్‌, ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో పూలంగి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు ధరింపజేసి సకల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ముళ్లోకాళ్లోని సకల తీర్థాలు, భగవంతుడైన శ్రీహరి ఆజ్ఞ వల్ల పూరింపబడిన శంఖం, దైత్య నాశనాన్ని కోరే గద, రాక్షసులను అంతమొందించే సుదర్శన చక్రాలను ధరించి అభయహస్తంతో భక్తులను ఆనందంతో ఆశీర్వదిస్తున్న స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శ్రీకామాక్షి వైద్యనాథస్వామి ఆలయంలో అర్చకులు రమణమూర్తి, శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.గరడ వాహనంపై ఊరేగిన స్వామి వారు రాత్రి శ్రీ చెన్నకేశవస్వామి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పుష్పగిరి మాడ వీధుల గుండా స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శివ, చెన్నకేశవ నామస్మరణలతో పుష్పగిరి మారుమ్రోగింది. శ్రీ వైద్యనాథస్వామి నందివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోనూ, మడుగు వద్ద వల్లూరు, పెండ్లిమర్రి ఎస్‌ఐలు తబరేజ్‌, ఈశ్వర్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లో పాల్గొన్న మల్లికార్జున అనే హోం గార్డు వడదెబ్బకు గురికాగా, వైద్య సిబ్బంది చికిత్సలు చేశారు.

Read :  Gandi Kshetram - Veeranjaneya Swamy Temple

భారీగా అన్నదానం

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు వివిధ కుల సంఘాలు, వివిధ గ్రామాలకు చెందిన దాతలు భారీగా అన్నదానం నిర్వహించారు. పలువురు దాతలు మినరల్‌ వాటర్‌ ప్యాకెట్లు, శీతలపానీయాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. గాలివారిపల్లె, ఎ ఓబాయపల్లె, సి కొత్తపల్లె గ్రామాలకు చెందిన దాతలు పది ట్రాక్టర్ల ద్వారా వల్లూరు బస్టాండు నుంచి పుష్పగిరి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులను ఉచితంగా తరలించారు.

నేడు కళ్యాణోత్సవాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 10.30 గంటలకు శ్రీ కామాక్షి వైద్యనాథస్వాములకు ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం శ్రీ చెన్నకేశవస్వామికి శ్రీదేవి, భూదేవిలతో ముత్యాల తలంబ్రాల కళ్యాణోత్సవం జరుగుతుంది. అనంతరం స్వామి వారికి ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు

Check Also

దేవునికడపలో వైభవంగా ధ్వజారోహణం

దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా …

One comment

  1. Excellent article. I really obsessed by the spiritual concepts mentioned in the article. KEEP IT UP!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *