దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజను నుంచి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తోంది. అయినా ప్రతి రైల్వే బడ్జెట్టులో డివిజనుకు అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాకు మొండి చేయి మిగులుతోంది. గత రైల్వే బడ్జెట్టులో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు కేటాయింపులు జరిగాయి. ఈ సారి బడ్జెట్టులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో దిక్కుతోచడం లేదు. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కడప జిల్లాకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది.
గత ఏడాది సెప్టెంబరు 1న కడప-బెంగుళూరు మధ్య రైలు మార్గం పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి 2011 ఏప్రిల్ తరువాత అడిగినన్ని కొత్తరైళ్లు ఇస్తామని సభాముఖంగా ఘనంగాప్రకటించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు కొత్తగా స్టాపింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్‌ఫాస్ట్, మెయిల్, ముంబై-చెన్నై మధ్య దాదర్, మూడు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన ప్రయాణికులు ఈమార్గంలో అధిక సంఖ్యలో ముంబై వెళుతున్నారు. టిక్కెట్లు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో మరో మూడు కొత్త రైళ్లు నడిపినా తగ్గనంత రద్దీ ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కనీసం ఒక్క కొత్త రైలు అయినా దక్కుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు.
కడప- బెంగళూరు రైలు మార్గం
నిర్మాణ పనులకు 2010 సెప్టెంబరు 1న రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. కడప-బెంగళూరు రైలు మార్గానికి 2009-10 బడ్జెట్టులో రూ. 29 కోట్లు మాత్రమే కేటాయించారు. 2010-11 బడ్జెట్టులో రూ. 40 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మొత్తం రూ. 1023 కోట్లు వ్యయం అవుతుంది. కొత్త బడ్జెట్టులో కేటాయింపులు భారీగా ఉంటేనే మంత్రి చెప్పినట్లు ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం సాధ్యపడుతుంది.నంద్యాల- ఎర్రగుంట్ల మధ్య 123 కి.మీ రైల్వే లైను నిర్మాణానికి 2002లో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రెండో దశ కింద రూ.150 కోట్ల వ్యయంతో నొస్సం నుంచి బనగానపల్లి వరకూ పనులు కొనసాగుతున్నాయి. నంద్యాల వరకూ రైలు మార్గం పూర్తికావడానికి రూ.214 కోట్లు అవసరం కాగా గత బడ్జెట్టులో రూ.80 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం బడ్జెట్టులో కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే 2012 కల్లా మొత్తం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
గుత్తి-రేణిగుంట డబ్లింగ్ పనులు
గుత్తి-రేణిగుంట డబ్లింగ్ పనులకు గత బడ్జెట్టులో రూ.60 కోట్లు కేటాయించారు. డబ్లింగ్ పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్టులో సుమారు రూ.40 కోట్లు కేటాయిస్తే డబ్లింగ్ పనులు పూర్తి కానున్నాయి. 2012 నుంచి రెండు లైన్లలో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది.
ఓబుళవారిపల్లి- కృష్ణపట్నం రైలు మార్గం
ఓబుళవారిపల్లి- కృష్ణపట్నంమధ్య రూ. 732 కోట్ల వ్యయంతో రైలు మార్గం నిర్మించాల్సి ఉంది. 2008-09 బడ్జెట్టులో రూ.95 కోట్లు, 2009-10 బడ్జెట్టులో రూ.50 కోట్లు కేటాయించారు. 2010-11 లో మాత్రం రూ.69 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్టులో కేటాయింపులు పెరుగుతాయా? తగ్గుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రొద్దుటూరు- కంభం రైల్వే లైను
మైదుకూరు-పోరుమామిళ్ళ పట్టణాల మీదుగా ప్రొద్దుటూరు- కంభం మధ్య 130 కి.మీ మేర రైల్వే లైను ఏర్పాటుకు గత బడ్జెట్టులో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు వ్యయం కానుంది. ప్రస్తుత బడ్జెట్టులో కేటాయింపులు జరిగేలా రైల్వే మంత్రిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
గిద్దలూరు-భాకరాపేట రైలు మార్గం
గిద్దలూరు నుంచి పోరుమామిళ్ల, బద్వేలు, సిద్దవటం మీదుగా భాకరాపేట వరకూ కొత్త రైలు మార్గం నిర్మాణానికి వీలుగా 2010-11 బడ్జెట్టులో సర్వేకు అనుమతి లభించింది. ఈ మార్గానికి కొత్త బడ్జెట్టులో కాస్తయినా నిధులు కేటాయిస్తే పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
సికింద్రాబాద్- కర్నూలు మధ్య తిరుగుతున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకూ పొడిగించాలని ఏళ్ల తరబడి నుంచి జిల్లా వాసులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రైల్వే బడ్జెట్టు సందర్భంగా కూడా ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. సికింద్రాబాద్ నుంచి ఎగ్మోర్ మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ రైలును మధురై మీదుగా త్రివేండ్రం వరకూ పొడిగించాలని గత రైల్వే బడ్జెట్టు సందర్భంగా అభ్యర్థించారు. ప్రస్తుత బడ్జెట్టులోనైనా మోక్షం లభిస్తుందన్న ఆశతో జనం ఉన్నారు.
షిర్డీ నుంచి తిరుపతి మధ్య రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త రైలు వేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై పట్టించుకునే నాథుడు లేడు. ఓకా-రామేశ్వరం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు కడపలో అధికారికంగా స్టాపింగ్ లేదు. దీంతో షిర్డీ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లను ఒంటిమిట్టలో ఆపాలని కొన్నేళ్లుగా జిల్లా వాసులు కోరుతున్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మధురై-కోపర్‌గావ్ మధ్య 2010-11 బడ్జెట్టులో కొత్తగా పర్యటక రైలు మంజూరైంది. వేసవిలో మాత్రమే నడిచే ఈ రైలుకు కడపలో స్టాపింగ్ లేదు. దీంతో షిర్డీ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైల్వే మంత్రి ఈ అంశంపై చొరవ చూపి జిల్లా ప్రజల మొర ఆలకించాల్సిన అవసరం ఉంది.