ఇడుపులపాయ : కాంగ్రెస్ పార్టీకి, కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ జగన్‌ను ఓదార్చేందుకు మంగళవారం (నవంబర్ 30)ఇడుపులపాయకు జనం తండోపతండాలుగా కదిలి వచ్చారు. మీకు అండగా మేమున్నామంటూ జనం ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది వైఎస్ అభిమానులు ఇడుపులపాయకు ఇంకా తరలివస్తున్నారు. జగన్‌తో పాటు ఆయన తల్లి విజయలక్ష్మిని సైతం అభిమానులు కలసి మీకు అండగా మేముంటామని అంటున్నారు. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జగన్ హైదరాబాద్ నుండి మంగళవారం తెల్లవారుజామున ఇడుపులపాయకు చేరుకున్నారు. అతనిని అభినందించేందుకు వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చారు. హైదరాబాద్, కర్నూలు, వరంగల్, కరీంనగర్, నల్గొండ, చిత్తూరు, అనంతపురం, ఆదిలాబాద్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, మెదక్ ఖమ్మం, తదితర జిల్లాల నుండి ప్రజలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఇడుపులపాయకు చేరుకుని జగన్‌ను అభినందించారు.అభిమానులు ‘వైఎస్సార్ అమర్హ్రే.. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఇంటి ప్రాంగణంలో ప్రతి పదినిమిషాలకు గుమికూడే ప్రజలు జగన్ కోసం ఈలలు, కేకలు వేస్తూ వచ్చారు.
వేలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ వాహనాల్లో మంగళవారం తెల్లవారుజామున నుంచే ఇడుపులపాయకు చేరుకున్నారు. వేంపల్లె మార్గం నుంచి ఇడుపులపాయ వరకు వందలాది వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా జగన్ బస చేసిన అతిథి గృహం చుట్టూ వేలాది మంది జనం అతనిని చూడడానికి, ఓదార్చడానికి ఎగబడ్డారు. ఆ పక్కనే మరో అతిథి గృహంలో ఉన్న వైఎస్ సతీమణి విజయమ్మను చూడడానికి కూడా నేతలు, కార్యకర్తలు క్యూకట్టారు. జనం ఇరువురు నేతలతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పోలీసులు జనాలను అదుపు చేయలేక పోవడంతో జగన్, విజయమ్మ కారిడార్ల నుంచే నేతలను, కార్యకర్తలను అభినందించడంతో పాటు చేతలు జోడించి అభివాదం చేశారు. ఇద్దరు నేతలు తమ అతిథి గృహాల నుంచి ప్రతి అర్ధగంటకు ఒకమారు జనాలకు అభివాదం చేస్తూ, ఒక పక్క నేతలతో చర్చలు కొనసాగించారు.
వీరి వెంట షర్మిలా, అనిల్, భారతి, మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి తదితరులు ఉన్నారు. జగన్ కలసిన వారిలో ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, సినీనటుడు విజయ చందర్, అనంతపురం జడ్పీ ఛైర్ పర్సన్ కవిత, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పుల్లా పద్మావతి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు , శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్తియార్ ఉన్నారు. స్థానిక నేతలు తమతమ అనుచరులతో వాహనాల్లో పెద్ద ఎత్తున ఇడుపులపాయకు తరలివచ్చారు.
జగన్ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…