అరుదైన కలివికోడి కోసం మళ్లీ వెతుకులాట ప్రారంభం కానున్నది.. ఇందుకోసం ‘ఆపరేషన్ కలివికోడి’ సిద్ధమవుతోంది… 1986లో కనిపించిన కలివికోడి తిరిగి కనిపించలేదు… ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది… ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కడప డీఎఫ్‌ఓకు ఆదేశాలు అందాయి.. ముంబైకి చెందిన శాస్త్రవేత్తలు త్వరలో కడపకు రానున్నారు..
కడప జిల్లా ప్రత్యేకతల్లో కలివికోడి ఒకటి.. ప్రపంచంలోనే ఇది అరుదైన పక్షి.. కనిపించినట్టు కనిపించి మాయమైన ఈ పక్షి గురించి చాలా ఏళ్లుగా పరిశోధనలు, పరిశీలనలు జరుగుతున్నాయి.. కలివికోడి జీవన విధానాలను తెలియజెప్పేందుకు ‘ప్రాజెక్టు కలివికోడి’ చేపట్టనున్నారు.. ఇందుకోసం అటవీ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణపై హైదరాబాద్‌లో అటవీశాఖ పీసీసీఎఫ్ మల్హోత్ర, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి సైంటిస్టు డాక్టర్ రెహమాన్ ఇటీవల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి కడప అటవీ డివిజనల్ అధికారి వినోద్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం ఆదేశాలందాయి. ఈ మేరకు ప్రాజెక్టు కలివికోడి నిర్వహణకు అవసరమైన వివిధ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మరో నాలుగురోజుల్లో ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నతాధికారులకు అందిస్తామని డిఎఫ్‌ఓ వినోద్‌కుమార్ తెలిపారు.
కలివికోడి ఉనికి
అంతరించిపోతున్న జాతుల్లో అతి అరుదైన కలివికోడి ఉనికిని బాంబేకు చెందిన డాక్టర్ సలీంఅలీ అనే పక్షుల శాస్త్రవేత్త మొదటిసారిగా 1986 ప్రాంతంలో గుర్తించాడు. బద్వేలు, అట్లూరు సరిహద్దుల్లో వున్న లంకమల అటవీ ప్రాంతంలో ఐలయ్య అనే వ్యక్తికి ఓ పక్షి దొరికింది. దీనిని డాక్టర్ సలీంఅలీ పరిశీలించి కలివికోడిగా నిర్ధారించారు. రెండురోజులు మాత్రమే కలివికోడి జనావాసప్రాంతంలో జీవించగలదని అందువల్లనే ఈ పక్షిజాతి అంతరించిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అరుదైన ఈ పక్షిని రక్షించేందుకు అప్పటి నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇంత వరకు కలివికోడి తిరిగి కనిపించ లేదు. అటవీ ప్రాంతంలో లభించిన ఆధారాల మేరకు కలివికోడి ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నారు. ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియచెప్పేందుకు భారతప్రభుత్వం అటవీశాఖ ‘ఆపరేషన్ కలివికోడి’ని సిద్ధంచేసింది.
ప్రత్యేక పరిశోధనలు
కలివికోడి విషయంలో ప్రత్యేక పరిశోధనలు నిర్వహించేందుకు ముంబైకి చెందిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సైంటిస్టులు త్వరలో కడపకు రానున్నారు. వీరంతా మూడునెలల పాటు బద్వేలు, అట్లూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కలివికోడి జీవన విధానంపై ప్రత్యేకంగా పరిశోధిస్తారు.
ఆపరేషన్ కలివికోడి ఉద్దేశం
కలివికోడిని 1986లో గుర్తించాక ఇంత వరకు దాని ఆనవాళ్లు కనిపించలేదు. కొండకింది భాగాల్లో కలివికోడి నివసిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆనవాళ్లతో పాటు, కలివికోడి పూర్తి జీవన విధానాన్ని, అలవాట్లను, కాలపరిమితి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంకోసం ‘ప్రాజెక్టు కలివికోడి’ చేపట్టనున్నారు. ఇందు కోసం లంకమల అటవీ ప్రాంతంలోని ఆరువేల హెక్టార్లను గుర్తించారు. అటవీ ప్రాంతంలో ఇతరుల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఎలాంటి శబ్దాలకు తావివ్వకుండా ఎంపిక చేసిన అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు. అలాగే, అటవీప్రాంతంలో రేయింబవళ్లు జరిగే పక్షుల సంచారం, ఇతర ప్రాణుల సంచారాన్ని క్షణక్షణం చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా రూపొం దించిన హీట్‌సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రాణి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా హీట్ సెన్సార్ కెమెరా పని చేస్తుంది. కెమెరా ముందు ప్రాణి ఎంతసేపు ఉంటుందో అంతసేపు కెమెరా క్లిక్‌మంటూనే ఉంటుంది. దీంతో పాటు అటవీ ప్రాంతాల సరిహద్దులో ఉన్న గిరిజనులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ కలివికోడి పర్యవేక్షణ, రక్షణకు బర్డ్ ట్రాకర్స్‌ను నియమిస్తారు. పరిశోధనల కోసం రూ.2.5కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కలివికోడిని ప్రపంచానికి చూపించాలనే
అరుదైన కలివికోడి పక్షిని ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ‘ప్రాజెక్టు కలివికోడి’ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి లభించి నిధులు మంజూరైన వెంటనే పరిశోధనలు ప్రారంభిస్తాం. కలివికోడి ఎలా ఉంటుంది, ఎంతకాలం జీవిస్తుంది, జీవన విధానం ఎలా ఉంటుంది అన్న అంశంపై బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి సైంటిస్టులు పరిశోధనలు నిర్వహిస్తారు. కలివికోడి గురించి పూర్తిస్థాయిలో తెలియచెప్పే ఈ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహిస్తాం.
– వినోద్‌కుమార్, డిఎఫ్‌ఓ