మైదుకూరు: కెపి ఉల్లిపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు కెసి కెనాల్ పూర్తి ఆయకట్టుకు ఏప్రిల్ 30 వరకు నీరు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖ వ్రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ లేఖను ఫ్యాక్స్‌ద్వారా పంపడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో కెపి ఉల్లిని ఈ ఏడాది 8 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారని, అధిక వర్షాలు, వరదలు, తెగుళ్ల వల్ల తక్కువ పంట దిగుమతి రావడంతో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని లేఖలో తెలిపారు.
ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో కెపి ఉల్లి ధర రూ.4500 అమ్ముడుపోతుండగా వ్యాపారులు కుమ్మకై్క రూ.2200లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఉల్లి ఎగుమతులపై జనవరి 15 వరకు నిషేధం విధించడంతో రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని లేఖలో వాపోయారు.
దేశీయంగా కెపి ఉల్లిని ఆహారంగా తీసుకోరనే విషయాన్ని రైతాంగం బాధలను దృష్టిలో ఉంచుకొని కెపి ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రిని కోరారు. కెసి కాల్వ కింద కర్నూలు, కడప జిల్లాలో 2,65,628 ఎకరాలు ఆయకట్టు ఉందని అందులో 1,11,584 ఎకరాలకు మాత్రమే రబీ సీజన్‌లో నీరు విడుదల చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో కెసి రైతాంగం ఆందోళనకు గురౌతుందని విన్నవించారు. దీనివలన 1,54,034 ఎకాలకు ప్రభుత్వం నీరు ఇవ్వలేదని స్పష్టమైందన్నారు. దీంతో కడప, కర్నూలు రైతాంగం ఆందోళన చెందుతోందని రెడ్యం వెంకట సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
శ్రీశైలం జలాశయం సామర్థ్యం 885 అడుగుల కాగా నేడు శ్రీశైలం జలాశయంలో 883 అడుగులు, 252 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు.
గతేడాది ఖరీఫ్ సీజన్‌లో జులై 25 నుంచి నీరు ఇచ్చినా మొదటి నుంచి చివరి ఆయకట్టుకు నీరు చేరక పైర్లు పెట్టుకోలేక పోయారని ఆయన తెలిపారు. అదీ కాక అకాల వర్షాలు, వరదలు, తెగుళ్లతో పైర్ల దిగుబడి తగ్గడమే కాక కొన్ని ప్రాంతాల్లో అసలు పైర్లే చేతికి రాలేదని ఆయన లేఖలో వాపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో కెసి రైతాంగం రబీ సీజన్‌పైనే ఆశలు పెట్టుకున్నందున శ్రీశైలంలో పూర్తి స్థాయి నీరు ఉన్నందున రబీలో పంటలు పెట్టుకొనేందుకు వీలుగా ఏప్రిల్ 30 వరకు నీరు ఇవ్వాలని రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆ లేఖలో ముఖ్యమంత్రిని అభ్యర్తించారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోకుంటే రైతాంగ ఉద్య మాలు తప్పవని హెచ్చరించారు.