రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మూడు రోజులుగా చోటుచేసుకున్న సంఘటనలపై తీవ్రంగా కలత చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం. గురువారం జస్టిస్ నాగార్జునరెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూకు పంపారు. రాష్ట్రపతికి పంపడానికి వీలుగా మరో లేఖను దీంతోపాటు జతచేసినట్లు తెలిసింది. జస్టిస్ నాగార్జునరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు.
1979లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్లో నమోదు చేసుకున్న జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా 2006 సెప్టెంబరు 11న బాధ్యతలు స్వీకరించారు. 27 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందించారు.
గురువారం మధ్యాహ్నం జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కోర్టు హాలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల న్యాయవాదుల మధ్య వివాదం మొదలైంది. దీంతో పలువురు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కోర్టుకు వెళ్లి న్యాయవాదులతో చర్చించి రాజీ చేశారు. ఈ పరిణామం అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రాజీనామా లేఖను ప్రధాన న్యాయమూర్తికి పంపి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో కూడా పాల్గొనలేదు. ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ.. జస్టిస్ నాగార్జునరెడ్డి రాజీనామా పత్రాన్ని పూర్తిగా చదివి వినిపించారు. ఇక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ నౌషద్‌అలీలతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయడానికి న్యాయమూర్తులందరూ ఏకగీవ్రంగా అంగీకరించినట్లు తెలిసింది.
నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూతోపాటు పలువురు జస్టిస్ నాగార్జునరెడ్డిని కోరినట్లు తెలిసింది. నిర్ణయం ఉపసంహరణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఆయన మనస్సు మార్చుకోలేదని తెలిసింది. రాజీనామాను అంగీకరించడంలేదని, శుక్రవారం యథావిధిగా కోర్టుకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రాజీనామా నేపథ్యమిదీ…
తెలంగాణ న్యాయవాదులు 42 శాతం వాటా కోసం మూడురోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కోర్టు హాలులోకి వారు ప్రవేశించి కోర్టు విధులు అడ్డుకున్నారంటూ రిజిస్ట్రార్ జనరల్ అనుమతితో పోలీసులకు కోర్టు అధికారి ఫిర్యాదు చేశారు. విద్యుత్ దీపాలు ఆర్పేసి అనుచితంగా ప్రవర్తించారని, ప్లకార్డులను విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిపారు. రెండో రోజు పటిష్ఠమైన భద్రత ఉండటంతో నాగార్జునరెడ్డి కోర్టులోకి వారు వెళ్లలేదు. మూడో రోజైన గురువారం కోర్టు నిర్వహిస్తుండగా ఆటంకపరచడానికి విఫలయత్నం చేశారు. ఉదయం జస్టిస్ టి.మీనాకుమారి సర్దిచెప్పడంతో వెళ్లిపోయిన న్యాయవాదులు మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో మరోసారి నినాదాలతో దూసుకువచ్చారు. ఈ సంఘటనల నేపథ్యంలో జస్టిస్ నాగార్జునరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతిష్ఠను కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో…
ఈ న్యాయస్థానంపై పట్టుబిగించిన అసాంఘిక శక్తుల స్వైరవిహారం నుంచి న్యాయవ్యవస్థకు, అమాయకపు న్యాయవాదులకు రక్షణగా నిలబడలేని నిస్సహాయత రాజీనామాకు పురిగొల్పింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతిష్ఠను కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్న నేను న్యాయమూర్తిగా కొనసాగలేను.
– జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి