Tourist Attractions
సీమలో సాగుయోగ్యమైన భూమిలో కేవలం 7 శాతానికి మాత్రమే నికర జలాలు అందుతున్నాయి. అదే కోస్తాలో 80 శాతం భూమికి నికర జలాలు అందుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు ద్వారా కొంత వరదనీటిని సీమ అవసరాలకు తీసుకొంటుంటే తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంత నాయకులు ఏకమై వ్యతిరేకించారు. కనీసం ఇప్పుడైనా రాయలసీమ నాయకులు ప్రత్యేక రాష్ట్రాల గొడవలతో సంబంధం లేకుండా మొదట శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమ హక్కుల కోసం ...

రాయలసీమకు ఏమిచ్చింది శ్రీబాగ్‌!

నీళ్లు రాలేదు, రాజధాని తరలిపోయింది

వ్యాస రచయిత అప్పిరెడ్డి హరినాథ రెడ్డి

రాయలసీమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో జనవరి 27, 1934న జస్టిస్‌ పార్టీ ప్రముఖులు సీహెచ్‌ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం వంటి వారు ‘రాయలసీమ మహాసభ’ ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం జనవరి 28న ఈ సంఘం ప్రథమ సమావేశం మద్రాసులో జరిగింది. కడప జిల్లా నాయకుడు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు.

ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన క్రమం గుర్తుకు రావడం అనివార్యం. ఆ క్రమంలోని ఒక కీలక సందర్భంలో రూపొందినదే శ్రీబాగ్‌ ఒప్పందం. రాయలసీమ ఆంధ్రరాష్ట్రంలో ఉండడమా? మద్రాసు (నేటి తమిళనాడు) రాష్ట్రంలోనే కొనసాగడమా? లేక ప్రత్యేక రాయలసీమగా మిగిలి ఉండడమా? అన్న సందిగ్ధంలో కుదిరిన చరిత్రాత్మక ఒప్పందమిది. నవంబర్‌ 16, 1937న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం ‘శ్రీబాగ్‌’లో (మద్రాసు) జరిగిన ఈ ఒప్పందం రాయలసీమ హక్కులపత్రం కూడా. కానీ ఇది రాయలసీమకు చేసిన మేలు ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ‘శ్రీబాగ్‌’ ఊపిరి ఇచ్చినా సీమకు ఏమీ ఇవ్వలేకపోయింది.

ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని ‘జాతీయోద్యమంలో ఉప జాతీయోద్య మం’ అని వ్యాఖ్యానించారు ‘కాంగ్రెస్‌ చరిత్ర’ రచయిత డాక్టర్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య. చాలా ఉద్యమాల మాదిరిగానే చరిత్ర, రచనలు, పత్రికలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి పునాదులు నిర్మించాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రుల భూభాగం 58 శాతం, జనాభా 40 శాతం. అయినా ఆంధ్రులంటే దేశం దృష్టిలో ‘మద్రాసీ’లే. అప్పుడే 1911లో ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో ‘ది హిందూ’ ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడైంది.

కొద్ది నెలల ముందు చిలుకూరి వీరభద్రరావు రచన ‘ఆంధ్రుల చరిత్ర’ను విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ప్రచురించి అప్పటికే ఒక అవగాహన తెచ్చింది. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లకీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. మళ్లీ 1912లో కొండా వెంకటప్పయ్య, కె.గురునాథం ఆంధ్రోద్యమం’ అన్న చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు.

ఆ సంవత్సరం మే నెలలో వేమవరపు రామదాసు అధ్యక్షతన నిడదవోలు (పశ్చిమ గోదావరి)లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ సమావేశంలోనే చట్టి నరసింహారావు సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, సైన్యంలో, ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా తీర్మానించారు. ఈ భావనలకు ‘దేశాభిమాని’, ‘భరతమాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’ మద్దతు పలి కాయి. ఒక కదలిక మొదలైంది.

ఆంధ్రమహాసభ

నిడదవోలు సభ నిర్ణయం మేరకు 1913, జూన్‌ 26నబాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. కానీ ఇలాంటి తీర్మానానికి సమయమింకా ఆసన్నం కాలేదని, వచ్చే సమావేశాలలో చర్చిద్దామని పలువురు పెద్దలు వాయిదా వేశారు. విశాఖ ఉత్తర ప్రాంతాలు, గంజాం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వ్యతిరేకత ఉండేది. ఈ అంశంలో రాయలసీమవాసులు అభిప్రాయాలు తెలుసుకుని, వారిని కూడా సానుకూలురను చేసుకోవాలని సభ అభిప్రాయపడింది.

Read :  యో.వే.విశ్వవిద్యాలయానికి నామమాత్ర కేటాయింపులు

ఇదే కాకుండా 1907లోనే ఏర్పడిన దత్తమండలాల యువక సాంఘిక సభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటువల్ల రాయలసీమకు ఒరిగే ప్రయోజనం ఏమీలేదని ప్రచారం చేసేది. అయినా న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన, 1914, ఏప్రిల్‌ 11న బెజవాడలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభ ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించింది. 1915 మే నెలలో విశాఖపట్నంలో మూడవ ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ సమావేశానికి పానగల్‌ రాజా అధ్యక్షత వహించి, ఆంధ్ర రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగించారు. 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరగాలని, సభలలో తెలుగులోనే మాట్లాడాలని, బోధన భాషగా తెలుగు ఉండాలని సభ తీర్మానించింది.

1916 నాటి కాకినాడ ఆంధ్ర మహాసభ (నాల్గవది) ప్రపంచ యుద్ధం కారణంగా ఈ అంశాన్ని చర్చించలేదు. 1917 జూన్‌ 1వ తేదీన నెల్లూరులో ఐదవ ఆంధ్ర మహాసభ జరిగింది. కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో ఆంధ్ర రాష్ట్ర విషయమై రాయలసీమ, సర్కారు జిల్లాల నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. నెల్లూరు ప్రాంత నాయకుడు ఎ.ఎస్‌.కృష్ణారావు, రాయలసీమ నాయకులు కొందరు వ్యతిరేకించినప్పటికీ తీర్మానం నెగ్గింది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఇతర జాతీయ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వైపు మొగ్గారు. కేశవపిళ్లై, ఏకాంబర అయ్యర్‌ లాంటి సీమనాయకులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆది నుంచి వ్యతిరేకంగా ఉండేవారు. నిజానికి మొదట ఐదు ఆంధ్ర మహాసభలలోనూ నెల్లూరు, రాయలసీమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. మద్రాసులో ఉండడమే మేలని వీరిలో ఎక్కువ మంది అభిప్రాయం. 1918 తరువాత జాతీయోద్యమం ఉధృతం కావటంతో ఆంధ్రోద్యమానికి విరామం తప్పలేదు.

ఆదిలోనే మోసం

ఆంధ్ర మహాసభ ప్రారంభం నుంచీ కోరుతున్నది’ఆంధ్ర విశ్వవిద్యాలయం’ ఏర్పాటు. అనేక ఆటంకాలను అధిగమించి 1925, ఆగస్టు 20న శాసనమండలిలో బిల్లు సిద్ధమై సెలెక్ట్‌ కమిటీకి వచ్చింది. విశ్వవిద్యాలయాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రతిపాదనపై శాసనమండలిలో చర్చ జరిగింది. 35-20 ఓట్ల తేడాతో ‘అనంతపురం’లోనే విశ్వవిద్యాలయం నెలకొల్పాలని తీర్మానం నెగ్గింది. కానీ విజయవాడ కేంద్రంగా కట్టమంచి రామలింగారెడ్డి వైస్‌చాన్స్‌లర్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు 1926 ఏప్రిల్‌ 26న ప్రభుత్వం ప్రకటించింది. విశ్వవిద్యాలయ కార్యాలయం విజయవాడలోను, బోధన కళాశాల రాజమండ్రి కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.

నిర్వహణలో సమస్యలు ఎదురు కాకుండా విజయవాడ విశ్వవిద్యాలయ కేంద్రంగా ఉండాలని 1927 ఏప్రిల్‌ 7న ప్రభుత్వం సెనేట్‌ను ఆదేశించింది. ఈ పరిణామం రాయలసీమ, సర్కారు జిల్లాల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. మళ్లీ 1928 డిసెంబర్‌లో సుబ్బరాయన్‌ ప్రభుత్వం విశ్వవిద్యాలయ కేంద్రాన్ని కూడా విజయవాడ నుంచి విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ రాయలసీమ సభ్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధి నుండి రాయలసీమ ప్రాంతాన్ని వేరుచేయాలని ప్రతిపాదించారు. ఈ సవరణను ఆంధ్ర నాయకులు తేలిగ్గా ఆమోదించారు. ఈ చర్యతో ఆంధ్ర రాష్ట్ర నాయకులపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఉద్యమానికి సీమ వారు దూరంగా జరిగారు.

Read :  Nalco to set up Rs 274 Cr wind power project in Kadapa District

రాయలసీమ మహాసభ

ఇక రాయలసీమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో జనవరి 27, 1934న జస్టిస్‌ పార్టీ ప్రముఖులు సీహెచ్‌ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం వంటి వారు ‘రాయలసీమ మహాసభ’ ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం జనవరి 28న ఈ సంఘం ప్రథమ సమావేశం మద్రాసులో జరిగింది. కడప జిల్లా నాయకుడు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్‌ నాయకుడు సత్యమూర్తి సభను ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఉండేందుకు పాకులాడరాదని వీరి వాదన. దీనితోపాటు రాయలసీమ కోసం తిరుపతిలో విశ్వవిద్యాలయంను నెలకొల్పాలని ఈ సభ తీర్మానించింది.

1935, సెప్టెంబర్‌లో కడపలో రెండవ ‘రాయలసీమ మహాసభ’ జరిగింది. ఈ సమావేశానికి టీఎన్‌ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చర్చకు వచ్చింది. కానీ ఈ రెండు సమావేశాలకూ కూడా రాయలసీమకు చెందిన ప్రముఖ నాయకులెవరూ హాజరుకాలేదు. రాయలసీమ మహాసభతో కాంగ్రెస్‌ అంటీ ముట్టనట్టు వ్యవహరించింది. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. రాయలసీమ మహాసభ తరఫున సీఎల్‌ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం పోటీ చేశారు. కాంగ్రెస్‌వాదుల చేతిలో పరాజయం పొందారు.

కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించి, జూలై, 14న చక్రవ ర్తుల రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తన మంత్రివర్గంలో ఒక్క రాయలసీమ ప్రాంత సభ్యునికి కూడా అవకాశం కల్పించలేదు. ఇది రాయలసీమ వాసులను కలవరపెట్టింది. కాంగ్రెస్‌ నాయకులకు కనువిప్పు కలిగించింది. కాంగ్రెస్‌ పార్టీ విజయంతో ఆంధ్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య, బలుసు సాంబమూర్తి, బ్రహ్మయ్య ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.

మారిన వైఖరి

అక్టోబర్‌ 30, 1937న బెజవాడలో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు జరిగాయి. రాయలసీమ నాయకుల అసంతృప్తిని గ్రహించిన ఆంధ్ర నాయకులు ఈ సమావేశాలలో వారికి పెద్దపీట వేశారు. ఈ సభను రాయలసీమ నాయకుడు హాలహర్వి సీతారామిరెడ్డి ప్రారంభించగా, కడప కోటిరెడ్డి అధ్యక్షత వహించారు. మదనపల్లెకు చెందిన టీఎన్‌ రామకృష్ణారెడ్డి రజతోత్సవ సభలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపూరి రామాచార్యులు రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి, సమస్యల గురించి సవివరంగా ప్రసంగించారు. రాయలసీమ భాషపట్ల ఆంధ్రులకున్న చిన్నచూపును, రాయలసీమ గ్రంథాల్ని పాఠ్యాంశాలుగా తొలగించడాన్ని, కళాశాల ఉద్యోగాలలో ఉన్న అసమానతలను వివరించారు.

ఈ వాదనల మీద తగు నిర్ణయం తీసుకునేందుకు ఇరుప్రాంతాల నాయకులతో పట్టాభి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి కడప కోటిరెడ్డి అధ్యక్షులు. కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, హెచ్‌.సీతారామిరెడ్డి, పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే రాజధాని రాయలసీమ ప్రాంతంలో ఉండడం, మంత్రివర్గంలో ఆంధ్ర, సీమవాసులకు సమప్రాధాన్యం ఇవ్వడం, సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు వంటి డిమాండ్లన్నీ ఈ సభలో వినిపించినవే.

Read :  Win Exciting Merchandise from www.kadapa.info!!

శ్రీబాగ్‌ ఒప్పందం

Rayalaseema Mapఇది జరిగిన నెల తరువాత రెండు ప్రాంతాల నాయకులు పరస్పర విశ్వాసం కోసం శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. రజతోత్సవ సభలో సీమ నేతల డిమాండ్లే ఈ ఒప్పందంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు సంబంధించి- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే వాల్తేరుతో పాటు అనంతపురంలో కూడా విశ్వవిద్యాలయ కేంద్రం స్థాపించాలి. రెండు ప్రాంతాలలో కోరుకున్న పట్టణాలలో, బోధనాంశాలకు అనుగుణంగా కళాశాలలు నెలకొల్పాలి. నీటిపారుదలకు సంబంధించి- కోస్తా ప్రాంత స్థాయిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వ్యావసాయికంగా, ఆర్థికంగా త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు నీటి పారుదల ప్రణాళికలలో కనీసం పదేళ్లు లేదా మరింత ఎక్కువకాలం ఈ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీజలాల వినియోగంలో ఈ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

నదీ జలాల పంపిణీ విషయంలో భవిష్యత్‌లో ఏదైనా వివాదం తలెత్తితే పరిష్కారంలో రాయలసీమ అవసరాలను ముందు తీర్చేవిధంగా ఉండాలి. శాసనసభ విషయంలో సాధారణ స్థానాలు జిల్లాల వారీగా సమాన నిష్పత్తిలో ఉండాలి. విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు స్థాపన ఒకచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉండేటట్లు నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాన్ని వాల్తేరులోనే ఉంచి, హైకోర్టు, రాష్ట్ర రాజధానిని మాత్రం సరైన ప్రదేశాలలో ఒకటి రాయలసీమలో మరొకటి కోస్తాలో నెలకొల్పాలి. ఈ రెండింటిలో దేనినైనా కోరుకునే అవకాశం రాయలసీమకు మొదట ఇవ్వాలి. ఇరు ప్రాంతాల ఏకాభిప్రాయంతో వాటిని సవరించుకోవచ్చు.

సీమకు అందని ద్రాక్ష శ్రీబాగ్‌

రాయలసీమ నాయకులు, కోస్తాంధ్రులతో శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్న అనంతరమే ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమాలలో మరోసారి పాల్గొన్నారు. 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధాని అయింది కూడా. కానీ ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 1956 నవంబర్‌ 1న తెలంగాణ ప్రాంతంలో కలసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చారు. ఒప్పందం మేరకు రాయలసీమలో కనీస స్థాయి నీటి పారుదల సౌకర్యాలు కూడా ఈనాటికీ కల్పించలేదు. తుంగభద్ర, కృష్ణా నదులలో ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీల నికర జలాలు లభిస్తుంటే కరువు సీమకు 122 టీఎంసీలు మాత్రమే కేటాయించారు.

సీమలో సాగుయోగ్యమైన భూమిలో కేవలం 7 శాతానికి మాత్రమే నికర జలాలు అందుతున్నాయి. అదే కోస్తాలో 80 శాతం భూమికి నికర జలాలు అందుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు ద్వారా కొంత వరదనీటిని సీమ అవసరాలకు తీసుకొంటుంటే తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంత నాయకులు ఏకమై వ్యతిరేకించారు. కనీసం ఇప్పుడైనా రాయలసీమ నాయకులు ప్రత్యేక రాష్ట్రాల గొడవలతో సంబంధం లేకుండా మొదట శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమ హక్కుల కోసం ఉద్యమించాలి.

– ఎ.హరినాథరెడ్డి,

(సాక్షి దినపత్రిక, సంపాదకీయ పుట వ్యాసం)

Check Also

APSRTC Srisailam to Kadapa Bus Timings & Schedule

APSRTC Srisailam to Kadapa Bus Timings & Schedule

Find APSRTC bus timings from Srisailam to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Srisailam and Kadapa.

APSRTC Srisailam to Proddutur Bus Timings & Schedule

APSRTC Srisailam to Proddutur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Srisailam to Proddutur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Srisailam and Proddutur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *