కడప : శ్రీరామకృష్ణ మిషన్ నగర కేంద్రం ఈ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తిచేసుకుని శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. నగరం నడిబొడ్డున ఉన్న శ్రీరామకృష్ణ మిషన్ రాయలసీమలో మొదటిది.
పశ్చిమ బెంగాల్ హౌరా రాష్ట్రంలోని బేలూరు మఠం కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న 170 శాఖలలో కడప రామకృష్ణ సమాజం
రాయలసీమలో మొదటిది. ఏర్పడిన నాటి నుంచి శ్రీరామకృష్ణ భావ ప్రచారాన్ని, విశ్వవ్యాప్తం చేస్తూ వెలుగొందుతున్న దివ్య సేవా కేంద్రం.
రామకృష్ణ బోధనలకు ప్రభావితుడైన సూఫీమతస్థుడు ఖాన్‌బహదూర్ మంజుమియా 1910లో ఇపుడు నడుస్తున్న నగర కేంద్రాన్ని మిషన్‌కు విరాళంగా అందించాడు. నాటి నుంచి రామకృష్ణ సమాజంగా, తరువాత రామకృష్ణ సేవా సమితిగా, నేడు రామకృష్ణమఠంగా ఆవిర్భవించి ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపడుతోంది.
ఘనంగా శతాబ్ధి ఉత్సవాలు -స్వామి సుకృతానంద
కడపలో రామకృష్ణ సమాజం కేంద్రం స్థాపించి ఈ ఏడాదికి నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీరామకృష్ణుల భావ ప్రచార శతాబ్ది ఉత్సవాలు ఈనెల 8 నుంచి మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ సహాయ కార్యదర్శి స్వామి సుకృతానంద తెలిపారు. స్థానిక మిషన్ నగర కేంద్రం మంజుమియా సమావేశ భవనంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ సేవా కార్యక్రమాలు నూరు సంవత్సరాలు పూర్తయినా నగరంలో ప్రత్యేక భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి 2వేల మంది ఆధ్యాత్మిక మూర్తులు, స్వామీజీలు ఉత్సవాలలో పాలు పంచుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమాలన్నీ నగర కేంద్రంలో జరుగుతాయని, పాల్గొనదలచిన భక్తులు 9441337081 నంబరును సంప్రదించాలన్నారు.