కడప జిల్లా తో పాటు రాయలసీమ జిల్లాలో తవ్వకాలు జరిపి బంగారాన్ని వెలికితీయటానికి అనుమతులు ఇవ్వాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు వరుస కట్టాయి. కడప జిల్లాలోని వెలిగల్లు ఖనిజమేఖల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. . వెలిగల్లు ఖనిజమేఖల కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల సరిహద్దు లో వందలాది చదరపు కి.మీ. విస్తరించి ఉంది.కడప జిల్లాలో వెలిగల్లు ఖనిజమేఖల గాలివీడు, చక్రాయపేట మండలాల పరిధిలోకి వస్తుంది.ఇప్పటివరకు కేవలం అనంతపురం జిల్లా రామగిరి మండలం బంగారు గనులకు ప్రసిద్ధి. ఇక్కడ తవ్వకాలు కూడా జరిపారు. అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాలేదు. దీంతో తవ్వకాలు నిలిపివేశారు.
బంగారానికి గిరాకీ పెరగటం, ప్రస్తుతం బహిరంగ విపణిలో ఈ లోహం ధరలు భారీగా పెరగటంతో మళ్లీ బంగారం తవ్వకాలకు అనుమతుల కోసం సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో అనంతపురం జిల్లా రామగిరి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్ణాటకలోని కోలార్ ప్రాంతాల్లో బంగారు గనులున్నాయి. రామగిరి దగ్గర “భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్” (బీజీఎంఎల్) 2000వ సంవత్సరం వరకు రామగిరిలో తవ్వకాలు జరిపింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.4,000-5,000 మధ్య ఉండి, ఇక్కడ లభించగల బంగారానికి, తవ్వకాలకు అయ్యే ఖర్చుకు గిట్టుబాటు కాక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తవ్వకాలు నిలిపేశారు. అయితే అక్రమంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18500 రూపాయలు ఉంది. తాజాగా తమకు తవ్వకానికి అనుమతి ఇవ్వాలని బీజీఎమ్‌ఎల్ సంస్థ దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
తాజాగా అనంతపురం జిల్లా తో పాటు సీమలోని కడప, కర్నూలు జిల్లాల్లోనూ గనులు ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లాలోని దుగ్గలి ప్రాంతంలో గనులు ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదికలు వచ్చాయి. అలాగే అనంతపురం జిల్లా రామగిరి మండలంలోనే కాకుండా తాజాగా గుంతకల్ మండలం జొన్నగిరి ప్రాంతంలో కూడా గనులు ఉన్నట్లు గుర్తించారు. అంటే, ‘సీమ’లోని 4 జిల్లాల్లో బంగారు గనులు ఉన్నట్లవుతోంది.
బంగారం తవ్వకాల్లో ఇప్పటివరకు బీజీఎంఎల్ కీలకంగా ఉంది. ఈ సంస్థకు రామగిరి మండలంలో 1.168 హెక్టార్ల భూమిలో తవ్వకాలకు గనుల శాఖ అనుమతించింది. తాజాగా కర్ణాటకకు చెందిన జియో మైసూర్ కంపెనీ, సీఆర్‌ఏ ఎక్స్‌ప్లోరేషన్స్, ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ, అమిల్ మైనింగ్ కంపెనీ, డిబీర్స్‌లు బంగారు గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు చేశాయి. కొత్తగా గనులు గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 25,000 చదరపు కిలోమీటర్లలో తవ్వకాలకు అనుమతుల కోసం గనుల శాఖకు దరఖాస్తులు అందాయి. కొత్తగా తవ్వకాలకు ముందుకు వచ్చిన కంపెనీలకు గనుల గుర్తింపునకు గనుల శాఖ అనుమతులు ఇచ్చింది.
టన్ను మట్టి శుద్ధి చేస్తే 5 గ్రాముల బంగారం
ఒక టన్ను మట్టి వెలికితీసి, దానిని శుద్ధి చేస్తే కనీసం 2 గ్రాముల బంగారం వస్తే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో ఒక టన్ను మట్టిని శుద్ధి చేసి కనీసం 5 గ్రాముల బంగారాన్ని వెలికి తీసే అవకాశం ఉందని సంస్థలు గనుల శాఖకు ఇచ్చిన దరఖాస్తుల్లో ప్రస్తావించాయి. ప్రస్తుతం గనుల శాఖకు దరఖాస్తు చేసిన సంస్థలు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చెందిన కంపెనీల నుంచి సాంకేతిక సహకారం తీసుకోనున్నాయని సమాచారం.