చక్రాయపేట: దేవుడిపై నమ్మకం, పురాతన కాలం నాటి విచిత్ర సంప్రదాయాల నడుమ మండల కేంద్రానికి సమీపంలోని యార్లవాండ్లపల్లెలో ఏద్దు వేలుపు ఘనంగా జరుగనుంది. దేవుడి బావిలోకి నీరు రావడంతో ఈ నెల 24, 25 తేదీల్లో సాంప్రదాయబద్దంగా వేలుపు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు. .గ్రామానికి పర్లాంగు దూరంలో నైరుతి దిశలో పురాతన కాలంనాటి తేమ కూడా లేని పూడిపోయిన దేవుడి బావి ఉంది. (ప్రస్తుతం 15 అడుగుల లోతు మాత్రమే ఉంది) సాంప్రదాయం ప్రకారం ఆ బావి నీరే వేలుపు కార్యక్రమానికి వాడాల్సి ఉంది. దీంతో గ్రామస్తులు బావిలో 4 అడుగుల వ్యాసంతో 5 అడుగుల లోతున గోతిని తవ్వారు.
అంతలోనే నీటి ఊట అధికం కావడంతో దేవుడు కరుణించాడని వేలుపుకు సిధ్దం అయ్యారు. అయితే నెల రోజులుగా 13 మంది ఉపవాసాలతో (ఒంటి పూట భోజనంతో) ఉంటూ వేలుపు ఎద్దును అలంకరించి పూజలు చేస్తున్నారు. ఉపవాసాలు ఉన్న 13 మంది వేలుపు రోజు చేసే కార్యక్రమాలు విచిత్రంగానూ, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని గ్రామస్తులు తెలిపారు.
ఉపవాసాలతో ఉన్న ఒక వ్యక్తి రాత్రి వేళ పెద్ద ఎత్తున మండుతున్న కాగడాను గడ్డం కింద సుమారు 15 నిముషాల పాటు పట్టుకుంటాడు. ఆ సమయంలో అతని చుట్టూ మంటలు మండుతుంటాయి. ఇదే సందర్భంలో మరోవ్యక్తి ఆవు పంచితం పట్టుకుని మంటల్లో తల ఉన్న వ్యక్తి ముఖాన్ని తుడుస్తుంటే ఇంకొక వ్యక్తి పసుపు, కుంకుమలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు.
పొంగుపాలు సందర్భంగా దేవుడి బావి నుంచి నీళ్ళు తెచ్చి పెద్ద బానలో పాలతో పాటు ఆ నీటిని పోసి కాంచుతారు. సలసల కాగుతున్న పాలను ముగ్గురు వ్యక్తులు దోసిళ్లతో తీసి పక్కనే ఉన్న మరో ముగ్గురి చేతుల్లోకి ఆకులతో పోస్తారు. ఇదే సందర్భంలో పాలు కాచడానికి పొయ్యిలా ఉంచిన కాలుతున్న రాళ్లను ముగ్గురు వ్యక్తులు ఎత్తుకుంటే పాల బానను మరో వ్యక్తి ఎత్తుకుని వెళ్ళి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. నెల రోజులుగా ఉపవాసాలతో ఉన్నవారు వేలుపు జరిగే 2 రోజులు ఆహారం తినకుండా కార్యక్రమం నిర్వహిస్తారు.
ఎద్దుకు వివాహం
యార్లవాండ్లపల్లి సమీపంలోని తిమ్మారెడ్డిపల్లి నుంచి పోతరాజుస్వామి, మహదేవపల్లి నుంచి చౌడమ్మ దేవత, గంగారపువాండ్లపల్లి నుంచి దేవర ఎద్దు వేల్పు నాటికి గ్రామానికి చేరుకుంటాయని గ్రామస్తులు చెప్పారు. 25వ తేదీ రాత్రి గ్రామ ఎద్దు (ఓబులేసు స్వామి)కు వివాహం చేసి కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పారు. 35 సంవత్సరాల క్రితం పూర్వీకులు చేస్తుండిన ఈ కార్యక్రమాన్ని ఈ యేడు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. వేలుపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు చెప్పారు.