వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో పర్యటక శాఖ రూ.3 కోట్లతో అభివృద్ధి చేయాలని పర్యటక శాఖ నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం పర్యాటక శాఖ అధకారి పుష్పగిరి స్వామి భూములను, వంతెన నిర్మాణ స్థలాన్ని మ్యాపులోనున్న వివరాలతో పరిశీలించారు. కొండపై వెలసిన శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామిని దర్శించుకోవాలంటే నదిని దాటాల్సి ఉంది...నది సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో స్వామి దర్శనం దుర్లభమే. ఇదే క్షేత్ర అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇప్పుడు పర్యాటక శాఖ నదిపై ఆలయం వరకు వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. దీంతో పాటు పుష్పగిరిలో ఆడిటోరియం, అతిథి గృహం(గెస్ట్‌హౌస్), పార్కు, గృహ సముదాయాలు నిర్మించేందుకు టెండర్లు ప్రక్రియను పూర్తి చేశారని తెలిసింది. పర్యాటక శాఖ చేపడుతున్న పనులతో క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి. వంతెన నిర్మాణం జరిగితే క్షేత్రానికి మహర్ధశ ఏర్పడి పుష్పగిరి గ్రామం కనుమరుగయ్యే ప్రమాదం నుంచి బయటపడినట్లు, ఎందుకంటే ఇప్పుటికే కొండపై నిర్మించిన తారు రోడ్డు కారణంగా భక్తులు కడప-హైదరాబాబు హైవే రోడ్డు నుంచి చెన్నూరు మీదుగా ఆలయానికి చేరుకొని చెన్నకేశవుని దర్శించుకొని పుష్పగిరికి రాకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పుడు వంతెన నిర్మాణంతో ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆలయం ఎదురుగా ఊబి ఉండటంతో అతి జాగ్రత్తగా వీధిలో దిగి ఒకరి చేతులు మరొకరు పట్టుకొంటూ వెళ్లేవారు. వంతెన నిర్మాణంతో భక్తుల కష్టాలు తీరినట్లే. శనివారం అధికారుల బృందం పుష్పరిగిలో పరిశీలనకు వస్తున్నట్లు పర్యటక శాఖ అధికారి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
స్థల ఎంపికపై మూడు శాఖల మధ్య సమన్వయలోపం:
పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో పర్యటక శాఖ నిధులు రూ.3.11 కోట్లతో చేపడుతున్న నిర్మాణాలకు స్థల ఎంపిక నిమిత్తం శనివారం అధికారుల బృందం పుష్పగిరికి తరలివచ్చింది..
పంచాయతీరాజ్ శాఖ సీఈసీవిఎస్ రామ్మూర్తి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, పర్యటక, అపిట్కో శాఖలకు చెందిన అధికారులు స్థల పరిశీలన చేశారు. పుష్పగిరికి చేరిన అధికారులకు ఆలయ కమిటీ ఛైర్మన్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ వైద్య నాదేశ్వర, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీలక్ష్మి చెన్నకేశవస్వాములను దర్శించుకున్నారు.. అనంతరం గ్రామంలో స్థల పరిశీలన చేపట్టారు. స్థల పరిశీలనలో పర్యటక, అపిట్కో, పంచాయతీరాజ్ శాఖల సమన్వయలోపం బయటపడింది. భవనాలు గ్రామంలో చేపట్టలి లేక కొండపై చేపట్టాలనే విషయంపై తర్జనభర్జన పడ్డారు. గతంలో ఆలయ కమిటీ, పర్యటక అపిట్కో శాఖలు సమావేశమై రెవెన్యూ అధికారులతో స్థల సేకరణ చేయించి పుష్పగిరి గ్రామంలో భవనాలు నిర్మించేలా తీర్మానించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు స్థల పరిశీలనకు వచ్చిన అధికారులతో కొందరు కొండపై చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో నిర్మిస్తే ఆలయం అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిర్ణయానికి వచ్చారు. దీంతో కథ మొదటికొచ్చింది. కొండపైన అని కొందరు, గ్రామంలో అని కొందరు చెబుతున్నారు. నదిపై వంతెన నిర్మించేందుకు అంగీకరించి నదిని పరిశీలించారు. ఇసుకను పరీక్షకు పంపి ఎక్కడ నిర్మించాలన్నది నిర్ణయిస్తామని సీఈ రామ్మూర్తి చెప్పారు.
పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం ఆలయ ప్రహరీ నుంచి మూడు వందల మీటర్ల వరకు నిర్మాణాల చేపట్టకూడదనే నిబంధనతో ఆలయానికి కుడి, ఎడమ వైపుల పరిశీలించారు. పంచాయతీరాజ్ ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ సురేంద్రనాథ్, డీఈ దేవదాసు, ఆపిట్కో అధికారులు గోవిందరాజు, అమరశింహారెడ్డి, పురావస్తు శాఖ అధికారి సత్యం, ఆలయ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.