అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అటవీ అధికారులు నడుం బిగించారు.ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు… శాస్త్రవేత్తలతో సమావేశమై రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు… కలివికోడి ఆధారాల కోసం ఇప్పటికే లంకమల అటవీ ప్రాంతంలో 100 కెమెరాలు అమర్చారు… ఆచూకీ లభించగలదనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు.
కడప: అరుదైన కలివికోడి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అటవీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్త రాహుల్‌చౌహాన్, డీఎఫ్‌ఓ వినోద్‌కుమార్ శుక్రవారం సమావేశ మై రూ.6 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సందర్భంగా వారు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే కలివికోడి గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన, దాని ఆవాస ప్రాంతం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసేందుకు, కొండూరులో ఎడ్యుకేషన్ సెంటర్ నెలకొల్పేందుకు చర్యలు ప్రారంభిస్తామని డీఎఫ్‌ఓ వినోద్‌కుమార్ తెలిపారు.
2009 ఆగస్టులో బద్వేలు అటవీ ప్రాంతంలో తాము కలివికోడిని చూసినట్లు శాస్త్రవేత్త రాహుల్ చౌహాన్ తెలిపారు. కలివికోడిపై 2000వ సంవత్సరం నుంచి తమ సంస్థ పరిశోధనలు నిర్వహిస్తోందన్నారు. మొదట్లో కలివికోడిని డాక్టర్ జగన్నాథం చూశారని, అప్పటి నుంచి పరిశోధనలు నిర్వహించిన ఆయన దాని ఆవాసంపై అనేక అంశాలు సేకరించారని తెలిపారు. కలివికోడి ఆధారాలను సేకరించేందుకు అటవీ ప్రాంతంలో 100 కెమెరాలను అమర్చినట్లు వెల్లడించారు. వీటి ద్వారా అటవీ ప్రాంతంలో నివశిస్తున్న అనేక జంతువుల ఆధారాలు లభ్యమవుతున్నాయన్నారు.
లంకమల్ల అభయారణ్యంలో అడవి జంతువులు సమృద్ధిగా ఉన్నాయని, ముఖ్యంగా వివిధ రకాలైన పక్షి జాతులను కెమెరాల ద్వారా గుర్తించామని తెలిపారు. వాటి నివాసానికి బద్వేలు అటవీ ప్రాంతం అనువుగా ఉన్నట్లు తమ పరిశోధనలలో వెల్లడైందన్నారు. కలివికోడి సంచరిస్తున్న ప్రాంతానికి పూర్తిగా రక్షణ కల్పించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాల ద్వారా సేకరించిన పలు సానుకూల చిత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పొందుపరిచామన్నారు.
లంకమల అటవీ ప్రాంతంలో వివిధ రకాలైన జంతువులతో పాటు, చిరుతపులుల సంచారం కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అటవీ ప్రాణుల సంరక్షణకు లంకమల అటవీ ప్రాంతం అనువైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అటవీ ప్రాంతంలో కలివికోడి అభివృద్ధి కోసం చేపట్టే పనుల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. అరుదైన కలివికోడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
– sakshi – 24/7/10