Tourist Attractions

కడప ప్రాంత శాసనాలలో రాయలనాటి చరిత్ర!

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి.

సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప  ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప  ప్రాంతంలో లభించిన రాయలనాటి శాసనాలలోని అంశాలు వేటికవే తమదైన విభిన్నతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు.  వివిధ సీమలుగా విభజింపబడిన ప్రాంతాలకు నాయంకరులను నియమించిన సందర్భాల్లో, కవులకు అగ్రహారాలను ధారవోసిన సందర్భంలో, దేవాలయాలను కట్టించిన సందర్భాల్లో,  దేవాలయాల్లో ధ్వజస్థంభాలను నిలిపిన సందర్భాల్లో, చెరువులను తవ్విన సందర్భంలో,పన్నులను విధించిన సందర్భాల్లో, పన్నులను రద్దుచేసిన సందర్భంలో ఈ శాసనాలు వేయించబడ్డాయి. ఈ శాసనాల్లో చాలా మటుకు అన్నీ తెలుగు భాషలోనే ఉండగా అక్కడక్కడా కొన్ని శాసనాలు సంస్కృతం, కన్నడ భాషల్లో కూడా లభించాయి.

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1509 నుండి  క్రీ.శ. 1529 వ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పాలన చేశారు. ఈ కాలంలో వేసిన అనేక శాసనాలు కడప ప్రాంతం లోని వివిధ చోట్ల వెలుగు చూశాయి.  పులివెందుల వద్ద లభ్యమైన క్రీ.శ. 1509 నాటి శాసనం పరిశోధకులకు లభ్యమైన రాయల శాసనాల్లో మొదటిదిగా భావిస్తున్నారు.  కడప జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి చివరి శాసనంగా ఖాజీపేట మండలం తుడుమల దిన్నెలో లభించిన క్రీ.శ. 1529  నాటి శాసనం పేర్కొనబడుతోంది. నాచరాజసోముని అగ్రహారమైన తురుమెళ్లదిన్నె గ్రామంలోని చెన్నకేశవస్వామికి ధ్వజస్థంభం నిలిపిన సందర్భంగా ఈ శాసనాన్ని వేయించారు.

rameswaram loni sanskruta sasanam
ప్రొద్దుటూరు రామేశ్వరం‌లోని సంస్కృత శాసనం

శాసనాలూ కైఫీయతులు ఆశ్చర్యం గొలిపి, ఆసక్తి రేపే ఎన్నో  చారిత్రక కథనాలనూ  మనకు అందించాయి. కడప ప్రాంతమైన కొప్పోలు గ్రామానికి చెందిన బొడ్డుచెర్ల తిమ్మన శ్రీ కృష్ణదేవరాయలనే చదరంగంలో ఓడించాడనీ రాయలు తిమ్మనను మెచ్చుకుని కొప్పోలు గ్రామాన్ని  అగ్రహారంగా ఇచ్చాడని ఒక కైఫీయతు సారాంశం.

‘‘శత సంఖ్యలొక్కటైనను
సతతము మన కృష్ణరాయ జగతీపతితో
చతురంగమాడి గెలుచును
ధృతిమంతుడు బొడ్డుచెర్ల
తిమ్మన భళిరే!’’

అనే చాటువు కూడా జనం లో పరివ్యాప్తమైంది.

కృష్ణరాయలు ప్రతి ఆటలోను ఓడిపోయినట్టు ఈ చాటువు ద్వారా తెలుస్తోంది.
ఒక సారి కూచిపూడి భాగవతులు విజయనగర రాజధాని హంపీకి ఈ ప్రాంతం మీదుగా వెళుతున్నారట! సంబెట గురువరాజు అనే స్థానిక పాలకుడు తన ఏలుబడిలోని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చుకుంటూ ఒక  గ్రామంలో మజిలీ చేశారట!  పన్నుల పేరుతో మహిళలను పీడిస్తుండగా కూచిపూడి భాగవతులు గురువరాజు ఘోర కృత్యాలను చూసి  చలించిపోయారట! భాగవతులు విజయనగరం వెళ్లిన తర్వాత  శ్రీ కృష్ణదేవరాయల ఎదుట గురువరాజు అకృత్యాలను వీధినాటకంగా ప్రదర్శించారట. గురువరాజు పాశవిక చర్యలను తెలుసుకున్న రాయలు గురవరాజుపై సైనిక చర్య తీసుకుని ప్రజలకు ఊరట కల్పించారట. ఈ ఉదంతం మాచుపల్లె కైఫీయతులో చోటు చేసుకుంది.

Read :  Chiranjeevi greeted with eggs, slippers

కృష్ణరాయలు కాలంలో సైతం కళాకారులు తమ ప్రదర్శనలకు సామాజిక స్పృహను జోడించారన్న విషయం మాచుపల్లె కైఫీయతు ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీ కృష్ణదేవరాయలకు భూమానాయుడు అనే గొడుగుపాలుడి కథ కూడా ఎంతో ఆసక్తికరమైనదే! కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి హంపీ విజయనగరానికి గుర్రంపై స్వారీ చేస్తోంటే గుర్రం వెంట పరిగెడుతూ భూబానాయుడు గొడుగు పట్టాడట. ఇందుకు మెచ్చుకున్న రాయలు గొడుగుపాలునికి ఒక రోజంతా అగ్రహారాలనూ, మాన్యాలనూ దానం చేసే అధికారం ఇచ్చారట!

ఆయన ఎర్పరిచిన అగ్రహారాలకు భూమానాయుని పల్లెలు అవతరించాయి. ఇప్పటికీ భూమాయపల్లె పేరుతో కడప ప్రాంతంలో అనేక పల్లెలు ఉండటం మనం గమనిస్తాం. ఖాజీపేట మండలం, మైదుకూరు మండలం, ఎర్రగుంట్ల మండలాల్లో భూమాయపల్లె, భూమానాయుడుపల్లె ఉన్నాయి. ఈ విషయం ఎర్రగుంట్ల మండలంలోని కోడూరు  కైఫీయతు తెలుపుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో గండికోట నాయంకరులను నియమించినట్లుగా వేయించిన శాసనాల్లో ఇప్పటిదాకా 19 శాసనాలు  లభించాయి. వీటిలో ఆరు  శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శాసనాలు . గండికోటను సాళువ తిమ్మరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1517 నాటి గూడూరు శాసనం తెలుపుతోంది. అవసరం తిమ్మరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1525 నాటి తలమంచిపట్నం శాసనం ద్వారా తెలుస్తోంది. గండికోటను అవసరం దేమరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1526 నాటి నేకనాంపేట శాసనం వెల్లడిస్తోంది. సాళువగోవిందయ్యకు  నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1527 నాటి ఉప్పలూరు శాసనంద్వారా తెలుస్తోంది. రాయసం అయ్యపరుసయ్యకు నాయంకరంగా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1528 నాటి పందిళ్ల పల్లె,  క్రీ.శ.1529 నాటి కత్తెరగండ్ల శాసనాలు తెలుపుతున్నాయి.

శ్రీకృష్ణదేవరాయలు తర్వాతి పాలకులైన అచ్యుతదేవరాయలు, సదాశివదేవరాయలు కాలంలో దాదాపు 15 శాసనాలు గండికోట నాయంకరానికి సంబంధించినవి వెలుగులోకి వచ్చాయి.

శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కడప ప్రాంతం లోని దేవాలయాల్లో  నైవేద్యం, అంగరంగవైభవాలకు గ్రామాలను దానంగా ఇచ్చినట్లుగా కూడా అనేక శాసనాలున్నాయి. గండికోట సీమలో వెలుగు చూసిన శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి మొదటి శాసనంగా  క్రీ.శ. 1509 నాటి పులివెందుల శాసనాన్ని పేర్కొంటున్నారు. విజయవాడ

మాధవవర్మ వంశీయుడైన నరసయ్యదేవ మహారాజు పులివెందుల సమీపంలోని కుందలూరు గ్రామాన్ని శ్రీరంగనాధస్వామి నైవేద్యం, అంగరంగవైభవాలకు సమర్పించినట్లుగా ఈ శాసనం తెలుపుతోంది.

గండికోట, సిద్దవటం, ములికినాడు, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి, కందనవోలు(కర్నూలు), రాయదుర్గం సీమల్లో అమల్లో ఉన్న పెండ్లి సుంకాన్ని శ్రీకృష్ణదేవరాయల ఉత్తర్వు ప్రకారం  మంత్రి తిమ్మరుసు రద్దు చేసినట్లుగా క్రీ.శ. 1510 నాటి రామేశ్వరం (ప్రొద్దుటూరు) శాసనం ద్వారా తెలుస్తోంది. సంస్కృతంలో చెక్కబడిన ఈ శాసనం ప్రొద్దుటూరు రామేశ్వరం గుడి గోపురం ముంగిట మరికొన్ని శాసనాలతో పాటు ఇప్పుడు కూడా ఉంది.

Read :  Dry weather to prevail in Rayalaseema over next 48 hours

ఆంద్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన కోకటం గ్రామంలోని సకలేశ్వర స్వామి దీపారాధన కోసం పది ఖండుగల భూమిని దానంగా ఇచ్చినట్లు క్రీ.శ. 1518 నాటి కోకటం గ్రామ శాసనం తెలుపుతోంది.

కమలాపురం సమీపంలోని తిప్పలూరు గ్రామాన్ని కృష్ణదేవరాయలు అష్టదిగ్గజకవులకు అగ్రహారం గా ఇచ్చినట్లుగా క్రీ.శ. 1527 నాటి తిప్పలూరు శాసనం వెల్లడిస్తోంది.

పుష్పగిరి ప్రాంత దొమ్మరులు ఆ గ్రామకాపులు తమకు చెల్లించే దొమ్మరిపన్నును చెన్నకేశవస్వామి దీపారాధనకు, పూలతోటలకు తమ 24 కులాల వారికి పుణ్యముగా దానమిచ్చినట్లు క్రీ.శ. 1519 సంవత్సరం నాటి పుష్పగిరి శాసనం ద్వారా తెలుస్తోంది.

ఆనాడు సకిలిసీమగా పిలువబడిన పోరుమామిళ్ల సమీపంలోని చెన్నవరం గ్రామంలో వ్యాపారుల ద్వారా లభించే గ్రామకట్నం, గానుగకట్నం, మగ్గం పన్నులను కత్తెరగండ్ల లోని చెన్నకేశవస్వామి అమృతపడి సేవకు, అంగరంగవైభవాలకు దానమిచ్చినట్లుగా క్రీ.శ. 1525 నాటి కత్తెరగండ్ల శాసనం వివరిస్తోంది.

కమలాపురం సమీపంలోని పందిళ్లపల్లె కేశవరాయ ఆలయంలో డోలూ, సన్నాయి వాయించి ఊడిగం చేసినందుకు తిమ్మోజు అనే నాయీబ్రాహ్మణునికి ఒక ఖండుగ మాన్యాన్నీ, పెరుమాళ్ల సంకీర్తనకు ఓబులదాసరికి మరో ఖండుగ మాన్యాన్నీ దానం చేసినట్లుగా క్రీ.శ. 1528 నాటి పందిళ్లపల్లె శాసనం వల్ల తెలుస్తోంది.

మైదుకూరు మండలం వనిపెంటలో  నిర్మితమైన కోటను  క్రీ.శ. 1528 లో కృష్ణదేవరాయలు నారప నాయుని పినఅహోబలనాయునికి వార్షిక రుసుమునకు ఇచ్చినట్లుగా 1914 వ సంవత్సరంలో ప్రచురితమైన కడప జిల్లా గెజిట్‌లో పేర్కొన్నారు. క్రీ.శ 1525లో వనిపెంట సమీపంలో తూర్పున ఒక చెరువు ను నిర్మించినట్లు, తర్వాత కాలంలో ఆ చెరువు తెగడంతో అక్కడి చెన్నకేశవాలయంలో కొంత భాగంతో పాటు ఆలయ ప్రహారీ

గోడలు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు ఆలయ ప్రాకారంపై ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. మైదుకూరు మండలం గంజికుంటసీమ నాయంకరుడు బక్కరాజు తిమ్మరాజు అనుచరుడైన నారపనాయుని

అహోబలనాయుడు వనిపెంట గ్రామాన్ని రాయసం గంగరుసుకు గుత్తకు ఇచ్చినట్లు గంగరుసు వనిపెంటకు తూర్పున చెరువును నిర్మించినట్లు  వనిపెంట చెన్నకేశవస్వామి దేవస్థానంలో లభించిన క్రీ.శ. 1521 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. అలాగే మైదుకూరు మండలం ఎల్లంపల్లె వద్ద కొండపై వెలసిన  శ్రీతిరువెంకటనాధుని ఉత్సవ కైంకర్యాలకు మైదుకూరు సమీపంలోని పేరనిపాడు, గడ్డంవానిపల్లె గ్రామాలను దానంగా ఇచ్చినట్లు కొండ పశ్చిమబాగంలోని వనంలో లభించిన శాసనంద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1528లో శ్రీకృష్ణదేవరాయలు పేరనిపాడు పరిపర గ్రామాలను సంగమయ్య అనే బ్రాహ్మణునికి కరణీకంగా ఇచ్చినట్లుగా గడ్డంవానిపల్లె లోని హనుమంతరాయ గుడివద్ద లభించిన  శాసనం ద్వారా వెల్లడవుతోంది. మైదుకూరు మండలం తువ్వపల్లెను కృష్ణదేవరాయలు బ్రాహ్మణ అగ్రహారంగా చేశారు. అగ్రహార యజమాని అయ్యవారప్ప తువ్వపల్లెకు తూర్పున గొప్ప చెరువును తవ్వించాడు.

కృష్ణదేవరాయలు కాలంలో దువ్వూరు నాయంకరుడిగా వ్యవహరిస్తూ ఉండిన  పర్వతయ్య దేవమహారాజు కోన తిరువెంగళనాథునికి దాసరిపల్లెను దానమిచ్చినట్లు క్రీ.శ. 1515 నాటి శాసనంలో ఉంది.కొర్రపాడు గ్రామంలోని చెన్నకేశవాలయానికి భూములను మాన్యంగా ఇచ్చినట్లు క్రీ.శ. 1527 నాటి కొర్రపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. జమ్మలమడుగు సమీపంలోని బోడితిప్పనపాడును ఉమామహేశ్వర పురమనీ, మేడిదిన్నెను కృష్ణరాయపురమనీ రాయలకాలంలో పిలిచేవారట! మేడిదిన్నెను నాగదేవభొట్లు అనే బ్రాహ్మణునికి అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ద్వారా వెల్లడయింది. జిల్లాలో కృష్ణరాయపురం పేరుతో అనేక గ్రామాలకు ప్రతినామకరణం చేయడాన్ని కూడా శాసనాలద్వారా గమనించవచ్చు.

Read :  Online,Electronic and Print media Directory - Mydukur

ఖాజీపేట మండలం పత్తూరు పాలెగాడుగా ఉండిన ముసలినాయుడు తిరుగుబాటు చేయగా  కృష్ణదేవరాయలు అణచివేశాడని, కృష్ణదేవరాయలు పుష్పగిరిని సందర్శించిన సందర్భంగా ముసలినాయుడు లొంగిపోయాడని మెకంజీ కైఫీయతులలో పేర్కొనబడింది. శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరి ఆలయంలో ఇతర కులాల వారు అర్చకత్వం చేస్తుండగా వారిని మానిపించి బ్రాహ్మణులను పూజారులుగా నియమించినట్లు చెప్పబడుతోంది.

విజయనగర కాలంలో కడప ప్రాంతంలో పాలనాభాధ్యతలను నిర్వర్తించిన  అయ్యపరుస నాయకుడు, మత్తకుమరయ్య, దేవచోడమహారాజు, పెద్దతిమ్మరుసయ్య, రాజరాజ బుక్కరాజు, తిమ్మరాజు, నాగపనాయుడు, సైన్యాధికారులు రాయసం కొండమరుసయ్య, కమలనాయకుడు తదితరుల పేర్లు కడప జిల్లాలో లభ్యమైన శాసనాల ద్వారా వెల్లడవుతున్నాయి.

కడప ప్రాంతంలోని వెల్లాల, దొమ్మర నంద్యాల, పాలూరు, పెద్దముడియం, మోరగుడి, తొర్రివేముల, యనమలచింతల, పొట్టిపాడు, వెనికేకాలువ, మచ్చుమర్రిగంగాపురం, అరకటవేముల, దాసరిపల్లె, గడ్డంవానిపల్లె, సిద్దవటంసమీపంలోని రేకులకుంట,మేడిదిన్నె, చిన్నమాచుపల్లె, పొందలూరు, తుమ్మలమేరు, ప్రొద్దుటూరు సమీపం లోని ఉప్పరపల్లె, కొర్రపాడు గ్రామాల దేవాలయాల వద్ద కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి శాసనాలు లభించాయి.

ప్రముఖ పరిశోధకులు, సాహితీవేత్త శ్రీరాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, సరస్వతీపుత్ర డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆచార్య తిరుమల రామచంద్ర, లాంటి మహనీయులు తమ రచనల ద్వారా శ్రీకృష్ణదేవరాయల నాటి ప్రజాజీవితాన్నీ, చారిత్రక విశేషాలనూ మనకు అందించారు. డొమింగో పేజ్‌, ట్రావెర్నియర్‌, కల్నల్‌ మెకంజీ, సి.పి.బ్రౌన్‌ విజయనగర సామ్రాజ్య వైభవాన్ని భావితరాలకు అందించే కృషి జరిపారు. శ్రీ అవధానం ఉమామహేశ్వర శాస్త్రి కడప జిల్లా శాసనాలు, చరిత్ర అనే అంశంపై పరిశోధన చేసి పరిశోధనాంశాన్ని గ్రంథస్థం చేశారు. చరిత్ర పరిశోధకులు జి. శ్రీనివాసులు తన గండికోట సీమ చరిత్ర గ్రంథంలో విజయనగర కాలంనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కోణంలో అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. విద్వాన్‌ కట్టా నరసింహులు కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం ద్వారా కైఫీయతులపై పరిశోధన చేశారు.

పురావస్తు శాఖ , చరిత్రకారులు మరింతగా దృష్టి సారిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలతో పాటు విజయనగర పాలకులకు చెందిన మరెన్నో శాసనాలు వెలుగుచూసే అవకాశం ఉంది.  మైదుకూరుకు చెందిన ‘ తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ’ చొరవతో  ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో  బుక్కరాయల కాలం(14వ శతాబ్దం) నాటి  అరుదైన శాసనం వెలుగు చూసిన ఉదంతమే ఇందుకు తార్కాణం!

తవ్వా ఓబుల్‌ రెడ్డి

Check Also

Tippayapalli (Khajipet Mandal)

Tippayapalli is a village in Kahajipet Mandal of YSR District. Tippayapalli is part of B.Kothapalli Gram Panchayat. Principle occupation of the people is Agriculture.

Municipalities Information – YSR District

Information of the Municipalities in Kadapa District. Number of wards and revenue villages within each …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *