: కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయాలని రెల్వే శాఖ మంత్రి మమతాబెన ర్జీకి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఢిల్లీలో ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. రూ. 1000.23 కోట్ల అంచనాలతో 255 కిలోమీటర్ల పొడవునా వేసేందుకు 2008-2009లో ఈ కొత్త రైల్వే లైన్‌ను మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో తమ వాటాను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అయితే ఇంతవరకు కేంద్రం నిధులను కేటాయించలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు.రిజర్వు ఫారెస్టులో మిగిలిన పనులు చేయాల్సి ఉందని, అందుకు అటవీ శాఖ అనుమతి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టు మొదటి దశ పనులకు రైల్వే బోర్డు నుంచి అనుమతి రావాల్సి ఉందని వివరించారు. కడప నుంచి బెంగళూరుకు రెండు మార్గాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమెకు తెలియజేశారు. కడప- వేంపల్లి- వెల్లటూరు మీదుగా బెంగుళూరుకు, కడప – ముద్దనూరు – తొండూరు – పులివెందుల – వేంపల్లి మీదుగా బెంగళూరుకు లైన్‌ను నిర్మించే వీలుందని, ఈ రెండు రూట్లు కూడా కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయని వివరించారు.ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి మమతాబెనర్జీ దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు..
– బనగానపల్లి నుంచి క ర్నూలుకు కొత్త లైన్ వేయాలని కోరారు. దీంతో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు మధ్య దూరం తగ్గనుందని పేర్కొన్నారు.ప్రొద్దుటూరు-కంభం మధ్య మరో లైన్ వేస్తే విజయవాడ నుంచి కడప, అనంతపురం చేరుకోవడం సులభం అవుతుందని తెలిపారు.ఈ ప్రతిపాదనలను పరిశీలించి, అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో రైల్వే సదుపాయాన్ని కల్పించాలని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు ఇతోధికంగా సహకరించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. రైల్వే లైన్లతో ఈ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని తద్వారా ఉపా«ధి అవకాశాలు పెరుగుతాయనాృరు. సిమెంటు ఫ్యాక్టరీలు, స్టీలు కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు….
కడప నియోజకవర్గం పరిధిలో ఎర్రగుంట్ల-నంద్యాల రైల్వే లైన్‌ను 122 కిలో మీటర్ల మేర రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మిస్తుండగా ఇందులో 48 కిలోమీటర్ల పొడవునా ట్రాక్ వేసేందుకు రూ. 240 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మరో రూ. 24 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని కోరారు. మిగిలిన రూ. 238 కోట్లను 2010-2011 బడ్జెట్‌లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా 2010-2011లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. పుల్లంపేట-గుత్తి మార్గంలో 260 కిలోమీటర్ల పొడువునా చేపట్టిన డబ్లింగ్ పనుల్లో పుల్లంపేట నుంచి బాకారాపేట వరకు (43 కిలోమీటర్లు) డబ్లింగ్ పూర్తయిందని, ఇది వచ్చే నెలలో వినియోగంలోకి రానుందని వివరించారు. మిగిలిన సివిల్ పనులను రూ. 170 కోట్లు, సిగ్నలింగ్, ఇతర సదుపాయాల కల్పనకు రూ. 85 కోట్లు, విద్యుద్దీకరణకు రూ. 100 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ల పరిస్థితి..
23 కిలోమీటర్ల పొడవున ఉన్న కడప-కమలాపురం ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయ్యాయి.
29 కిలోమీటర్ల పొడవునా కమలాపురం-ముద్దనూరు మధ్య జరుగుతున్న పనులు 80 శాతం పూర్తయ్యాయి. కొండాపురం-రాయలచెరువు మార్గంలో 55 కిలోమీటర్ల పొడవున చేపట్టిన మట్టి పనులు 2010 డిసెంబరు వరకు పూర్తి కావల్సి ఉంది.
ఈ మిగిలిన పనులన్నీ పూర్తి చేసేందుకు 2010 2011 బడ్జెట్‌లో కనీసంగా రూ.125 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కడప విమానాశ్రయ పనులకు నిధులివ్వండి
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌ను కడప ఎంపీ వైఎస్. జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రఫుల్ పటేల్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కడప విమానాశ్రయానికి సంబంధించిన మొదటి దశ పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. రూ.20 కోట్లతో 6 వేల అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పుతో రన్‌వేతో పాటు యాప్రాన్, కాంపౌండు గోడ, ట్యాక్సీ వే పనులు గత ఏడాది డిసెంబర్ నాటికే పూర్తయ్యాయన్నారు. దీంతో ఏటీఆర్-72 ఎయిర్‌క్రాఫ్ట్స్ ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. అయితే, మాడ్యులర్ టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, ఏటీసీ టవర్, సీసీఆర్, పవర్‌హౌస్, డీవీఓఆర్ బిల్డింగ్, ఫైర్‌స్టేషన్, అప్రోచ్‌రోడ్లు, గ్రౌండ్ లైటింగ్ తదితర పనులను ఇంకా పూర్తిచేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ పనులను పూర్తిచేసేందుకు రూ.80 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. తద్వారా విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు సాధ్యమవుతుందని, బోయింగ్, ఎయిర్‌బస్-320 విమానాల రాకపోకలను ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అదేవిధంగా చిన్నమచ్చుపల్లి గ్రామంలో 31 ఎకరాల భూమిని కూడా సేకరించాల్సిన అవసరం ఉందని కడప ఎంపీ జగన్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో నిధులను విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. |