దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. 3న తేదీన దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
4న తిరుచ్చి ధ్వజారోహణ, చంద్రప్రభ వాహనం, 5న సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం, 6న చిన్న శేషవాహనం, సింహావాహనం, 7న కల్పవృక్షవాహనం, హనుమంత వాహనం, 8న సర్వభూపల వాహనం, గరుడవాహనం, 9న కళ్యాణోత్సవం, గ్రామోత్సవం, గజవాహనం, 10న రథరోహణ, ఆశ్వవాహనం, 11న ముత్యపు పందిరి వాహనం, హంస వాహనం, 12న వసంతోత్సవం, చక్రస్నానం, తిరుచ్చి ధ్వజారోహణ, 13న పుణ్యాహ వచనం, హోమం, పుష్పయాగం, పూర్ణాహుతి, పాన్పు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలు నిర్వహించే తొమ్మిది రోజుల పాటు స్వామివారు ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని ధర్మప్రచార పరిషత్, అన్యమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్‌ల్లోని సిబ్బంది చే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి . 9వ తేదీ ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు 300 రూపాయలు చెల్లించాలని టీటీడీ పీఆర్వో రవి తెలిపారు. 13వ తేదీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తిరుమలేశుని తొలిగడప దేవుని కడప ఆలయం గురించిన విశేషాలు..
దేవుని కడపను తిరుమల క్షేత్రానికి తొలి గడపగా భావిస్తారు. దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.
1. కడప నగరానికి ఉత్తర దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో దేవుని కడప ఉంది.
2. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయానికి ఎడమవైపు శ్రీ పద్మావతిదేవి అమ్మవారి ఆలయం ఉంది.
3. పూర్వం ఉత్తర ప్రాంత యాత్రికులు ఈ క్షేత్రం నుంచే తిరుమలకు వెళ్లేవారు. ఇక్కడి స్వామిని దర్శించుకుని వెళితేనే తమ యాత్ర సంపూర్ణంగా జరిగినట్లు భావించేవారు.
4. ఈ ఆలయంలో స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆయన పేరిట ఈ ప్రాంతాన్ని కృపానగరంగా పిలిచేవారు. ఆ పేరు క్రమంగా కృపాపురం, కురప, కుడప, కడపగా మారింది.
5. విజయనగర రాజులు, నంద్యాల మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయా రాజులు స్వామికి బంగారు నగలు, మడి మాన్యాలెన్నో సమర్పించారు.
6. ఆలయం గోడలపై కన్నడ మిళిత తెలుగులో ఎనిమిది శాసనాలున్నాయి. మూడు కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఆలయ ప్రహరీలో (పాత గోడలో) ఎనిమిది కుడ్య చిత్రాలుండేవి.
7. ఆలయంలో ఉత్తర దిశన విశ్వక్సేన, గణపతి, ఆండాళ్ తాయార్‌ల మందిరాలు, దక్షిణం వైపున ఆళ్వార్ల మందిరాలు ఉన్నాయి. ప్రాంగణంలో నాగుల విగ్రహాలూ, శమీవృక్షం (జమ్మిచెట్టు) ఉన్నాయి. అమ్మవారి ఆలయ మండపం పైకప్పులో కంచిలో లాగా రెండు రాతి బల్లులున్నాయి. దోష నివారణ కోసం భక్తులు వాటిని తాకుతుంటారు.
8. ముస్లింలు కూడా స్వామిని దర్శిస్తారు. ఉగాది రోజున భత్యం సమర్పించుకుంటారు.
9. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామిపై 12 కీర్తనలు రాశారు.
10. ఆలయానికి ఎదురుగా ఉత్తరం వైపున విశాలమైన పుష్కరిణి (కోనేరు) ఉంది.
11. ఆలయ ప్రాంగణంలో మండపం ఉంది.
12. స్వామి మూల విగ్రహానికి వెనుక 15 అడుగుల ఆంజనేయస్వామి కుడ్య చిత్రం ఉంది. ఆలయం ఎదురుగా 50 మీటర్ల దూరంలో కూడా ఆంజనేయస్వామి ఆలయం, ఉత్తరం వైపు శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం ఉంది.
13. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌడ్యమి నుంచి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజున భారీగా రథోత్సవం జరుగుతుంది.
14. 2006 సెప్టెంబరు 9న ఈ ఆలయం టీటీడీలో విలీనమైంది.