పులివెందుల : పులివెందులలోని శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈఓ జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న గరుడ వాహన సేవ, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం ఉంటాయన్నారు. తొలిరోజు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారిని ఊరేగిస్తారన్నారు. 30వ తేదీన సింహావాహనం, 31న శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
ఫిబ్రవరి 1వ తేదీన హనుమద్ వాహన సేవ, 5న అశ్వ వాహన సేవ ఉంటాయన్నారు. 6వ తేదీన పగలు వసంతాలు, వసంతోత్సవం నిర్వహించి హంస వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు. ధ్వజరోహణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు:
శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
29వ తేదీన శ్రీస్వామి వివేకానంద ఇంగ్లీషు మీడియం స్కూలు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, 30న తిరుపతి సీతాలకి భాగవతారణిచే, 31న ప్రమీల భాగవతారిణిచే. ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతికి చెందిన విజయలకి భాగవతారిణిచే, 2న తెనాలికి చెందిన మొగలిచెర్ల నాగమణిచే హరికథ, 3వ తేదీన డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు బృందంచే సాసవల చిన్నమ్మ నాటక ప్రదర్శన ఉంటాయి. ఫిబ్రవరి 4వ తేదీన శ్రీగంధర్వ కళామండలి ఆధ్వర్యంలో సప్తమాంకములు అనే నాటక భాగాలు, 5వ తేదీన శ్రీ శివజ్యోతి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం, 6వ తేదీన శ్రీవివేకా అర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీసత్య హరిశ్చంద్ర నాటకాలను ప్రదర్శిస్తారు.